”శోధిని”

Sunday 28 December 2014

అభిషేక ప్రియుడు !



సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు.  ఈ రోజున అభిషేక ప్రియుడు అయిన  పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల విశేష ఫలప్రదమని చెబుతారు.   ఈశ్వరుడు  ....సమస్త దారిద్ర్యాలను, దుఃఖాలను హరించే భోళాశంకరుడు.  మనస్పూర్తిగా, భక్తిపూర్వకంగా ' శివా ' అని పిలిస్తే చాలు సకల పాపాలను, దుఃఖాలను పోగొడతాడు. 

కీసరగుట్ట పైన హనుమంతుని విగ్రహం !

ఆద్యాత్మికతకు, ఆహ్లాదానికి నెలవుగా విరాజిల్లుతోంది హైదరాబాద్ సమీపంలో వున్న  కీసరగుట్ట.  కొండల మధ్య ప్రశాంత వాతావరణంలో కీసరగుట్ట పై కొలువున్న శ్రీరామ లింగేశ్వరస్వామి నిత్యపూజలు అందుకుంటున్నాడు.  ఆలయ పరిసరాలలో వున్న పచ్చని వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతుంది... గొప్ప అనుభూతిని కలుగజేస్తుంది... ప్రకృతి రమణీయత కళ్ళను కట్టి పడేస్తుంది.  ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఎత్తైన హనుమంతుని విగ్రహం  ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

Wednesday 24 December 2014

'క్రిస్మన్' శుభాకాంక్షలు !

దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు క్రిస్మస్.   అందుకే ఈరోజు భక్తి శ్రద్దలతో పవిత్రంగా  పండుగ చేసుకుంటారు.   ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని ఏసుక్రీస్తు చెప్పాడు. ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు.   క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.  క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడాలి.  " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు... పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు..." ఇలాంటి వాక్యాలు కోకొల్లలు.  మిత్రులందరికీ  'క్రిస్మన్' పర్వదిన శుభాకాంక్షలు. 

Tuesday 23 December 2014

దర్శక,నిర్మాతలలో మార్పు రావాలి!



మహిళలు ఏ రంగంలో నైనా పురుషులకు దీటుగా తమ సత్తా చూపిస్తున్నారు.  కానీ సినిమా రంగంలో మాత్రం అందుకు బిన్నంగా ఉంది.  స్త్రీ పురోగతి, పురోభివృద్ది మన తెలుగు సినిమాలమో అసలు కన్పించవు.  ఎంతసేపు హీరోహిన్ అనబడే స్త్రీమూర్తిని నటనలో ఆటబొమ్మగా, పాటలలో శృంగారతారగా ఉపయోగించుకుంటున్నారు.  ఈ మధ్య ఇంకొక అడుగు ముందుకేసి ఐటెంసాంగ్ అనే పేరుతో  హీరోయిన్స్ చేత  అభ్యంతకరమైన డ్రస్సులు, డ్యాన్సులు  వేయిస్తున్నారు.   మన దర్శకనిర్మాతలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు నిర్మించకపోయినా పర్వాలేదు.  కనీసం సమాజాన్ని నాశనం చేసే సినిమాలు నిర్మించకుంటే చాలు. వాళ్ళ కున్న క్రియేటివిటీని మంచి సినిమాలను రూపొందించడానికి ఉపయోగించాలి కానీ, డబ్బు  కోసం చెత్త సినిమాలు తీసి సమాజాన్ని చెడకొట్టవద్దు. సంఘంలో ప్రతి మనిషికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.  కానీ, సినిమాలు తీసే వాళ్ళకి ఇలాంటి కట్టుబాట్లు లేకపోవడం శోచనీయం.  సమాజం పైన కనీస భాద్యతలు లేవు.  ప్రతి విషయాన్ని డబ్బుతోనే చూస్తారు... డబ్బుకోసం  వ్యంగ్య, బూతు సినిమాలను తీస్తూనే ఉంటారు.   ఒకసారి పాత సినిమాలను చూడండి.  ప్రతి సినిమాలో ప్రజలకు ఉపయోగపడే ఎదోక సందేశం ఉంటుంది.  ఇప్పటికైనా సినీ పెద్దలు మేల్కొని స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఔనత్యాన్ని ఉన్నతంగా చూపించే చిత్రాలు నిర్మిస్తే సమాజం హర్షిస్తుంది.


Saturday 13 December 2014

వృద్దులు... మన పూజ్యులు!

వృద్దులు అమృత హృదయులు. వారు తమ సంతానాన్ని బాల్యంలో ఎంత చక్కగా సంరక్షించారో అంతకంటే ఎక్కువగా వృద్ధాప్యంలో వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృద్దాప్యంలో వారిని నిర్లక్ష్యం చేసి శోకించే స్థితి కల్పించకూడదు. అందరూ ఉండి కూడా చాలా మంది వృద్దులు అనాదాశ్రయాలలో బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. వారిని కష్టపెట్టడం ఇంటికి క్షేమం కాదు... మనకు మంచిది కాదు. మన జీవితం వారు పెట్టిన బిక్షం. వారి ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. మన కన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు కాబట్టి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన ధర్మం. వారు ఎన్నో భాదలు అనుభవించి చనిపోయిన తరువాత ఘనంగా పితృకర్మలు ఆచరించే కంటే, వారు బ్రతికుండగా వారిని అక్కునచేర్చుకుని సంతోషపెట్టడం అన్ని విధాల సముచితం. పెద్దలను పుజ్యునీయులుగా చూడలేని వారు దైవారాధన చేయడం శుద్ధ దండగ.

Sunday 7 December 2014

బాల్యస్మృతులు !


జీవితంలో మధురమైన ఆణిముత్యాలు
మళ్ళీ మళ్ళీ తిరిగిరాని మధుర జ్ఞాపకాలు
చిన్ననాటి కమనీయమైన తీపి గురుతులు !
అమ్మా-నాన్న బొమ్మలాటలు ...
చెడుగుడు... గోళీలాటలు...
కర్రా బిల్ల ...బొంగరాలు ...
కోతికొమ్మచ్చి..కాగితాల పడవలు ...
బిళ్ళాగోడు ...పీచుమిఠాయిలు...
గుడిలో ప్రసాదానికి తోపులాటలు ...
తూనీగల వెంటపడే తుంటరి తనాలు ...
జామ , మామిడికాయల దొంగతనాలు ...
ఇవన్నీ చిన్ననాటి చిలిపి చేష్టలు
స్వచ్చమైన అపురూప సౌరభాలు
మరువలేని మరుపురాని బాల్యస్మృతులు !

Sunday 30 November 2014

చిన్నారుల బోసినవ్వులు !


చిన్నారుల చిరునవ్వులు ...
విరిసిన హరివిల్లులు
కురిసే తొలకరి జల్లులు !
చిన్నారుల బోసినవ్వులు ...
విరిసిన మందారాలు
కల్మషంలేని నిర్మలదరహాసాలు !
చిన్నారుల పకపకనవ్వులు ...
విరిసిన మరుమల్లెలు
కుట్రలు తెలియని దరహాసచంద్రికలు !
చిన్నారుల కిలకిలనవ్వులు ...
ఆహ్లాదపు విరిజల్లులు
కన్నవారి భాద్యతనుగుర్తుచేసే
విద్యా కుసుమాలు !


Thursday 20 November 2014

అదా... సంగతి !

భార్య  : ఆఫీసుకు వెళ్తూ చీపురు ఎందుకండీ ?
భర్త    : ఈ రోజు మా ఆఫీసులో స్వచ్ఛభారత్ పోగ్రాం ఉంది.
భార్య  : ఇంట్లో చీపురు పట్టుకోమంటే ఎగిరెగిరి పడతారు...ఆఫీసులో ఊడ్చడానికి మాత్రం మహా సంబరం.
భర్త    : ఓసీ వెర్రిమొహమా...అక్కడ మేము శుభ్రం  చేసేది ఏమీ ఉండదు.  చీపురు పట్టుకుని ఫోజులిస్తే చాలు
           వెంటనే ఫోటో తీస్తారు. రేపు న్యూస్ పేపర్లో మా గురించి గొప్పగా రాసి ఫోటో వేస్తారు.
భార్య  : 'పబ్లిసిటీ కోసం పగటి వేషం' అంటే ఇదే కాబోలు !


Tuesday 18 November 2014

ఆధునికతరం యువతి !

                 కొత్తకాపురానికి వెళ్తున్న కూతురికి  జాగ్రత్తలు చెబుతూ ...
తల్లి          : చూడమ్మా ...నువ్వుచేసిన వంట ముందుగా నీ భర్తకు, అత్తా మామలకు వడ్డించి,
                 వాళ్ళు తిన్న తరువాత నువ్వు తినాలి.   ముందుగా నువ్వు తినకూడదు.         

కూతురు :  అర్థమైంది మమ్మీ ... వాళ్ళకేమీ కాలేదని తెలిసిన తరువాత నేను తినాలి.. అంతేగా !

తల్లి         :  ఆ (...

Monday 17 November 2014

కార్తీక చివరి సోమవారం !

 
శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగించే పవిత్రమైన మాసం కార్తీకమాసం.  ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.  కార్తీకమాసంలో మనం పాటించే నియమాలే మనకు భగవంతుని అనుగ్రహం దక్కేలా చేస్తూ ఉంటాయి.  ఈ మాసంలో చేసే దైవారాధన, జపం, ఉపరాస దీక్షలు, దీపారాధనలు, దానధర్మాలు, అన్నదానం   అన్నీ కూడా అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయని  చెబుతారు.  కార్తీకమాసంలో 'దీపం'  ప్రత్యేకత అందరికీ తెలిసిందే ! ఈ సందర్భంగా రెండు తెలుగురాష్ట్రప్రజలను, అలాగే దేశ ప్రజలందరినీ  చల్లగా చూడమని శివకేశవులను మనసారా ప్రార్థిస్తున్నాను.

Saturday 1 November 2014

జంతు కళేబాలతో వంట నూనెలు !

జంతువుల వ్యర్థాలు, కళేబాలతో వంట నూనెలు తయారు చేయడం వినడానికే అసహ్యం వేస్తోంది కదూ!  ఇది నిజం. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే కొందరు, జంతువుల ఎముకలను భారీ బాండీలలో వేసి బాగా మరగబెట్టి నూనె,  తీస్తున్నారట.  ఆ నూనెను డబ్బాలలో నింపి రాత్రివేళలో మంచి నూనె తయారుచేసే ఇతర కంపెనీలకు సరఫరా చేస్తున్నారట.  జంతువుల నుంచి తీసిన ఆ నూనె తక్కువ ధరకే లభించడంతో కొందరు హోటల్ యజమానులు బిర్యానీలో, రోడ్డు పక్క బజ్జీలు చేసే వాళ్ళు ఉపయోగిస్తున్నట్టు సమాచారం.  అంతేకాదు ఈ ఎముకలతో 'టీ' పొడిని కూడా తయారు చేసి అసలు టీ పొడిలో కలుపుతున్నారట. టీ నుంచి కానీ, డాల్డా నుంచి కానీ, నూనె లోంచి కానీ దుర్వాసన వస్తే అది కచ్చితంగా నకిలి నూనె  అని గ్రహించాలి.  ఈ  నూనె, డాల్డా, టీ పొడి  వాడిన ఆహారం తింటే అనేక రోగాల బారిన పడటం ఖాయం.  అందుకే నూనె వాడకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  

Monday 27 October 2014

ప్రకృతిని కాపాడుకుందాం !

  
ప్రకృతిని కాపాడుకుందాం !

కొందరు ఆధునిక అవసరాల పేరుతో
కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ
ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు
మరికొందరు ధన సంపాదనకోసం
నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ
అత్యంత దయనీయంగా, క్రూరంగా
పెనువిద్వంసం సృష్టిస్తున్నారు
ఫలితంగా తుఫానులు, భూకంపాలు!
మన కళ్ళను మనేమే పొడుచుకుంటున్నాం
మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం
ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు
రెక్కలు తెగిన పక్షుల్ల విలవిలాడుతున్నాయి
పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !


Wednesday 22 October 2014

దీపావళి శుభాకాంక్షలు !

     మనోనిశ్చలతకు, సుఖశాంతులకు  అనువైన కాలం శరదృతువు.  వానలు తగ్గి, చలికాలం ఆరంభమయ్యే సమయంలో దీపావళి పండుగ రావడం  సంతోషదాయకం...ఆనందదాయకం.  చెడు అనే చీకటిని పారద్రోలి, మంచి అనే వెలుగును నింపడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.  విజయానికి ప్రతీతగా ప్రతి ఇంటా చీకటిని పారద్రోలి... వెలుగులను నింపి, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్ర్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తాం.  కులమతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు ఆనందంగా జరుపుకునే పండుగ వెలుగు జిలుగుల దీపావళి.  ఈ రోజున లక్ష్మిదేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తే లక్ష్మి కటాక్షం సిద్దిస్తుందని  ప్రజల విశ్వాసం.  ఈ దివ్యకాంతుల దీపావళి మీ ఇంటిల్లిపాదికీ సుఖశాంతులు, సిరిసంపదలు, మధురానుభూతులు మిగిల్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.  

        మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు !


Friday 10 October 2014

స్త్రీలను గౌరవిద్దాం !

నాటి రామాయణం నుండి నేటి ఆధునిక యుగం వరకు పరిశీలిస్తే, పరస్త్రీ వ్యామోహం కలవారెవరూ బాగుపడిన దాఖలాలు లేవు.  అనేక గొడవలకు,  హత్యలకు కారణమయ్యే అత్యంత హేయమైన గుణం పరస్త్రీల పైన మొహం.  కామం మనిషిని గుడ్డివాడ్ని చేస్తుంది.  చదువుకునే పిల్లల నుంచి, కాటికి  కాళ్ళు చాపే ముసలువాళ్ళ వరకు ఈ చెడు వ్యసనానికి బానిసలయి, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో... జనం చేత ఎట్ల ఛీ అనిపించుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం.  ఇల్లాలితో స్వర్గ సుఖాలను అనుభవించవలసిన జీవితాన్ని చేజేతులా మురికి కూపంలోకి నేట్టుకుంటున్న అభాగ్యులు ఒక్కసారి ఆలోచేస్తే...ఈ  కామాంధకారంలోంచి బయటపడగలరు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, స్త్రీలను  ఆదరించడం మన సంస్కృతి.


Sunday 5 October 2014

'బక్రీద్' శుభాకాంక్షలు!


త్యాగానికి ప్రతీతగా ముస్లిమ్ సోదర సోదరీమణులు భక్తిభావంతో జరుపుకునే పండుగ 'బక్రీద్'.  ఈ సందర్భంగా మిత్రులందరికీ 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు !

బాబు-కేసిర్, అలయ్-బలయ్ !

కలిసినప్పుడు అప్యాయతలు- అనురాగాలు !
దూరంగా ఉన్నప్పుడు కారాలు- మిరియాలు !!

Saturday 4 October 2014

ఆరోగ్యానికి అమృత ఫలాలు !



జీవితంలో మనిషికి ముఖ్యమైనది మంచి ఆరోగ్యం.  మన ఆహారంలో పప్పు, గింజదాన్యాలు, కూరగాయలే కాకుండా పండ్లను కుడా ఒక భాగం చేసుకుంటూ, ఏదోవిధంగా తీసుకుంటూఉంటే చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది.  ఎన్నో ఔషద గుణాల కలిగిన కమలా పండు,  వెంటనే తక్షణం శక్తినిచ్చే ద్రాక్ష,  అధికపోషక విలువలున్నఅనాస, కేన్సర్ ని నిరోధించే మామిడిపండు, విటమిన్ ఎ,సి, బి 6, పుష్కలంగా లభించే  పుచ్చకాయ, వేసవి తాపాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే  ఖర్బుజాపండు,  ఇదేవిధంగా అరటి, జామ, ఆపిల్, సపోటా... ఇలా వేరువేరు కాలాల్లో ఒక్కొక్క రకంగా మనకు లభిస్తూ ఉంటాయి. వాటిని తింటూ ఉంటే  కలిగే ప్రయోజనాలు అమూల్యం.

Thursday 2 October 2014

విజయదశమి శుభాకాంక్షలు !

విజయాలను అందించే పర్వదినం దసరా పండుగ.  ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మ ఆశీస్సులు లభిస్తాయంటారు.  దేవీనవరాత్రుల సందర్భంగా  ఆలయాలలో రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు.  తమను వేధిస్తున్న మహిషాసురిడికి స్త్రీ వలన మృత్యువు వాటిల్లుతుందని గ్రహించిన దేవతులు విష్ణువును శరణు కోరతారు.  అప్పుడు విష్ణువు సకలదేవతాంశాలను తేజోశ్శక్తులుగా కలబోసుకొని ఒక స్త్రీ ఆవిర్భవించినట్లయితే, మహిశాసురుడిని ఆ స్త్రీమూర్తి చేత సంహరించ చేయవచ్చునని  చెబుతాడు.  ముందుగా బ్రహ్మ ముఖం నుండి తేజోరాసి  ఆవిర్భవించింది.  శివుడు నుండి వెండిలాగా ధగధగలాడుతున్న మరోకాంతి పుంజం మణి కాంతులతో వెదజల్లుతూ కనిపించింది.  విష్ణుమూర్తి నుండి నీలం రంగులో మూర్తీభవించిన సత్వగుణం లాగావున్న ఇంకో తేజస్సు వెలువడింది. ఇలా సకలదేవతలనుండి అప్పటికప్పుడు తేజస్సులు వెలువడి ఒక దివ్య తేజోరాసి అయిన స్త్రీమూర్తిగా  రూపం దాల్చింది. తరువాత దేవతలందరూ  తమ ఆయుధాలను పోలివున్న ఆయుధాలను ఆమెకు బహుకరించడం జరిగింది.  ఇలా అనేక ఆయుధాలను ధరించిన ఆమె శక్తిస్వరూపినిగా అవతరించింది, సింహవాహనాన్ని అధిష్టించి, మహాశక్తిరూపంతో మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించింది.  ఈరోజు అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది.  శత్రుభయాలు తొలగిపోయి సకలవిజయాలు కలుగుతాయి.

     మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు !

మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుద్దాం !



జాతిపిత మహాత్మాగాంధీ  జయంతి సందర్భంగా దేశంలో
శాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషి చేద్దాం!
మనచుట్టూ  వున్న పరిసరాలను 
పరిశుభ్రంగా ఉంచుకుందాం!
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో పయనిద్దాం!
దేశాన్ని అభివృద్దివైపు నడిపిద్దాం!!

Monday 29 September 2014

మాటకు మాట వద్దు !

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందనే సామెత ఉంది.  మనం స్నేహ పూర్వకంగా మాట్లాడితే పగవాడు కూడా మనవాడవుతాడు.  మన ఆలోచన, గుణగణాలు మన మాటల్లో ప్రతిబింబిస్తాయి.  కాబట్టి మాట్లాడటానికి ముందు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది.  ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం ప్రతి వ్యక్తికీ అవసరం.  పెద్దవాళ్ళతో, ప్రముఖులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో ఎవరికీ తగిన విధంగా వారి దగ్గర మాట్లాటంలో మన తెలివి, మంచితనం, చాతుర్యం బయటపడతాయి.   కొంత మంది నోటి దురుసు వల్ల అప్పుడప్పుడూ తగాదాల వరకూ వెళుతుంటారు. అలాంటివారికి ఎంత దూరంగా వుంటే అంత  మంచిది.  మన మాట తీరు  మన జీవితాన్ని పూలబాట చేయగలదు. అదేవిధంగా ముళ్ళబాటగానూ చేయగలదు.  అందుకే మనం మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తెసుకోవడం ఎంతయినా అవసరం.

Saturday 27 September 2014

జయలలితకు జైలు శిక్ష !



అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను దోషిగా నిర్ధారించిన బెంగుళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. మొత్తం దోషులు నలుగురికి కలిపి రూ. 100 కోట్లు భారీ జరిమాన విధించింది. ఈ మొత్తాన్ని దోషులు ఒక్కొక్కరు రూ.25 కోట్లు చొప్పున చెల్లించాలి. దీనితో ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నారు.

Wednesday 24 September 2014

హైదరాబాద్ ను కాటేస్తున్న కాలుష్యం !


గ్రేటర్ హైదరాబాద్ లో నానాటికి పెరుగుతున్న కాలుష్యం,   నగరవాసులకు ప్రాణసంకటంగా మారుతోంది.  లక్షల్లో పెరిగిన వాహనాల నుంచి నిత్యం వెలువడుతున్న దుమ్ము, ధూళి నగరప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  వాతావరణంలో ధూళి రేణువులు అధికం కావడం వల్ల రోజూ బయట సంచరించే వారు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. దీనికి తోడు విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ జరగడం, పరిశ్రమల నుండి హానికరమైన వాయువులు వాతావరణంలోకి వదలడం వలన భూతాపం పెరిగిపోతోంది.  కాలుష్యం వల్ల హానికర వ్యర్థాలు చెరువుల్లో కలుపుతున్నారు.  అవి నీటి వనరులను కలుషితం చేసి నీటి కాలుష్యాన్ని పెంచుతున్నాయి.  వాహన కాలుష్యం, జలకాలుష్యం పెరగడం కారణంగా భూమి రోజురోజుకు వేడెక్కి, మొత్తం జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా  మారుతోంది.  పరిస్థితి మరింత విషమించక  ముందే అధికారులు మేల్కొని,  వాయు, జల కాలుష్యం నుండి హైదరాబాద్ ను కాపాడాలి.

Sunday 14 September 2014

అనురాగ బంధం !

 
స్నేహమంటే ...
స్వార్థంలేని ఓ ఆరాధన 
కల్తీలేని ఓ మధురభావన 
కపటంలేని ఓ  భరోసా 
కష్టాలలో ఆదుకునే ఓ  ప్రాణం 
ఆప్యాయతతో ఆదరించే...
స్వచ్చమైన అనురాగ బంధం!
 

Friday 5 September 2014

గురుదేవోభవ !

మనదేశ రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతకుముందు అధ్యాపకుడు. ఆయన పుట్టిన రోజును  ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.   దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానం  ఉంది.  గురువు లేని విద్యార్థి మంచి మార్గాన ప్రయానించలేడు. గురు శిష్యుల సంబంధం అనురాగం, అనుబంధంతో కొనసాగాలి. ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్య చెప్పేవాడు మాత్రం కాదు...లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేవాడని అర్థం.  అలాంటి ఉపాధ్యాయులను  మన తెలుగు సినిమాలలో కమెడియన్లగా చూపించడం వలన సమాజంలో ఉపాధ్యాయులపట్ల తేలికభావం ఏర్పడింది.  దాంతో  గురువులను గౌరవించడం విద్యార్థులలో తగ్గుతూ... గురుశిష్యుల సంబంధాలు ఉండవలసిన రీతిలో ఉండటం లేదు. సమాజంలో మంచి చెడు ఉన్నట్లే ఉపాధ్యాయులలో కూడా చెడ్డవాళ్ళు లేకపోలేదు.  వక్రబుద్ధి కలవారు ఉపాధ్యాయులయితే సమాజం చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ.  కనుక  ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకునే వాళ్ళు  వృత్తి పట్ల అంకితభావం ఏర్పరచుకోవాలి.  అలా జరిగినప్పుడు ఉపాధ్యాయులకు సమాజంలో అత్యున్నత గౌరవ మర్యాదలు లభిస్తాయి.  

          ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు !



Sunday 31 August 2014

బాపు ఇక లేరు.


ప్రముఖ సినీ దర్శకుడు, గొప్ప చిత్రకారుడు  మహాన్నత వ్యక్తి శ్రీ బాపు గారు మనందరినీ వదలి వెళ్ళిపోయారు.  ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనసారా ప్రార్థిస్తూ... వారి కుటుంబసభ్యులకు నా  ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 

Thursday 28 August 2014

ప్రణవనాద స్వరూపుడు !



బాద్రపదమాసం శుక్లపక్షంలో చవితి నాడు మధ్యాహ్నం వేళ  పార్వతీదేవికి పుత్రునిగా వినాయకుడు అవతరించాడు.  చవితి ఏ రోజు మధ్యాహ్నం వేళ  ఉంటుందో, ఆరోజు  వినాయకచవితి పండుగను చేసుకోవడం వలన సకల శుభాలు, సౌఖ్యాలు  చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఈ చవితి ఆదివారం కానీ, మంగళవారం గానీ వస్తే చాలా మంచిదంటారు.   మట్టితో చేసి రంగులువేయని వినాయక విగ్రహాన్ని పూజించడం వలన  కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని, వ్యవసాయాభివృద్ది కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం.  ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు.  అందుకే వినాయకచవితి నాడు నీటిలో కరిగే మట్టి విగ్రహాన్ని పూజించాలి... పర్యావరణాన్ని పరిరక్షించాలి.  కొండంత దేవుడుకి కొండంత పత్రి సమర్పించాకపోయినా ఫలమో, పత్రమో ఏదో ఒకటి స్వామికి నివేదిస్తే చాలు గణనాధుడు తృప్తి చెందుతాడు. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తరువాత దేవతాముర్తిని నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది.  వినాయకచవితిని భారతదేశమంతా అత్యంత వైభవంగా జరుపుకోవడం మన సంస్కృతిని వెల్లడి చేస్తుంది.                                                                      

            మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!