”శోధిని”

Tuesday, 19 June 2012

పిల్లలతో వెట్టి చాకిరీ



ఇంటిపని కోసం బాలికలను ఉపయోగించుకోవడం సహించరాని నేరం.  మనకు ఎన్ని చట్టాలున్నా దురాచారాన్ని ఆపలేక పోతున్నాం. ప్రభుత్వం ఇంటి పనిని కూడా బాల కార్మిక చట్టం కిందికి తెచ్చింది కానీ, నేడు ఆర్ధికంగాను ఉన్నత స్థాయిలో వుండే వ్యక్తులు  బాల కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు. చట్టాలు ఇతరులకే కానీ మనకు కాదని వాళ్ళ ధోరణిటీవీ లోనూ, మీటింగ్ లలోనూ బాల కార్మికుల నిర్మూలనే తమ ద్యేయం అంటూ  ఉపన్యాసాలు దంచేస్తారు. వీరి విషయానికి వచ్చేసరికి అవి కనిపించవు.  బాల కార్మికుల నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అధికారులే తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఎంతో మంది చిన్నారులు రోడ్డునపడుతున్నారు. అధికారులు ఇలా ప్రవర్తించడం రాజ్యాంగాన్ని ఉల్లంగించడమే అవుతుంది. న్యూస్ పేపర్ యాజమానులు  బాలకార్మికుల గురించి తెగ రాసేస్తుంటారు. వాళ్ళ పైన ఎక్కడలేని  ప్రేమ ఒలకపోస్తారు. కానీ, వారి పేపర్ ప్రింట్ అయిన దగ్గర నుంచి ప్రజలకు చేరే వరకు బాల కార్మికులతోనే పని చేయించుకుంటున్నారు.  ఎదుటి వారికి నీతులు చెప్పడమే కానీ మనకు కాదని వాళ్ళ ఉద్దేశం కాబోలు.  మగపిల్లలు  హోటల్స్ లోనూ, చిన్న చిన్న పరిశ్రమలలోనూ శ్రమ దోపిడీకి గురవుతుంటే , ఆడపిల్లలు ఇంటిపనిలో 24 గంటలు  చాకిరీ చేస్తూ లోలోన కుమిలి పోతున్నారు.  పని సరిగా చేయడంలేదని యజమానులు  వేధించడం, కొట్టడం జరుగుతోంది.  ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప, బాలకార్మికులను ఆదుకోవడంలో శ్రద్ధ కనపరచడంలేదు.