
మన కళ్ళ ఎదుట రకరకాల రంగుల పూలు కనిపించినా... వాటి వాసనలు తగులుతున్నా...మానసిక ప్రశాంతత వస్తుంది. సుకుమారమైన అందం, మనోహరమైన వాటి పరిమళ భరితాలు మనసును ఉల్లాసపరుస్తాయి. అంతేకాదు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చేఈశక్తి పుష్పాలకుంది. పని చేయడంలో ఉత్సాహాన్ని ఇస్తాయి. సంపెంగ, బసంతి, చమేలీ, మాధవీలత, మల్లెలు, జాజులు, సన్నజాజులు, విరజాజులు, మొగలి, రంగురంగుల మందారాలు, గులాబీలు ఒళ్ళు విరుచుకుంటూ, రేకులన్నీ విప్పార్చుకుంటూ సుగంధాన్ని వెదజల్లే మకరందాలే! మనసును మధురోహల్లో ముంచెత్తే సుమమనోహర సౌగంధాలే!! ఈ పూల మొక్కలను మన పెరట్లో పెంచుకోవచ్చు. అపార్ట్ మెంట్లో అయితే కుండీలలో పెంచుకుని ఇంటిని పూలవనంగా మార్చుకోవచ్చు. ఈ కుసుమాలలో ఉన్న పరిమళం మనసుని ఆహ్లాదపరుస్తాయి. వీటి సౌందర్యం మనకు స్వాగతం పలుకుతాయి.