”శోధిని”

Sunday 11 December 2016

అవినీతి అధికారుల భరతం పట్టాలి.

అవినీతి అధికారుల భరతం పట్టాలి.
పెద్దనోట్ల రద్దువల్ల సామాన్య ప్రజలకు నిత్యం ప్రత్యక్షనరకం కనపడుతోంది. పనులు మానుకొని బ్యాంకుల ముందు గంటలతరబడి నిల్చున్నా డబ్బులు అందక ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. నెలంతా కస్టపడి సంపాదించుకున్న డబ్బును పొందలేకపోతున్నారు. నిత్యావసర వస్తువులు , కూరగాయలు కొనేందుకు డబ్బులు లేక నిత్యం నరకయాతన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మేలు చేస్తుందేమో కాని, ఇప్పుడు మాత్రం ప్రజలు దినదినగండంను చవిచూస్తున్నారు. నల్లడబ్బు దాచుకున్న కుబేరులు మాత్రం కొందరు అవినీతి బ్యాంకు అధికారుల సహాయంతో కోట్ల రూపాయల కొత్త నోట్లు అందుకుంటున్నారు. అక్రమమార్గంలో నడిచే కొందరు బ్యాంకు అధికారులు పర్సెంటేజీలు తీసుకొని నల్లడబ్బున్న బదాబాబులకే కొత్తనోట్ల కట్టలు పంపిస్తూ, సామాన్య ప్రజలకు మాత్రం మొండిచెయ్యి చూపిసున్నారు. పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం అభినందనీయమే. కాని, కొందరు ప్రభుత్వ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ప్రధాని తీసుకున్న నిర్ణయ ఫలితాలు ప్రజలకు చేరాలంటే, అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పట్టాలి.