Thursday, 16 August 2018

మహానేతకు నివాళి

భారతదేశ కీర్తిని ఖండాంతరాలకు  వ్యాపింపచేసిన మహానేత, ఉత్తమ పార్లమెంటేరియన్, ఉత్తమ ప్రధానిగా ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న గొప్ప మానవతావాది అటల్ బిహారీ వాజపేయి గారి ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతుడిని కోరుకుంటున్నాను.  


జలహారం

జాలువారే జలపాతం 
ప్రకృతి  మనకిచ్చిన వరం 
జలజలజారే జలపాతం 
ప్రకృతిమాతకు ఆభరణం 
ఎంతో ఆహ్లాదం ప్రకృతి  రమణీయం
సమస్త జీవజాలానికి జీవనాధారం !


Tuesday, 14 August 2018

మన జెండా పండుగ

జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో జరుపుకునే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం. ఇది ఎందరో వీరుల పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలం. తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడి మన దేశానికి విముక్తి లభించిన రోజు.... 'ఆగస్టు 15' మన దేశ చరిత్రలో మరచిపోలేని ఒక అపురూపమైన రోజు. ఈ సందర్భంగా మనకు స్వేఛ్ఛావాయువులు అందించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ! 

Monday, 13 August 2018

అయిదో జ్యోతిర్లింగం


కేదారేశ్వరలింగం భూమికి పదకొండువేల అయిదు వందల అడుగుల ఎత్తులో ఉన్న కేదారేశ్వర లింగం హిమాలయపర్వతంపై ఉంది. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారట. ఉత్తరదిక్కున ఎత్తయిన మంచుకొండల్లో ప్రత్యేక జ్యోతిర్లింగ క్షేత్రం ఈ కేదారేశ్వర జ్యోర్లింగం. ఇక్కడ ఋషులందరూ స్వామిని దర్శిస్తూ ఉంటారు.  దేవతలు,  రాక్షసులు,  యక్షులు మొదలైన వారు సేవిస్తూ ఉంటారు.  వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి వరకు ఆరు నెలలు మాత్రమే ఈ దేవాలయం తెరచియుండి భక్తులకు దర్శనం కలుగుతుంది.  దీపావళి రోజున  స్వామికి నేతితో దివ్యజ్యోతి వెలిగించి మూసిన దేవాలయం తలుపులు వైశాఖ శుద్ధ పాడ్యమినాడు తెరిచేనాటికి ఆరు నెలల క్రితం వెలిగించిన దీపం యథాతథంగా వెలుగుతూ దర్శనమిస్తుంది.

Sunday, 5 August 2018

నాలుగో జ్యోతిర్లింగం

ఓంకారేశ్వర  క్షేత్రం మధ్యప్రదేశ్ లో  ఉంది.   ఈ క్షేత్రం వింధ్య పర్వతశ్రేణుల్లో నర్మదా కావేరి నదుల మధ్య ఉంది.  సూర్యవంశరాజు మాంధాత అడవికి వెళ్ళినప్పుడు ధూపదీపనైవేద్యాలు లేని శివలింగం కనబడిందట.  ఆ శివలింగంలోంచి ఓంకారం వినబడుతుంది గ్రహించాడు.  ఆయన పెద్దలను తీసుకొచ్చి  చూపించాడట.  పెద్దలు చూసి 'ఓంకారేశ్వరుడని' పేరు పెట్టారని చెబుతారు.   అన్ని మంత్రాలకు, శబ్దాలకు మూలం ఓంకారం.  అది నిత్యనూతనం.  ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వల్ల  ప్రణవనాద అనుసంధానంతో ఏకాగ్రత లభిస్తుందంటారు. 
Sunday, 29 July 2018

మూడో జ్యోర్లింగం

ఉజ్జయిని మహాకాళేశ్వరలింగంగా  ప్రసిద్ధమైనది మూడో జ్యోర్లింగం.   ఈనాటి ఉజ్జయిని ప్రాచీన నామం అవంతి.  మహాభక్తుడైన మార్కOడేయుణ్ణి రక్షించడానికి కాలుడైన యముణ్ణి సంహరించిన శివుడు ఇక్కడ మహాకాళుడు అయినాడట.  కాశి దాసాది మహాకవులు, ఆదిశంకరుల వంటి ఆచార్యులు స్వామి అనుగ్రహాన్ని పొందిన ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లో ఉంది.  ఈ క్షేత్రంలో స్వామి ముక్తిప్రదుడు.  అకాలమృత్యువు నుండి రక్షిస్తాడట.  

Saturday, 28 July 2018

నేడు లష్కర్ ( సికింద్రాబాద్ ) బోనాల జాతర

జంటనగరాలలో బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభంకావడంతో ఎటుచూసినా ఆధ్యాత్మికశోభ వెళ్లివిరుస్తోంది. తొలిజాతర గోల్కొండలో సంప్రదాయబద్ధంగా జరిగింది.  ఇప్పుడు రెండో జాతర 'లష్కర్  బోనాల జాతర' ప్రారంభమైనది. శివతత్తుల  శివాలు, డప్పువాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులు, దేవతామూర్తుల వేషధారణలతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నారు.  ఈ నెలంతా అమ్మవారి దేవాలయాలన్నీ శోభాయమానంగా అలంకరిస్తారు.   అడుగడుగునా భక్తజనం ఆనందపారవశ్యంతో మునిగితేలుతుంది.  ఆషాఢమాసంలో మహంకాళి అమ్మవారిని గ్రామదేవతలుగా ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, అని అనేక పేర్లతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.  బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.  అమ్మవారికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతరాజు కూడా  ఈ పూజలు అందుకోవడం విశేషం.