”శోధిని”

Tuesday 30 April 2013

'మే' డే శుభాకాంక్షలు!



                          'ప్రపంచ కార్మికులారా! ఏకం కండు' అంటూ ప్రతిధ్వనించిన రోజు 
                           శ్రామికులందరూ ఆనందంతో జరుపుకునే పండుగ రోజు  'మే' డే!

                                                 అందరికీ 'మే' డే శుభాకాంక్షలు! 

హైటెక్ మానవుడు!

నేడు మానవ సంబంధాలు 
ఆర్ధిక సంబంధాలుగా 
మారి పోతున్నాయి
ఆస్తిని పెంచుకుంటూ 
పరుల గురించి 
ఆలోచించడం మానేస్తున్నారు 
ఇంటి వైశ్యాల్యం పెంచుకొంటూ...  
హృదయ వైశ్యాల్యం
తగ్గించుకుంటున్నారు 
కానరాదు ఎక్కడా మానవత్వం 
అణువణువునా క్రూరత్వం 
భోగభాగ్యాలు శాశ్వతం కాదని 
సమాజంతో సత్ సంబంధాలు 
ఇరుగు పొరుగు వారితో 
కలిసి ఉండటం మఖ్యమని 
ఈ హైటెక్ మానవుడు 
తెలుసుకునేదేప్పుడో!

Friday 26 April 2013

అందాల రాశి

సప్త వర్ణాలను 
నింపుకున్న హరివిల్లులా...  
సప్త స్వరాలను 
పలికించే వేణుగానంలా ... 
నీ మేను సౌందర్యం 
ఏంతో  మనోహరం!
నీ చిరు దరహాసం 
ఏంతో ఆహ్లాదకరం!! 


Monday 22 April 2013

నీటి కష్టాలు!














రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో త్రాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి.  లక్షలాది మంది గుక్కెడు మంచి నీళ్ళ కోసం అల్లాడుతున్నారు.  దానికి తోడూ విద్యుత్ కోతలు ఈ సమస్యను మరింత తీవ్రం  చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.  ఈ జిల్లాలలో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయాయి.  ఈ పరిస్థితి కావడానికి కారకులు మన పాలకులే.  ఓట్ల కోసం అన్నీ ఉచితాలు ఇస్తామని వాగ్ధానాలు చేసే రాజకీయ నేతలే.  ప్రజలు త్రాగడానికి మంచి నీళ్ళు ఇవ్వలేని పాలకులు ఎన్నికలు రాగానే అన్నీ ఉచితం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. నీటి కోసం ప్రజలు పడే పాట్లు చూసి కుడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.  నీటిని నింపాల్సిన చెరువులు కజ్జాకు  గురవుతుంటే చోద్యం చూస్తున్నారు. ఇష్ట మొచ్చినట్లు  బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తుంటే పట్టించుకునే నాధుడే లేడు.   ఫలితంగా నేడు భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.  ఎప్పటి కైన పాలకులు, రాజకీయ నాయకులు మేల్కొని తక్షణమే నీటి సమస్య పైన దృష్టి పెట్టాలి.   


Sunday 21 April 2013

పాపం పసిపాప


             లోకం పోకడ తెలియని ముక్కుపచ్చలారని ఓ ఐదేళ్ళ పసిపాప పై ఓ నీచుడు పాశవికంగా అత్యాచారానికి పాల్పడి పాప బాల్యాన్ని చిదిమేయడం దారుణం.   ఈ నరరూప రాక్షసుడు అత్యంత హేయంగా, రాయడానికి వీల్లేనంతగా మగ మృగ శాడిజాన్ని చూపించాడు. కామం తలకెక్కన కామందులు పసిపాపలను సైతం వదలక పోవడం మనుషుల్లో పెరిగిన పైశాచికత్వానికి పరాకాష్ట.  ప్రభుత్వం చట్టాలు రూపొందించి చేతులు దులుపుకుంటుంది.  పోలీసులు సరిగా స్పందించక  పోవడంతో ప్రతిరోజూ ఇలాంటి  అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే వెలుగు చూస్తున్నాయి. వెలుగులోకి రానివి కోకొల్లలు.  ఎంత జరుగుతున్నా  పోలీసులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. ప్రజలు ఆందోళనలు చేస్తేనే నిందితులను పట్టుకుంటున్నారు. మానవ మృగాల్లో మార్పు రావాలంటే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే  మృగాలను చట్టాలు, కోర్ట్ లంటూ తిప్పుతూ సమయాన్ని వృధా చేయకుండా ఒకేసారి ఉరితీయాలి.   

       అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారి త్వరగా కోలుకోవాలని భగవంతుడుని ప్రార్థిస్తాం. 

    

Thursday 18 April 2013

అంతా రామ మయం!












  శ్రీ రామ దర్శనం...  
  సకల శుభదాయకం
  రామనామ తారకం... 
  భక్తి ముక్తి దాయకం
  జానకీ మనోహరం... 
  సకలలోక నాయకం
  సీతారాముల కల్యాణ వేడుకల్లో 
  మనం కుడా మమేకమవుదాం 
  సకల శుభాలను పొందుదాం !

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!!

Wednesday 17 April 2013

మల్లెపూల మహత్యం!








!






వేసవిలో ఎండ  ఎంత తీవ్రంగా ఉన్నా, సాయంకాలం వేళ మల్లెలను చూడగానే రోజంతా శరీరకష్టంతో అలసిపోయినవారి  మనసంతా ఆహ్లాదం నిండుతుంది.  మధురానుభూతి పొందుతారు.  పరిమళానికి మారుపేరయిన  పరిమళభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే! అంతేకాదు చల్లదనానికి, కమ్మదనానికి, గుభాలింపులకు  మరు పేరైన  మల్లెపూలు....   మహిళల సిగలో సహజ ఆభరణాలు.  మండుటెండలో 
మల్లెల సౌరభం జీవితాలనే మార్చేస్తుంది.  ఇది  మల్లెపూల మహత్యం.  

Saturday 13 April 2013

మనవ మృగాలు


ప్రేమిస్తే--- 
ప్రాణం ఇస్తాయి పశువులు! 
ప్రేమించకుంటే--- 
ప్రాణం తీస్తున్నారు 
మనవ మృగాలు!!

Wednesday 10 April 2013

అందరికీ ఉగాది శుభాకాంక్షలు!



             ఉగాది తెలుగువారి సంవత్సరాది.  జీవితాల్లో ఉషస్సులు నింపే పండుగ .  కాని,నేటి యువత జనవరి 1న ఆంగ్ల  సంవత్సరానికి  అలవాటు పడటంతో ఎంతో  విశిష్టత వున్న  ఉగాదిని మొక్కుబడిగా జరుపుకొవడం ఆనవాయితీగా మారిపోయింది.  ఫలితంగా మన భాష, సంస్కృతి , సంప్రదాయాలు క్రమేణా కనుమరుగున పడుతున్నాయి.  ఇప్పటికైన మన ఉగాది పండుగ గొప్పదనాన్ని పిల్లలకు వవరించి మన సంస్కృతిని కాపాడుకుందాం. 

        చైత్ర మాసంలో ప్రకృతి  ఎంతో  శోభాయమానంగా ఉంటుంది.  చెట్ల ఆకులు రాల్చి, కొత్త చిగుళ్ళతో ఆకుపచ్చదనం కళ్ళకు సుఖాన్ని, ఆనందాన్ని కలుగచేస్తుంది.  వసంత ఋతువు  చైత్ర మాసంలోనే ఆరంభమవుతుంది.  ఈ రుతువులోనే కోయిల లేత మామిడి చిగుళ్ళను తింటూ, మధురంగా గానం చేస్తుంది.  ప్రకృతిని చూసి సకల ప్రాణులు పరవశం చెందేది ఈ రుతువులోనే.  అందుకే ఈ ఋతువుకు రుతురాజు అనే పేరు సార్థకమైంది. 

        వసంత ఋతువులో ప్రకృతి  సర్వాంకార శోభితమై కనువిందు చేస్తుంది.  వసంత ఋతువులో చైత్రంమాస, శుక్లపక్ష పాడ్యమినాడు ఉగాది పండుగ.  ఋతువులలో వసంతం మొదటిది.  తెలుగు నెలల్లో చైత్రం మొదటిది. అలాగే పక్షాలల్లో శుక్లపక్షం, తిధులల్లొ  పాడ్యమి ఇలా  ఋతువు, మాసం, పక్షం, తిధి అన్నీ ప్రధమమైనవి నందున ఈ రోజున వచ్చే ఉగాదికి అంత ప్రాధాన్యత వుంది. ఈ రోజునే బ్రహ్మదేవుడు పూర్వం సృష్టిని ప్రారంభించినట్టు  మన పురాణాలు చెబుతున్నాయి. 

   తెలుగువారి సొంతమైన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. దీన్ని సేవించడం వలన ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది.   ఇందులో  వాడే వేపపువ్వులో క్రిమిసంహారక గుణం ఉంది.   మామిడి ముక్కలు రక్తప్రసరణ దోషాలను నివారిస్తాయి. చింతపండు వాతాన్ని హరిస్తుంది.  బెల్లం రక్తహీనతను పోగొడుతుంది.  పచ్చిమిరపకాయకు వాతాన్ని పోగొట్టే గుణం ఉంది .  ఉప్పు అజీర్ణాన్ని  పోగొడుతుంది. ఇన్ని సుగుణాలున్న ఉగాది పచ్చడి పరమౌషదం.

          ఉగాది రోజున ఆనందంగా ఉంటే  సంవత్సరమంతా శాంతి సౌఖ్యాలతో జీవితం గడిచిపోతుందని చాలా మంది నమ్ముతారు. గొప్పవారైనా , పేద వారైనా తమ తమ శక్తి తగ్గట్టుగా ఉగాది రోజున ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించాలి.  పచ్చని తోరణాలతో గుమ్మాలను అలంకరించి వసంత లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తాం. ఆప్యాయతలు, అనుబంధాలు , అనురాగాలు, ఆత్మీయతల మధ్య ఆనందో త్సాలతో ఉగాది పండుగను జరుపుకుంటాం .

         ఈ విజయనామ సంవత్సరం  అందరికీ విజయం చేకూరాలని, సర్వశుభాలు కలగాలని ఆశిస్తూ... అందరికీ ఉగాది (నూతన సంవత్సరం) శుభాకాంక్షలు!

                                                   సర్వేజనా సుఖినోభవంతు !
                                                                     ---

Wednesday 3 April 2013

ప్రేమను పంచు!


ప్రేమ అనేది 
ఓ మధుర కలశం 
ఎంత ఆస్వాదిస్తే 
అంత రమణీయం... 
అందుకే ప్రేమించాలి 
ప్రేమను పంచడంలో 
అందరిని మించాలి!