”శోధిని”

Monday 29 August 2016

మా తెలుగు తల్లికి మల్లెపూదండ !



మా ఆఫీసులో పనిచేసే వారంతా తెలుగువారే. కాని, తెలుగు మాట్లాడితే తమ హొదాకు భంగమనుకుంటారు. ఆంగ్లంలో మాట్లాడితే గొప్పగా భావిస్తూ, తెలుగు మాట్లాడేవారిని చూసి నవ్వుకుంటారు.  ముద్దులొలుకు తెలుగు పదాలను హేళన చేస్తుంటారు.  పరభాషా వ్యామోహంలో పడి,  మన తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు. తెలుగు భాషలోని తియ్యదనం ఇలాంటివారికి ఎంత చెప్పినా చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లు అవుతుంది. కట్టు, బొట్టు తెలుగువారిదయినప్పుడు  తెలుగులో మాట్లాడటం అవమానంగా భావించడం ఎందుకు? గొప్పలకుపోయి  మాతృభాషను కించపరచడం ఎందుకు? ఇలాంటివారివల్ల తెలుగు సంస్కృతులు, ఆచారవ్యవహారాలు మాయమైపోతున్నాయి.  'మధురమైన తెలుగు  భాషలోని  పలుకులు తేనెలొలికే గులికలని' ప్రతి తెలుగుపదం వీనులవిందుగా, వినసొంపుగా ఉంటాయని మన తెలుగువాళ్ళు తెలుసుకొనే రోజు రావాలి. 

      "ముద్దులొలుకు తెలుగు భాష అందం .... వాడని మల్లెల సుగంధం"  

Sunday 21 August 2016

"పుష్కర స్నానం"



అవినీతికి పాల్పడుతూ....మోసాలు, నేరాలు చేసి నదిలో మునకేస్తే చేసిన పాపాలు తొలగిపోతానుకోవడం ఒట్టి భ్రమ.  సమాజంలో ఎవ్వరికి ఏ హాని తలపెట్టకుండా మనసును పవిత్రంగా ఉంచుకుని పుష్కర స్నానం  చేస్తే, ఫలితం తప్పకుండా దక్కుతుంది. పుష్కర స్నానాలు ఆచరించేవారు మనసును పవిత్రంగా ఉంచుకుని,  జలాన్ని కలుషితం చేయకుండా మూడు మునకలేసి   నదికి నమస్కరించి బయటకి రావాలి.  మనసును నిర్మలంగా ఉంచుకొని,  ఈర్ష్య అసూయలకు  తావు ఇవ్వకుండా పుష్కర స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది.... పుణ్యం లభిస్తుంది.   శరీరాన్ని శుభ్రం చేసుకుని, మనసులోని మలినాన్ని కడిగేసుకోకపోతే ఎన్ని పుష్కర స్నానాలు చేసినా నిష్పలం అవుతుంది.  



Wednesday 17 August 2016

"అన్నాచెల్లెల అనుబంధం ... రక్షాబంధన సుగంధం"



శ్రావణ పౌర్ణమి  నాడు సోదర అనుబంధాల్ని గుర్తు చేసే ఆత్మీయానురాగాల పండుగ రాఖీ పండుగ.  భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి.  ఈ రోజున సోదరి, సోదరుడికి కట్టే రక్షణ కవచం రాఖీ.  మహిళలకు రక్షణగా నిలవడడమే ఈ పండుగ ఉద్దేశం.  స్త్రీల పట్ల సోదరభావం, పవిత్రభావం ప్రతి ఒక్కరిలో కలగాలి. సమాజంలో తనకు పూర్తి రక్షణ ఉందన్న నమ్మకం ప్రతి మహిళలో కలిగించాలి.  
   "అన్నాచెల్లెల అనుబంధం ... రక్షాబంధన సుగంధం"

 


తీపి కబురు !




ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో మన దేశానికి తోలి పతకం సాధించిపెట్టిన తొలి మహిళ 'సాక్షిమాలిక్' కి అభినందనలు తెలియచేద్దాం !

Friday 12 August 2016

మంగళప్రదం... సౌభాగ్యప్రదం...వరలక్షి వ్రతం !


వరలక్ష్మి వ్రతం మహిళలందరికీ మంగళప్రదమైనది...ఎంతో శుభదాయకమైనది.  సౌభాగ్యప్రదమయిన శ్రావణమాసంలో   మహిళలు భక్తిశ్రద్ధలతో చేసే వ్రతం శ్రవణ శుక్రవార వ్రతం.  ఈ మాసంలో వరలక్ష్మి పూజ, శుక్రవార వ్రతం  చేస్తే, ఆయురారోగ్య ఐశ్వర్యాలనిస్తాయి.  శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే శుక్రగ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయని మహిళలు నమ్ముతారు.   ఈ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.  

Monday 8 August 2016

చూపుల్లో నిలిచావు !



సుప్రభాతవేళ ...
పువ్వులోని మాధుర్యాన్ని 
ఆస్వాదించే తుమ్మెదలా ...
నీటి అలల పైన 
విహరించే రాజహంసలా ...
కొలనులో విరిసిన
అందమైన తామర పువ్వులా...
కన్నుల్లో మెరిసావు
చూపుల్లో నిలిచావు