”శోధిని”

Saturday 28 June 2014

"వృద్ధులు వున్న ఇల్లు వృద్ధి చెందును"

తల్లిదండ్రులు అమృత హృదయులు.  వారు మనల్ని  ఎంత చక్కగా సంరక్షించారో అంతకంటే ఎక్కువగా వృద్ధాప్యంలో వారిని నిర్లక్షం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.  జన్మనిచ్చిన వారు ప్రత్యక్ష దైవాలు.  వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన ధర్మం.  వారు జీవించినంత కాలం కంట తడిపెట్టే  పరిస్థితి కల్పించకూడదు.  వారిని బాధపెట్టడం ఇంటికి అంత క్షేమం కాదు. మనకు జీవితం వారిచ్చిన భిక్షే నని మరవద్దు.  వారి ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు.  తల్లిదండ్రులను పుజ్యునీయులుగా చూడలేని వారు దైవారాధన చేయడం శుద్ధదండగ.  ఎప్పుడూ మనం అనుభవిస్తున్న సిరిసంపదలు వారి పుణ్యఫలాలేనని గుర్తుంచుకోవాలి. "వృద్ధులు వున్న ఇల్లు వృద్ధి చెందును" అన్న సూక్తిని మరవద్దు.

Sunday 22 June 2014

అహం... మనిషికి గ్రహణం !

మనిషిలో ద్వేషం, ఈర్ష్య పెరగడం ద్వారా విజ్ఞత లోపిస్తుంది.  మానవత్వం అడుగంటి పోతుంది.  దాంతో అహం పెరిగి కన్నుమిన్ను కానరాకుండాపోతాయి.   ఎప్పుడయితే  మనిషిలో అహంకారం ప్రారంభమవుతుందో ... అప్పటి నుంచి అతని పతనం కూడా మొదలవుతుంది.  స్వార్థ బుద్ధి, తెలియని ఆశ వెంతాడుతుండటం వల్లనే నీచమైన అలవాట్లు మనసులో చోటు చేసుకుంటాయి.  దాంతో వ్యకిత్వం దహించుకు పోతుంది.  అహంకారం  వున్న వ్యక్తిలో  విచక్షణా జ్ఞానం కొరవడుతుంది.  తద్వారా రాక్షసులుగా మారిపోతారు. 'నేను' అనే అహం సర్వ సమస్యలకు మూలకారనమవుతుంది.  అహంకారపూరిత చేతలకు ప్రతి వ్యక్తి దూరంగా ఉంటేనే, మనస్సు ప్రశాంతంగా, స్వచ్ఛంగా, స్థిరంగా ఉంటుంది.  


Saturday 21 June 2014

వెన్నెల రేయి!

 వెన్నెల రేయి ...
 ఆహ్లాద భరితమైన వాతావరణం...  
నిర్మలమైన ఆకాశం... 
  విచ్చుకున్న మల్లెపువ్వులా ఉంది 
మల్లెల ఘుమఘుమల
పరిమళపు మత్తులో మినిగిన
చిలకా గోరింక లాంటి
నవదంపతుల కోరికలు 
గుర్రాలయ్యాయి 
తొలిరేయి మధురమలను 
మనసారా ఆస్వాదిస్తూ 
ప్రణయ వీధుల్లోవిహరించాలని...
వెన్నెల  జల్లుల్లో 
తనివితీరాతడవాలని ఆ జంట ఆరాటం !



Friday 20 June 2014

నీ ... సోయగాలు !


నీ ముఖారవిందం...
తామరపూరేకులు  !
నీ  వాలు చూపులు ...
వెన్నెల వెలుగులు  !
నీ కమ్మని  పలుకులు ...
మధురమైన భావాలు !
నీ చిరు దరహాసాలు 
సుగంధ పరిమళాలు !
అదిరేటి నీ అందం...
వెలకట్టలేని మకరందం !
అందుకే ...!
నిశ్చలంగా నిలిచిపో ...
నా కళ్ళనిండా  !
శిల్పంలా ఒదిగిపో... 
నా గుండెల నిండా!



Thursday 19 June 2014

"జగన్...బాబు" కలయిక

              "ఇద్దరూ ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ కలిసి పనిచేస్తే ... త్వరలోనే 'ఆంధ్రప్రదేశ్' స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది"

Saturday 7 June 2014

నవ్యాంద్రకు చంద్రోదయం !


నేడు  అతిరధ మహారధుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జననేత, తెలుగుదేశం అధినేత  శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక హార్థిక శుభాకాంక్షలు!  అభివృద్దే ఆశయంగా ... సుపరిపాలనే ధ్యేయంగా ... ముందుకు సాగుతూ, తెలుగు జాతికి ఆత్మా గౌరవం, తెలుగు నేలకు పూర్వ వైభవం తీసుకు వస్తారని ఆశిద్దాం!! ఇందు  మూలంగా రాజకీయ నాయకులకు నా విజ్ఞప్తి తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయి వారం రోజులు కూడా కాలేదు.  అప్పుడే ప్రభుత్వాల పైన విమర్శలు చేయడం తగదు.  రాష్ట్రాలను అభివృద్ధి వైపు నడిపించే సత్తా ఇటు శ్రీ చంద్రశేఖర రావు గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి పుష్కలంగా ఉంది.  కొద్ది రోజులు ఓపిక పట్టండి... ఆ తర్వాత విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది.  శ్రీ చంద్రశేఖర రావు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి వారం రోజులు కూడా కాలేదు, అటు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.  అప్పుడే వీరి పైన విమర్శలు చేయడం తగదు.  రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను నా విన్నపం.  రెచ్చకొట్టే రాజకీయ నాయకుల మాటలను నమ్మకండి.  రెండు రాష్ట్రాలు కోలుకోవడానికి కొద్ది సమయం పడుతుంది.   కొత్త  ముఖ్యమంత్రులకు సహకరించి రాష్ట్రాల అభివృద్దిలో  భాగం పంచుకోండి.                


Wednesday 4 June 2014

వృక్షజాతి సంబంధం !



పుష్పాలు ధరించిన
కొత్త పెళ్ళికూతురులా అందంగా...
మధురమైన ఫలాలతో
నిండు గర్భిణిలా నిండుగా ...
లోకమంతా పచ్చదనం పంచుతూ
పరిసరాలకు చల్లదనం అందిస్తూ
మనసులో మధురిమలు నింపి
తనువులో పులకింతలు రేపి
సహజంగా... స్వచ్ఛంగా...
మనిషితో పెనవేసుకున్న బంధం
వృక్షజాతి సంబంధం !

"పచ్చని  మొక్కలను నాటి వనసంపద పెంచుదాం 
మలినాలను  తగ్గించి పరిశుభ్రతను పాటిద్దాం"


Tuesday 3 June 2014

నవ్వుతూ... బ్రతకాలి!



కష్టాలను తొలగించి...
బాధలను మరిపించి...
మానసిక ఒత్తడిని తగ్గించే...
శక్తివంతమైన ఆయుధం 
పెదవుల పైన వికసించే  చిరునవ్వ!
అందుకే ఎప్పుడూ నవ్వడం నేర్చుకోవాలి 
నవ్వుతూ ...ఎదుటివారిని నవ్వించాలి 
చిరునవ్వులో ఆనందమే కాదు 
జీవితం కూడా వుందని తెలుసుకోవాలి !!

Sunday 1 June 2014

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం !


తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా మారుతున్న వేళ...   భారతదేశ 29వ  రాష్ట్రంగా 'తెలంగాణ రాష్ట్రం' జూన్ 2న ఆవిర్భవించనున్న శుభతరుణంలో రెండు రాష్ట్రాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ... తెలంగాణ రథసారథి,  తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్థిక శుభాకాంక్షలు.  సమిష్టి కృషితో అలుపెరుగని ఆత్మవిశ్వాసంతో తెలంగాణను  సాధించిన తెలంగాణ ప్రజలకు  'తెలంగాణ అవతరణ దినోత్సవ' శుభాకాంక్షలు !