”శోధిని”

Sunday 18 August 2013

మన తెలుగు

తెలుగు సాహితీ వనంలో
పరిమళాలను వెదజల్లే
పదహారణాల శుభప్రదమైన
తెలుగుభాషను తరగనీయకు
ముత్యంలాంటి మంగళప్రదమైన
పదసంపదను కరగపోనీయకు
జయప్రదమైన మాతృభాష
వైభవాలను చెరగి పోనీయకు
మల్లెపూవు లాంటి అమ్మభాషను
మలినం కానీయకు
తెలుగుభాష మన నిధి...
తెలుగుభాష మన సిరి...
అందుకే !
కలిసికట్టుగా కృషి చేద్దాం
అనిర్వచనీయమైన ఆనందాన్ని,
ఆహ్లాదాన్ని కలిగించే
తెలుగుభాషా సౌరభాలను
ఈ జగమంతా పంచుదాం
మన సంస్కృతీ సంప్రదాయాలపై
మమకారాన్ని పెంచుకుందాం
మాతృభాషను కాపాడుకుందాం!

Tuesday 13 August 2013

అహంకారం

ఎవరైనాసరే ఇతరుల గురించి తేలిగ్గా మాట్లాడటమే అహంకారానికి పరాకాష్ట. ఎదుటి వారిని గౌరవించకపోయిన పర్వాలేదు. కాని, అపహాస్యం చేయకూడదు. అహంకారులు ఏ సహాయం చేసినా, సలహాలిచ్చిన ‘నా అంతటి వారు లేరు... అంతా నాకే తెలుసు’ అన్న అహంకారం వాళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఎప్పుడూ వాళ్ళ గోప్పలే చెప్పుకుంటూ, వాళ్ళ ఘనతలను చాటుకుంటారు. ఎదుటివాళ్ళు తక్కువ వాళ్ళని, చేతకాని వాళ్ళని చులకన భావం. వాళ్ళ అహంకారమే వారికి హాని కలిగిస్తుందని తెలిసినా వారిలో ప్రవర్తన రాదు.  ఇలాంటి వారిని ఎవరూ హర్షించరు. అహంకారం వుంటే అక్కడ స్వార్థం తప్పకుండా వుంటుంది. ఇలాంటి అహంభావులతో కలసి పనిచేయాల్సివస్తే సమస్యలు తప్పవు. అందుకే సాద్యమైనంత వరకు ఇలాంటి వారికి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళ మాటల వల్ల, ప్రవర్తన వల్ల భాధ పడ్డ వారు, వారి నుంచి ఎలాంటి సలహాలను తీసుకోవడానికి ఇష్టపడరు. ఎంత గొప్పవాడయినా, ఎంత పెద్ద  పదవిలో వున్నా అహంకారం లేకుండా వుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుంది. అహంకారం వల్ల నష్టాలే కాని, లాభాలు ఉండవని గ్రహించాలి.    

Sunday 11 August 2013

తస్మాత్ జాగ్రత్త!

నేడు నెట్ లో హల్ చల్ చేస్తున్న ‘చాటింగ్’ మొదట సరదాగా మొదలై, పోను పోను మనిషి జీవితాన్ని విషవలయం లోకి నెట్టేస్తోంది.  ఆ తర్వాత కోలుకొని చిక్కుల్లో పడేస్తోంది. దీనికి బానిస అయిన వాళ్ళు ముఖ్యంగా యువతీయువకులు ఈ లోకంతో మాకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.  చుట్టుపక్కలవారిని పట్టించుకోరు.  తిండి గురించి ఆలోచించరు.  ఇందులో మునిగిన వాళ్ళు ఎక్కువగా చదువు పైన ద్యాస లేనివాళ్ళు, చేసేపని పైన నిబద్దత కరువైన వాళ్ళే కావడం విశేషం.  చాటింగ్ వలన  ఉపయోగం శూన్యం. నూటికి తొంబై శాతం ఈ చాటింగ్ సంభాషణలు నిష్పలమైనవే.  ఈ ఉచ్చులో చిక్కుకుంటే మనసు అదుపులో ఉండదు. స్వయం నియంత్రణ కోల్పోతారు.  తన వాళ్ళను దూరం పెడతారు.  చివరికి మానసిక ఉగ్మతలకు గురవుతారు. ఈ చాటింగ్ ద్వారా  ఏంతో విలువైన  సమయం వృధా అవడమే కాకుండా సన్నిహితులతో సంబంధాలు కోల్పోతున్నారు.  వ్యక్తుల జీవితాలను ఛిద్రం చేసే చాటింగ్, మనస్సులో కల్లోలం రేపే విషవలయం.  ఈ వ్యసనానికి దూరంగా వుండండి.  మీ జీవతాలను పదిలంగా వుంచుకోండి.  తస్మాత్ జాగ్రత్త!  

Thursday 8 August 2013

'రంజాన్' పర్వదిన శుభాకాంక్షలు!


ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రమైన 'రంజాన్' పండుగ అత్యంత ప్రధానమైనది.  రంజాన్ మాసం ప్రారంభం రోజు నుంచి వేకువజామునే లేచి, సూర్యోదయానికి ముందే అన్నపానీయాలను పూర్తి  చేస్తారు.  అప్పటినుంచి నెల రోజులు  సూర్యాస్తమయం వరకు  దైవారాధన, పవిత్ర ఉపవాసాలు ఆచరిస్తారు. ఎంతో  దీక్షగా ఖురాన్ పారాయణ చెస్తారు.  అమావాస్య తర్వాత కనిపించే నెలవంకను చూసిన పిమ్మట రంజాన్ ఉపవాసాలు ముగించి  ఆనందం విరిసిన హృదయంతో రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఇప్తార్ విందుకు ఇతరులను ఆహ్వానించి సమైఖ్యతను చాటుతారు.  ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికి  'రంజాన్' పర్వదిన శుభాకాంక్షలు!


Sunday 4 August 2013

స్నేహబంధం ... ఎంతో మధురం!


బ్లాగ్ మిత్రులందరికీ మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు!

Saturday 3 August 2013

ఈనాడు (04-08-13) హైదరాబాద్ ఎడిషన్ లో




హాయిగా నవ్వండి... ఆరోగ్యంగా వుండండి!

        మానవులకు దేవుడిచ్చిన అపురూపమైన గొప్ప వరం ‘నవ్వు’.  ఈ భాగ్యం మానవాళికి మాత్రమే దక్కింది.  హాయిగా నవ్వడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి.  మనసారా నవ్వితే ఆయువు పెరుగుతుంది.  శారీరక ఆరోగ్యం చేకూరుతుంది.  చలాకీగా ఉండటంతో ఒత్తుళ్ళు దరి చేరవు.  ప్రతి రోజు కనీసం 20 నిమిషాలు నవ్వితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ఆందోళనను మటుమాయం చేసి మనస్సును ప్రశాంతంగా వుంచుతుంది.  అంతేకాదు శత్రువులను కుడా మిత్రులుగా మార్చే గుణం ఈ నవ్వుకి వుంది.  అవకాశం వచ్చినప్పుడల్లా హాయిగా నవ్వి చూడండి... మీకు తెలియకుండానే అధిక రక్తపోటు అదుపు లేకి వస్తుంది.  ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి.  గుండె జబ్బులు దూరం అవుతాయి.    మనుషల మధ్య  నవ్వులు విరబూసి ఆనందాన్ని పంచుకుంటే బంధాలు బలపడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న నవ్వు కన్నీళ్ళను కడిగేసే కల్మశం లేని పువ్వు లాంటిది అందుకే హాయిగా నవ్వండి.