”శోధిని”

Thursday 23 February 2017

"పరమేశ్వరుని శుభదినం ...మహాశివరాత్రి పర్వదినం"


పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రాత్రి మహాశివరాత్రి.  ఈ శుభకరమైన శివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే అనుగ్రహప్రదాత అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం.  మనసుని పవిత్రంగా,  ప్రశాంతంగా వుంచుకొని 'ఓం నమశ్శివాయ' అని జపించాగానే మహాశివుడు పరవశుడై అన్ని కష్టాలను తొలగిస్తాడు.  మనసులో నేనే గొప్ప అనే అహంకారాన్ని పెట్టుకుని ఆడంభరాలతో ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం దక్కదు.   అహంభావాన్ని వదలి, అహంకారాన్ని వీడి అందరిని సమభావంతో ప్రేమిస్తే... శివయ్య  కరుణాకటాక్షం  లభిస్తుంది. ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో శివతత్వాన్ని అర్థం చేసుకొంటే మనిషిలో మానవత్వం పరిమళిస్తుంది. 
                 "పరమేశ్వరుని శుభదినం ...మహాశివరాత్రి పర్వదినం...భక్తజనకోటికి పుణ్యదినం" 
 


Monday 20 February 2017

అర్థనారీశ్వరుడు



అనుగ్రహప్రదాత, మంగళ స్వరూపుడయినా  పరమేశ్వరుడులో పురుషుడి శక్తి సగం,  అయన సతీమణి పార్వతి శక్తి సగం సమ్మేళతంగా ఉంటుంది.  సమస్త చరాచర ప్రపంచం శక్తిరూపంతోనే ఏర్పడింది కాబట్టి,  శక్తి రూపం లేకుండా శివుడు ఏమీ చేయలేడు.  అందుకే స్త్రీ, పురుషుడు కలిసి ఒకే రూపంగా ఏర్పడితేనే ఎదైనా సాధ్యమవుతుంది.  ఈ విషయాన్ని మనకు తెలియచేయడానికి ఈశ్వరుడు అర్థనారీశ్వర రూపాన్ని ధరించాడు.  ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని స్త్రీ, పురుషులిద్దరూ  సమానమేనని తెలియజెప్పాడు.

Saturday 11 February 2017

"అహంభావం"


ఇతరుల గురించి తేలిగ్గా మాట్లాడటమే అహంకారానికి పరాకాష్ట.  ఎక్కడ అహంకారం వుంటుందో అక్కడ స్వార్థం తప్పకుండా వుంటుంది.  అహంభావులతో ఎప్పటికైనా  సమస్యలు తప్పవు.   ఇటువంటి వారికి ఎంత వీలయితే అంత దూరంగా ఉండటం శ్రేయస్కరం.   ఇగో, అహాన్ని వదులుకోలేనివాళ్ళు ఎవరినీ ప్రేమించలేరు.  అలాగే ఎవరికీ ప్రేమను అందించలేరు....ఎదుటివారి ప్రేమను సరిగా స్వీకరించలేరు.  ఇలాంటివాళ్ళు ఎదుటివాళ్ళ ముందు తమ అహం ఎక్కడ దెబ్బతింటుందోనని మేకపోతు గాంభీరం వహిస్తారు.  బయటకి ఎంత వినయం, విధేయతలను ప్రదర్శించినా లోపల మాత్రం గర్వం, అసూయ, అహం లాంటి దుర్గుణాలు పెరుగుతూనే ఉంటాయి.    ఎంత గొప్పవాడయినా, ఎంత పెద్ద పదవిలో వున్నా అహంకారం లేకుండా వుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుంది. 


Thursday 2 February 2017

"పరమ పవిత్రం రథసప్తమి"

ఆదిత్య కశ్యయపులకు  పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి.  ఇతర మాసాలలో వచ్చే సప్తమి తిధుల కన్నా మాఘమాసంలో వచ్చే ఈ సప్తమి ఎంతో విశిష్టమైంది.  అంతేకాదు రధసప్తమి నాడు సూర్యుడు తన రథాన్ని ఉత్తరం దిక్కుకు మళ్లించినరోజు.  ఈ రోజు నుంచే  సూర్యుని తీక్షత క్రమేణా పెరుగుతుంది.   సమస్త ప్రాణకోటి జీవనాధారానికి, సకల జీవుల సంపూర్ణ ఆరోగ్యానికి సూర్యభగవానుడే మూలం.  సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపముగానూ, మధ్యాహ్నం శివుడుగాను, సాయంత్రం వేళ విష్ణువుగానూ ఉంటాడని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.  ప్రతిరోజూ ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడిని అర్చించిన వారికి ఆయురారోగ్యఐశ్వర్యాలు ప్రాపిస్తాయంటారు.