”శోధిని”

Tuesday 17 May 2016

దొరికితే దొంగలు !

ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమకు నచ్చిన పార్టీలో చేరే స్వేచ్చ ఉంటుంది.  కానీ, ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీలో చేరడం అనైతికం.  అప్రజాస్వామ్యం.  ఒకవేళ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే, తాను గెలిచిన పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం కనీస ధర్మం.  ఒక పార్టీ నుంచి ఎన్నికై,  ఆతర్వాత  మరో పార్టీలో చేరడం ప్రజా తీర్పును కాలరాచినట్లే అవుతుంది.  ఒక పార్టీ సిద్ధాంతాలను అనుసరించి గెలిచిన తర్వాత మరో పార్టీలోకి వెళుతుంటే, ప్రశ్నించేవారు  కరువయ్యారు.  దీంతో అధికారం, ప్రలోభాలకు లొంగిపోయి విచ్చలవిడిగా పార్టీలు మార్చేస్తున్నారు.  ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓటు వేస్తారు.  వారిని కాదని ఎదో ప్రలోభాలకు లోనై,  పార్టీలు మార్చడం ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది.  ఇది ఏ ఒక్క పార్టీని వేలెత్తి చూపడం లేదు.  మనదేశంలోని   రాజకీయపార్టీలు ఇదే పద్దతిని ఎన్నుకోవడంతో దేశంలో అయోమయ పరిస్థితి నెలకొంది. కాళ్ళు నొప్పులు పుట్టే విధంగా ఊరూరు తిరిగి,  వంద రూపాయలను పెట్టి ఓటర్లను కొనడం కన్నా,   స్టార్ హోటల్లో కూర్చొని గెలిచిన అభ్యర్థికి  లక్షలు పోసి తన వైపుకు తిప్పుకోవడం  సులభమైన పని. అందుకే అందరూ ఈ పద్దతిని ఎంచుకొంటున్నారు. అడ్డంగా దొరికిపోయినవాళ్ళు దొంగలు. చాకచక్యంతో వ్యవహరించి దొరకనివాళ్ళు దొరలు. అభ్యర్థులను తనవైపు తిప్పుకొనే విషయంలో విఫలం చెందినవాళ్ళు  నీతిమంతులు.   ప్రశ్నించే ప్రజలు మౌనంగా ఉన్నంతకాలం ఇలాంటి నీచమైన  ఫిరాయింపుల  రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి.