”శోధిని”

Thursday, 30 January 2014

ప్రేమ పరిమళాలు!



ప్రకృతి సోయగాల్ని...   
హృదయపు లాలిత్యాన్ని...  
మేళవించిన నీ గానం 
మధురాతి మధురం! 
సౌకుమార్యంతో  కూడిన 
నీ తీయటి పలుకులు ...  
అత్యంత మనోహరం!! 
నీ రూపురేఖలు 
శిల్పకళా సంపదలు 
నా అణువణువులోనూ 
నీ సొగసులు, సోయగాలు...  
నా గుండె గుడిలో వెలసిన
ప్రేమ పరిమళాలు!  

Wednesday, 29 January 2014

వలపు బాణాలు...!


నీ నుదుటున వెలిసిన కనుబొమ్మలు...  
నిశీధిలో వెలిగే చంద్రోదయాలు...  
నీ వదనంలో మెరిసే  నయనాలు...  
మతిని పోగొట్టే వలపు బాణాలు...! 


Saturday, 25 January 2014

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!


మన దేశం సంపూర్ణ సౌర్వబౌమాధికారాన్ని పొందిన సుదినం  జనవరి 26.ఈరోజున భారతీయులందరం కలిసి 'గణతంత్ర దినోత్సవం'ను ఘనంగా జరుపుకుంటాం. మనకు స్వాతంత్ర్యం 1947 ఆగష్టు 15న వచ్చినా, బ్రిటీష్ పాలకులతో ఎ సంబంధం లేకుండా పూర్తి  స్వరాజ్యాన్ని జనవరి 26, 1950 న పొందాం.  మనకంటూ ప్రత్యేక రాజ్యాంగం  ఏర్పడి, గవర్నర్ జనరల్ స్థానంలో భారత రాష్ట్రపతి పాలన ప్రారంభమైన రోజు జనవరి 26, 1950 కాబట్టి ఈ రోజు మనందరికీ నిజమైన పండుగ రోజు. 

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!


Friday, 24 January 2014

బహుమతి


Bahumathi andukuntunna Cartoon istulu Sri Kayala Nagendra garu... — with Annam Sreedhar Bachi.(ప్రముఖ కార్టూనిస్టు)



Monday, 20 January 2014

"సిరిమల్లె పువ్వల్లె నవ్వు"


"సిరిమల్లె పువ్వల్లె నవ్వు" (పేస్ బుక్) మొదటి వార్షికోత్సవం ఆదివారం (19-01-14) నాడు "హోటల్ స్వాగత్ గ్రాండ్", వనస్థలిపురం, హైదరాబాద్ లో కన్నుల పండుగగా జరిగింది. ఈ  కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరినీ శ్రీ బాచి గారు పేరుపేరున పలకరిస్తూ...  ఆప్యాయతతో ఆహ్వానించడం అందరిని ఆకట్టుకుంది. చిరునవ్వుతో లక్ష్మీ పాల గారు రావడంతో సభకు నిండుదనం వచ్చింది. మిత్రులు కొంత  మంది రాకపోయినా హాస్యపు జల్లులతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.  ఈ విజయం వెనుక బాచిగారు, రామకృష్ణ గారు, లక్ష్మీ పాల గారు, ఈ ముగ్గురి కృషి ఏంతో  వుంది.  'రాధకు నీవేరా ప్రాణం... ఈ రాధకు నీవవేరా ప్రాణం' పాటను లక్ష్మీ పాల గారు చాలా చక్కగా పాడారు. ఆమె గాత్రం అద్భుతంగా ఉంది.  శ్రీ రామకృష్ణ గారు, శ్రీ బాచి గారు చక్కని చతురొక్తులు, పసందయిన జోక్స్ లతో  అలరించారు.  ఇంత  మంచి కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.  శ్రీ బాచి గారికి, లక్ష్మీ పాల గారికి ప్రత్యేక అభినందనలు . 


Friday, 17 January 2014

'మనసంతా నువ్వే'



ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీ ఆర్. వి. ఎస్ .ఎస్ శ్రీనివాస్ గారు (శ్రీ) రచించిన 'మనసంతా నువ్వే' వచన కవితల సంపుటిని  డా. సి నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు.  ఈ గ్రంధంలో 64 కమనీయమైన ప్రేమ కవితలు రూపుదిద్దుకున్నాయి.  కవితలలో ఆత్మీయ స్పర్శల మధురానుభూతుల్ని, ప్రేమికుల సంబంధాలను హృద్యంగా వర్ణించారు రచయిత. ఈ గ్రంధంలోని కవితలు చదువుతుంటే... హృదయ లోతుల్లో దాగిన అక్షరాలను పైకి తీసి పేర్చినట్టున్నాయి.  ఈ గ్రంధంలోని కొన్ని మధురమైన వాక్యాలు... 

" నీ ప్రేమలేఖ లొని అక్షరాలు 
సుగంధాలు విరజిమ్మే నందనవన పారిజాతాలు 
నిశ్చలమైన నా మనోకాసారంలో 
వికసించిన ప్రేమారవిందాలు"

"సాయంసంధ్యా సమయంలో 
చల్లగా వీచే పిల్లతెమ్మర హాయినిస్తోంది
నా మనసుని తాకే నా సఖి పంపిన 
ప్రణయ సమీరంలా"

" నీ చిరునవ్వుల జల్లులు చాలు 
చిరుకవితల మాటలు అల్లేందుకు 
నీ పసందయిన పలకరింపులు చాలు 
ప్రణయ ప్రబంధాలు వ్రాసేందుకు"

ఈ గ్రంధం నిండా ఇలాంటి కవితలు మనోరంజకంగా అలరించాయి.  ఎన్నెన్నో మధురానుభూతులు మనసును తట్టి ఆహ్లాద పరచాయి.  తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగల శక్తి శ్రీనివాస్ గారికవిత్వానికి ఉందని రుజువు చేశాయి.  ఈ కవితలలో రచయిత హృదయ స్పందనని అర్థం చేసుకోవచ్చు. అద్భుత పదాలతో "మనసంతా నువ్వే"కవితల సంపుటిని 64 ఆణిముత్యాలుగా అభివ్యక్తీకరించారు 'శ్రీ' గారు. మున్ముందు మరిన్ని  ప్రేమ కవితలు 'శ్రీ' (శ్రీనివాస్) గారి కలం నుండి జాలువారుతాయని ఆశిద్దాం! 
 

 

Monday, 13 January 2014

2014 సంక్రాంతి విజేత?















ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి. మహేష్ నటించిన '1-నేనొక్కడినే' 10న  చరణ్ హీరోగా నటించిన 'ఎవడు' 12న ప్రక్షకుల ముందుకు రావడంతో 2014 సంక్రాంతి బరిలో హోరా హోరీ పోరు ప్రారంభమయింది.  అయితే భారీ అంచనాలతో ముందుగా వచ్చిన '1- నేనొక్కడినే' డివైడ్ టాక్ రావడంతో 'ఎవడు' సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల అంచనాలను తలక్రిందులు చేసినా 'పర్వాలేదు' అనే టాక్ రావడంతో 'ఎవడు' నిలదొక్కుకొగలదని విశ్లేషకుల అభిప్రాయం.  ఈ రెండు సినిమాలు ఒకటి యాక్షన్, రెండోది మాస్ చిత్రాలు కావడంతో అభిమానులను అలరిస్తాయి. కాని, సామాన్య ప్రేక్షకులకు అంతగా రుచించక పోవచ్చు.  2013 సంక్రాంతి కి ఈ ఇద్దరి హీరోల సినిమాలు రిలీజయి విజయం సాధించాయి.  ఇద్దరూ  సంక్రాంతి హీరోలుగా నిలిచారు. ఈ సారి కుడా ఈ ఇద్దరు రిపీట్ చేస్తారా? లేదా అని తెలియాలంటే ఈ వారం గడవాలి.  అయితే సంక్రాంతి విజేతగా నిలిచే అవకాశాలు 'ఎవడు' చిత్రానికి ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది.


Sunday, 12 January 2014

"పల్లెకు పోదాం .... పండుగ చూద్దాం!"





ఉదయభానుడు  ధనూరాశి నుండి మకర రాశి లోనికి ప్రవేశించడమే ఉత్తరాయణం పుణ్యకాలంగా  పరిగణింప బడుతుంది. అందువలన ఈ సంక్రాంతి పర్వ దినం చాలా శ్రేష్టమైనది. సంక్రాంతి నాడు చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయంటారు.మూడు రోజులు జరుపుకునే పెద్ద పండుగలో  మొదటి రోజు భోగి పండుగ. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం ఆనవాయితి.  ఇక  రెండో రోజు సంక్రాంతి.  ఈ రోజు పితృదేవతలను కొలిచి, వారి పేరున దాన ధర్మాలు చేస్తారు.  సంక్రాంతి మరునాడు కనుమ పండుగ.  ఈ పండుగను పశువుల పండుగ అనికూడా అంటారు.  కనుమ రోజు పాలిచ్చి మనల్ని పోషిచే ఆవులను, వ్యవసాయంలో తమకెంతో తోడ్పడే ఎద్దులను పసుపు, కుంకుమలతో పూజించి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కోడి పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. ఇంకా గాలి పటాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు,రంగవల్లులు,రకరకాల పిండివంటలు.... ఇవన్నీ తిలకించాలంటే పల్లె దారి పట్టాలి.  

            మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

రెండవ బహుమతి!


మనసంతా నువ్వే నిర్వహించిన సంక్రాంతి కవితల పోటిలో నా కవిత "సంక్రాంతి లక్ష్మికి స్వాగతం" రెండవ బహుమతి పొందిన సందర్భంగా శ్రీ RVSS శ్రీనివాస్ (శ్రీ) గారి దగ్గర నుంచి మెమెంటో స్వకరిస్తున్న  దృశ్యం. 

Saturday, 11 January 2014

ఇదేం...కోరిక?





భార్య :  "పాతిక సంవత్సరాల నుంచి రాజకీయాలు వెలగబెడుతున్నారు . కాని, ఏమిలాభం?"
భర్త   :  "ఇప్పుడేమయిందని అలా విడుచుకు పడుతున్నావ్?
భార్య :  " ఏ ఒక్కరోజయినా పది నిముషాలు టీవిలో కనిపించారా?"
భర్త   :  "అది నా తప్పు కాదు కదా!"
భార్య : "ముమ్మాటికి మీ తప్పే... అందరిలాగా ఎదైనా స్కాం  చేసి వుంటే,ఎంచక్కా రెండు రోజుల పాటు
           టీవీ ఛానల్స్ ప్రసారం చేసేవాళ్ళు."    
భర్త  :  "నీ టీవీ పిచ్చి మండిపోనూ...  ఏ భార్య అయినా భర్త మంచి పనులు చేయాలని కోరుకుంటారు.  ఇదేం                      కోరిక ."


Friday, 10 January 2014

'శ్రీ' గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

ప్రియ మిత్రుడు RVSS శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
అందునా ఈ రోజు ముక్కోటి ఏకాదశి.  భగవంతుడి ఆశీర్వాదాలు 'శ్రీ' గారికి లభించాలని మనసారా కోరుకుంటున్నాను. 


Thursday, 9 January 2014

పని మనిషి కావలెను


తమ భర్తలను ఆఫీస్ కి పంపించి మాటల్లో  పడ్డారు  పక్కింటి వనజాక్షి, కామాక్షి
వనజాక్షి : "పని పిల్లను మాన్పించాను... పని చేసుకోలేక విసుగు వస్తోంది వదిన"
కామాక్షి :  "చిన్న పిల్లను పనిలో పెట్టుకోవడం నేరమని మాన్పించావా?"
వనజాక్షి : "అదేం  కాదు వదిన...  ఆ పిల్లకి మన కాలనీ విషయాలు తెలియడం లేదు" 
కామాక్షి : "కాలనీ విషయాలు చెప్పని పని మనిషి ఎందుకు దండగ... మంచి పని చేసావు"  

Wednesday, 8 January 2014

"వీళ్ళా ... మన ప్రజాపతినిధులు?"


రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నా తీరు అసంతృప్తి కలిగిస్తోంది.  ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు పరస్పర వ్యక్తిగత నిందారోపణలు చేసుకోవడంతోనే అసెంబ్లీ సమావేశాల సమయం హరించుకు పోతోంది. తెలంగాణా బిల్లుపై చర్చించి, పార్టీల వారిగా వారివారి అభిప్రాయాలు తెలియజేయాల్సిన నేతలు అసెంబ్లీ ని వ్యక్తిగత దూషణలకు వేదికగా ఉపయోగించుకోవడంవల్ల ఏంతో విలువైన ప్రజాధనం వృధా అవుతోంది. ఎవడబ్బ సొమ్మని ప్రజల సొమ్మును నీళ్ళలా ఖర్చు పెడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.  ప్రజాస్వామ్యవాదులకు ఉండవలసిన సహనం, సంయమనం అటు అధికారపక్ష నాయకులకు, ఇటుప్రతిపక్ష నాయకులకు  లోపించడం ప్రజల దురదృష్టం.  వీరికి మంత్రులు వత్తాసు పలకడం శోచనీయం.  ఇప్పటికైన ప్రజాప్రతినిధులు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి  వైఖరులను విడనాడండి.  వ్యక్తిగత దూషనలకు స్వస్తి పలికి, ఆగ్రహావేశాలను లోనుకాకుండా  సహనంతో వ్యవహరిస్తూ, చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలను రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పండి.  శాసనసభ గౌరవాన్ని కాపాడండి.    

Saturday, 4 January 2014

అపర కీచకులు


విద్యాలయాలు దేవాలయాలు .. ఉపాధ్యాయులు ప్రత్యేక  దైవాలు.  కాని కొందరు నీతి  బోధకులుగా, సమాజ సృష్టలుగా తమ బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే కీచాకులుగా మారిపోతున్నారు.   అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతూ  ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు.  ఇలాంటి వారి వద్ద విద్య నేర్చుకున్న వారిలో మానవ విలువలు నాశనమవుతున్నాయి. వ్యక్తులకు నైతిక విలువలు లోపించడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.  తాజాగా నల్గొండ జిల్లాలోని  పెద్దపూర మండలం ఓ తండాలో పసిమొగ్గలపై  పైశాచానికి తెగబడ్డ నీచుడి ఘాతుకం వెలుగులోకి వచ్చింది.  ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. వెలుగు చూసేవి కొన్ని కేసులు మాత్రమే , వెలుగు చూడని సంఘటనలు కోకొల్లలు.  కొందరి మగ మృగాల ప్రవర్తనకు మహిళలు చిగురుటాకుల్లా వణికి పోతున్నారు.    రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది.  ఇలాంటి  సంఘటనలు జరిగినప్పుడు రాజకీయనాయకులు ' ఖండిస్తున్నాం' అని అంటారు తప్ప, మహిళల రక్షణ కోసం చొరవ చూపడం లేదనేది జగమెరిగిన సత్యం. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా.. పశుప్రవృత్తికి  మాత్రం కళ్ళెం వేయలేక పోతున్నాయి.  మహిళలు, చిన్నారులు ఆకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మూలాలు వెతికి సమూల ప్రక్షాళన చేయాలి.  అందుకు యువత ముందుకు రావాలి.  ఒక్క యువతతోనే ఇది సాధ్యమవుతుంది.  


Friday, 3 January 2014

మనదేశ రాజకీయం!

 
ఎమ్మెల్యే సీటు 
మహిళల కైతే  వాడి ఆవిడకి 
రిజర్వేషన్  అయితే  వాడి పనోడికి 
జనరల్ అయితే మాత్రం వాడికే  
ఇది  వంశపారిపరంగా వస్తున్న ఆచారం 
ఎవరు గెలిచినా ... 
కలకాలం అధికారం వాడిదే!
ఇదీ ... మనదేశ రాజకీయం!!