”శోధిని”

Sunday 22 January 2012

కథా విశ్లేషణకి నేను ఎంచుకున్న రెండో కథ 'పరివర్తన'


కథా విశ్లేషణకి నేను ఎంచుకున్న రెండో కథ  'పరివర్తన' - రచయిత్రి : పి.వి. సుజాతారాయుడు  
                                                                                                                                                                    - కాయల నాగేంద్ర 
  
           కథ పాతదే అయినా కథనం ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తుంది.  కాలం మారినా వితంతువుల జీవితాలు మారలేదు.
        ఇక కథలోకి వెళితే ....
       ఆఫీసులో మహిళ కొత్తగా చేరబోతోంది అంటే అటు ఆఫీసర్ నుంచి ఇటు క్రింది స్థాయి ఉద్యోగి వరకు డ్యూటీలో కొత్తగా చేరబోయే మహిళను చూడాలనే తహతహ ఎక్కువ.  వాళ్ళు అనుకున్నట్లు జగదేక సుందరి కాకుండా కళావిహీనమైన ముఖంతో మామూలు మహిళ తోలి సారిగా ఆఫీసులో అడుగు పెట్టగానే ఆమె కోసం ఎదురు చూసిన వారి ముఖాలు ఆముదం త్రాగిన ముఖాల్లా వాడిపోతాయి.  ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త యాక్సిడెంట్లో మరణిస్తే, ఆమెను ఆదరించేవాళ్ళు లేక ఉద్యోగంలో చేరుతుంది సుశీల.  ఆమె ఎవ్వరూ లేని ఒంటరి అని తెలుసుకున్నమగాళ్ళు దీపం చుట్టూ తెరిగే పురుగుల్లా’ ఆమె చుట్టూ తిరగడం, అవకాశం కోసం ఎదురు చూడటం జరుగుతుంది. ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఆమె సీరియస్ గా తన పని తానూ చేసుకుపోవడంతో ఆమెపై కన్నుపడ్డ వారిలో కొంతమంది నిరాశతో డ్రాపవుతారు.  'ఎప్పటికైనా నా దారికిరాకపోతుందా' అని ఆలోచించే విక్రమార్కులు ఫైల్స్ అందించేటప్పుడు కావాలనే చేతులుతాకించి తృప్తి పడేవాళ్ళు సుశీల చూసిన చూపుకు ప్రక్కకు తప్పుకుంటారు.

      కొందరు చాలా విచిత్రమైన వారుంటారు. తరచి చుస్తే తప్ప వారి లోతులు అర్థం కావు.  పైనల్లో ఆమె పై కోరిక ఉన్నా పైకి మాత్రం ఉత్తముడిగా మార్కులు కొట్టేయ్యాలని శ్రీవాత్సవ హుందాగా వ్యవహరిస్తుంటాడు.  కొద్దిరోజులకు ఆమెతో స్నేహం చేసాక ఆమెకుడా స్నేహంగా చనిపోయిన తన భర్త గురించి మాట్లాడుతుంది. ఆమె తన భర్త ప్రస్తాపన తీసుకోచ్చినప్పుడల్లా అతనికి చిరాకు కలుగుతుంది.  భర్త జ్ఞాపకాలోంచి ఆమెను బైటకి తీసుకురావడానికి నానా తంటాలు పడతాడు.  చివరికి 'తన మేకవన్నె పులి' బుద్ధి బైట పడుతుంది.  ఆఫీస్ లో ఆమెను హత్తుకోబోతున్న అతన్ని నెట్టేసి, వైవాహిక బంధానకి అర్థం చెబుతుంది సుశీల.

       అగ్ని పర్వతంలా ఎగసిపడిన  శ్రీవాత్సవ కోరిక చల్లబడిపోయి పశ్చాత్తాపంతో తలదించుకుంటాడు.  'ప్రతి ఒక్కడు '' దృష్టితో చుసేవాల్లె తప్ప నన్ను ఆదరించే వాళ్ళు లేరని' సుశీల బాధ పడుతుంది.  తన తప్పు తెలుసుకున్న శ్రీవాత్సవ ఆమెకు అన్నగా, తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు. తన జీవితాన్ని వక్ర రేఖలా కాకుండా సరళ రేఖలా మార్చుకుంటాడు.  

         ఒక మగ మృగాన్ని మానవత్వం ఉన్న మనిషిగా మార్చడానికి సుశీల వ్యక్తిత్వం దోహదపడుతుంది.  'అన్నా చెల్లెల అనుబంధాన్ని' కూడా అనుమానించే నేటి సమాజం కాకిలా పొడుస్తుంది అనుకున్న శ్రీవాత్సవ 'చెల్లెమ్మా వెళ్ళొస్తా' అని చెప్పడం కొసమెరుపు.  సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని రచయిత్రి పి.వి. సుజాతా రాయుడు గారి తపన కథలో కనిపిస్తుంది. 

*****