ఇటీవల ఎవరి నోట విన్నా అదే మాట 'అవినీతిపై పోరాటం'. ఇదే నినాదంతో 'కేజ్రీవాల్ ' గారు విజయం సాధించారు. దేశంలో అవినీతిని అరికట్టడం కోసం లోక్ పాల్ బిల్లు తేవాలంటూ అన్నా హజారే చేసిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఫలితంగా పార్లమెంటులో బిల్లు పాసయింది. ప్రజలు ఉత్సహంగా హజారేకి 'జై' కొట్టారు. బహుశా హజారే కూడా ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని ఉహించి ఉండరు. ఇదే విదంగా నాడు మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమ సమయంలో జాతినంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించ గలిగారు. శ్రీమతి ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ఉద్యమించారు. ప్రజాస్వామ్యవాదులందరినీ ఏకం చేసి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చారు. ఆ తరువాత అదే స్థాయిలో జనాన్ని ఆకర్షించిన నేత 'అన్నా హజారే'. 80 ఏళ్ల వయసులో నిరాహార దీక్ష చేపట్టి ప్రజలలో చలనం తీసుకు వచ్చారు. ఈ ముగ్గురు నేతలు... మనకు స్పూర్తి ప్రదాతలు! ఈ నేతలు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఎప్పుడూ ఏ పదవి ఆశించలేదు. భారత ప్రజలను ఏకతాటి పైకి తీసుకొచ్చి లక్ష్యం సాధించారు. ప్రస్తుతం మనకు అలాంటి నాయకుడు కావాలి. అవినీతిని రూపుమాపాలంటే ముందుగా ప్రజలలో మార్పు రావాలి. తమను మభ్యపెడుతున్న నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.