మనిషి మహా స్వార్థపరుడు. ఏది ఏమైనా పర్వాలేదు, బాగుంటే చాలు, నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకుంటే చాలు అనుకునే దుర్మార్గపు ఆలోచనతోనే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ఫలితంగా గుండె నిండా గాలి పీల్చుకున్న ప్రతిసారీ మనం చెటికెడు కాలుష్యాన్ని ఊపిరితిత్తుల్లో నింపుకుంటున్నాము. మనవల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో అకాల వర్షాలు పంటలను మింగేస్తున్నాయి. మండే ఎండలు మనుషుల్ని మాడ్చేస్తున్నాయి. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి ప్రాణాలను తీస్తున్నాయి. ఋతుపవనాలు గతి తప్పుతున్నాయి. దాంతో భూలోకం వేడెక్కుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. త్రాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళు దొరకడం గగనం అయిపొయింది. ఎంత జరుగుతున్నా మన పాలకులకు చేమ కుట్టినట్లయినా లేదు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనిషి ప్రకృతితో యుద్ధం చేయకూడదు. కొండలను కొండలుగా ఉండనివ్వాలి. నదులను స్వేచ్చగా పారనివ్వాలి. చెట్లను చేట్లుగానే బ్రతకనివ్వాలి. మనసున్న ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భాద్యతగా మందుకు రావాలి. అడవులు హరించి, జంతువులను మట్టుపెట్టి పచ్చదనాన్ని పొట్టన పెట్టుకుని, అన్నీ హరించి, అంతం అయ్యాక జీవకళ కనుమరుగవుతుంది. ఇది మానవజాతికే గొడ్డలి పెట్టు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడయినా మనిషి మేల్కొనక పొతే రాబోయే రోజుల్లో మనిషి మనుగడ అసాధ్యం. అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హరిత ప్రకృతిని కాపాడుదాం.