”శోధిని”

Friday 27 February 2015

ప్రేమరాగం !


shark emoticon సాహితీ సేవ సమూహం నిర్వహించిన చిత్ర కవితల పోటీ -13 లో ' ప్రేమ ' అంశంపై ' ప్రేమ రాగం ' .. అనే శీర్షికతో కవిత రాసి" ప్రత్యేక బహుమతి" గెలుచుకొని విజేతగా నిలచిన కవి శ్రీ కాయల నాగేంద్ర గారికి అభినందనలు.
_________________/\_______________
shark emoticon కవి శ్రీ కాయల నాగేంద్ర గారి కలం నుండి జాలు వారిన కవితా కుసుమం.
☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼
heart emoticon ప్రేమ రాగం ..
ప్రేమ ...
అనుబంధం పూసిన పుష్పయాగం
అనురాగం ఎగిసిన సుగంధ పరిమళం
సర్వమానవాళి శ్రేయస్సు కాంక్షించే శోభాయమానం
ఆ పేరు వింటేనే మధురం... ఆ పలుకు మధురాతి మధురం
ప్రేమంటే ...
ఒక పులకింత... ఓ కలవరింత !
కులం, మతం, వయసు అనే సరిహద్దులు లేని గమ్యం
ఓటమి ఎరుగని మలయ మారుతం
ఏదో ఒక క్షణాన ప్రతి జీవిలోనూ చిగురించే
ఓ దివ్యమైన అనుభూతి !
దేవుడు మానవులకిచ్చిన అపురూప కానుక ప్రేమ
దానికి త్యాగం తప్ప మోసం, వంచన తెలియని
స్వచ్చమైన స్వాతిముత్యం !
ఈ ప్రేమ బంధానికి నమ్మకం పునాది
ఆ నమ్మకం కలకాలం నిలవాలంటే...
హృదయవీణపై ప్రేమరాగం
నిరంతరం మోగుతూ ఉండాలి !
గుండెల్లో నాదమై...
కళ్ళల్లో వెలుగుదీపమై...
అణువణువునా ప్రాణమై...
నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి !
- కాయల నాగేంద్ర

మన తెలుగు తల్లికి మల్లెపూదండ !


ఆత్మగౌరవాన్ని ప్రసాదించే మాతృభాషను అభిమానించడం ప్రతి ఒక్కరి భాద్యత. అమ్మ భాషను గౌరవిస్తే ఆత్మ గౌరవం పెరుగుతుంది. దాంతో భాషకి పటుత్వం పెరుగుతుంది. భాష ప్రాముఖ్యతను గుర్తించినప్పుడే ఆ భాషకి ఖ్యాతి పెరుగుతుంది.  ఐ జాతి అయితే మాతృభాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే మనందరం మన మాతృభాషలో మాట్లాడుకుందాం! తెలుగు భాష ఔనత్యాన్ని పెంచుదాం!!

Wednesday 25 February 2015

"ఆహా! ఏమి రుచి"


ఫిబ్రవరి 21, 22 తేదీలలో  విజయవాడలో జరిగిన 3వ  ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో  కమ్మటి తెలుగువారి విందు భోజనం రుచి చూపించారు.  అరటి ఆకులలో  చక్ర పొంగలి, పెరుగు వడలు, పులిహోర, ముద్ద పప్పు, గోంగూర పచ్చడి, గుమ్మడికాయ పులుసు, తోటకూర పప్పు, ఆవకాయ, అప్పడాలు, గుమ్మడి వడియాలు, పచ్చి పులుసు, ములక్కాయ సాంబారు, మసాల వంకాయ, కొబ్బరి పచ్చడి, చిక్కుడుకాయ వేపుడు, బెండకాయ వేపుడు, గడ్డ పెరుగు, నెయ్యి, దోసకాయ పచ్చడి వడ్డించారు. ఇంకా....ఇంకా కొన్ని గుర్తుకు  రావడం లేదు.  రుచి అమోఘం ! 

Tuesday 17 February 2015

సర్వం శివమయం !

 

మాఘమాసం బహుళ చతుర్దశినాడు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చాడు. ఆ విధంగా అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగింది కాబట్టి ఈ రోజున పరమ పవిత్రమైన మహాశివరాత్రి అయింది. లింగోద్భవం సమయంలో శివారాధనకు అత్యంత ప్రాధాన్యత నివ్వడం జరిగింది. శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి.  ఈ శుభకరమైన శివరాత్రి రోజున పవిత్ర స్నానాలు, అభిషేకాలు, ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. కేవలం ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే సరిపొదు.  అనుక్షణం 'ఓం నమశ్శివాయ' అనే శివపంచాక్షరి మంత్రాన్ని పటిస్తూ... మనసును పవిత్రంగా,  ప్రశాంతంగా ఉంచుకోవాలి. పార్వతీదేవి స్వేదం నుండి వుద్బవించిన బిల్వ వృక్షాలు  శివునికి ఎంతో ప్రీతికరమైనవి.  శివునికి ఇష్టమైన బిల్వపత్రం పట్టుకున్నా శివలింగాన్ని దర్శించుకునంత ఫలితం దక్కుతుంది... ఆరోగ్యం, ఐశ్వర్యం అభిస్తాయి.   ప్రపంచంలోవున్న  సర్వ తీర్థాలు బిల్వపత్రంలో  ఉన్నాయి కాబట్టి బిల్వపత్రంతో శివలింగాన్ని పూజిస్తే ... శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది. ఈ శివరాత్రి పర్వదినాన ప్రజలందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం.