"నందమూరి తారక రామారావు" ఈ పేరే ఒక సంచలనం... ఒక
ప్రభంజనం. ఆ పేరు మంచి మానవతల మేలు కలయిక. పట్టుదల, కార్యదీక్ష ఆయన
సొత్తు. తెలుగు వారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పెట్టిన ఘనత
ఆయనకే దక్కుతుంది. ప్రేక్షకులే ఆరాధ్య దైవం అని భావించే నందమారి చేసిన
ప్రతి విన్యాసం జనబాహుళ్యాన్నిపొందింది. సినిమా రంగంలో ఆయన పాటించిన
క్రమ శిక్షణ ఎందరికో మార్గదర్శకం అయింది. నటుడిగా, దర్శకుడిగా,
ముఖ్యమంత్రిగా తెలుగుజాతి మన్నలను పొంది, సాంఘీక, జానపద,పౌరాణిక,
చారిత్రిక చిత్రాలలో నటించి, తెలుగు
సినీమానవ సరోవరంలో నిరంతరం విహరించిన నట సింహం నందమూరి తారక రామారావు.
తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస పరిమళ భరిత పారిజాతపుష్పం.
నమ్మిన వారిని ఆదరించడం, ఆత్మీయతను పంచడంలో ఆయనకు మరెవ్వరూ సాటిరారు.
1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం
అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన
ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధినే 'డీ' కొని,
ఖండాంతరాలకు తెలుగు మాధుర్యాన్ని చవి చూపించిన యోధుడు. అటు
సినీరంగంలోనూ...ఇటు రాజకీయరంగంలోనూ తనదైన ముద్ర వేసిన రామారావుగారు
సామాన్యుడు కాదు...ఒక మహాశక్తి. ఎన్నో విశిష్టలున్న మహామనిషి. సినీరంగంలో
శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా, కర్ణుడుగా, దుర్యోధనునిగా, రావణాసురుడుగా ఆ
పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్
చైర్మన్ గా, జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం
అధిరోహించారు. మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను
ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని
సాధించారు.
మరపురాని మరువలేని మహా నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి (మే 28) సందర్భంగా....