”శోధిని”

Monday, 31 December 2018

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2019


కొత్త ఆశలు, కొత్త నిర్ణయాలు, కొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న మిత్రులకు సకల శుభాలు, నిత్య సంతోషాలు కలగాలని, ఈ నూతన సంవత్సరంలో ప్రేమ, అభిమానం, ఆనందం, ఆహ్లాదం, అనురాగం, ఆప్యాయతలు మీ అందరి జీవితాలలో వెళ్లి విరియాలని మనసారా కోరుకుంటూ...
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Thursday, 27 December 2018

ఈ రోజు మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం...

దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్రపురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి.   ఈ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మఅర్ధకామమోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు.  ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. ఇక మీనాక్షి అమ్మవారు మదురైలో వెలిసిన వైనాన్ని చూస్తే.... తను ఇచ్చిన మాటకోసం భూలోకం చేరిన పార్వతి మదురై రాజుకు కుమార్తెగా జన్మించి మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది.పరమశివుడు సుందరేశ్వర‌ునిగా భూలోకంలో జన్మించి మదురై వచ్చి మీనాక్షీ అమ్మవారిని వివాహమాడాడడని.. అనంతరం వీరు మదురై రాజ్యాన్ని చాలా ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించారని భక్తులు విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇరువురు ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.

Friday, 21 December 2018

స్వామివారి నిత్యకళ్యాణం


తిరుమల కొండ పరమ పావనమైనది.  బ్రహ్మమయమైనది.  సచ్చిదానంద స్వరూపమైనది.  పరమాత్ముడైన వెంకటాచలపతి దివ్యపాదస్పర్శతో పునీతమైనది.  తిరుపతి  కొండ యొక్క ఆణువణువూ భగవత్స్వరూపం.  కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రాన్ని ప్రతి భక్తుడూ  దర్శించి శ్రీ వేంకటేశ్వరుడు కృపకు పాత్రులవ్వాలి.  పద్మావతీ దేవి పేరుతొ మొదలైన స్వామివారి కళ్యాణం.  ప్రతి నిత్యం  శ్రీదేవి భూదేవిలతో జరుగుతూ  ఉండటం విశేషం.  




Thursday, 20 December 2018

పచ్చదనం...మనసుకు ఆహ్లాదకరం!


పచ్చదనం  మనసును ప్రభావితం చేస్తుంది.   ఒత్తిడిని తగ్గించి,  ఆందోళనల్ని దూరం చేస్తుంది.  మొక్కలు చల్లదనాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని మనకు అవసరమయ్యే ప్రాణవాయువునిచ్చి,  మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు నిత్యం పచ్చదనాన్ని చూస్తుంటే కంటి చూపు మెరుగవుతుంది. అందుకే, మన చుట్టూ వున్న  పరిసరాలను మొక్కలు నాటి పచ్చదనాన్ని నింపుదాం !


Monday, 17 December 2018

ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు!



ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారి  ఉత్తర దివ్యదర్శనం.   వేయి కళ్ళతో ఎదురు చూసిన భక్తజనం శ్రీవారి  ఉత్తర దివ్యదర్శనంతో పులకించి పోయారు. భక్తి పారవశ్యంలో మినిగి పోయారు. మరో ప్రక్క బంగారు కాంతులీనే ఆనంద నిలయం. ఎటు చూసినా అన్నమయ్య కీర్తనలు, భజనలు, కోలాటాలుచేసే బృందాలు...గోవిందనామస్మరణలు. భక్తుల ముఖాల్లో ఆనందం ...సంతృప్తి.




Friday, 14 December 2018

మంచుకురిసే వేళలో ... చలి గిలిగింతలు!


ఉషోదయం... చీకటి తెరలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్న వేళ...మంచు తెరలు పొగమంచులో  ప్రకృతి అందాలు ఆనందాల పరవళ్లు.    ఓక వైపు చలి వణికిస్తున్నా... పరిసరాలు మాత్రం మంచు తెరల పరదాల మధ్య  ప్రకృతి సోయగాలతో అలరారుతూ... ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నాయి.

Thursday, 22 November 2018

కార్తీక దీపం !


దీపావళి పండుగ అనంతరం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో  జరుపుకునే పండుగ కార్తీక పౌర్ణమి.  కార్తీక మాసంలో వచ్చే పున్నమి చాలా పవిత్రమైనది.  అందుకే ఈ రోజున పూజలు, అభిషేకాలు, వ్రతాలు, దీపారాధనలతో  గృహాలు, దేవాలయాలు కళకళలాడుతూ  ఉంటాయి.  కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన  పుణ్యం కలుగుతుందని భుక్తుల నమ్మకం. ఈ రోజున మహిళలు 365 వత్తులతో ప్రీతికరంగా దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు.  కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికర మైనందువల్ల ఆన్ని దేవాలయాలలో వెలిగించిన దీపాల వరుస చూస్తుంటేఎంతో రమ్యంగానేత్రపర్వంగాహృదయానందకరంగా ఉంటుంది.  కార్తీక పున్నమి నాడు  శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక దీపం వెలిగించడం అంటే అదృష్టలక్ష్మి ని ఆహ్మానించడమే!
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!


Wednesday, 21 November 2018

అవినీతి అంటే….


అవినీతి అంటే కేవలం లంచం తీసుకోవడమే కాదు. మన విధులను, బాధ్యతలను సక్రమంగా  నిర్వర్తించకపోవడం, విధులకు సమయానికి హాజరు కాకపోవడం, సమయానికన్నా ముందే ఆఫీస్‌ నుండి వెళ్లి పోవడం, ట్రాఫిక్‌ నిబంధనలు  పాటించకపోవటం,  విద్యుత్‌ను అక్రమంగా వాడటం,  బస్సులో, రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయా ణించడం,  ఇంట్లోని మురికి నీటిని రోడ్లమీదకు వదిలి వేయటం. ఇంట్లోని చెత్తను మురికి కాలువలలో పడేయడం, రోడ్డును ఆక్రమించుకొని ఇంటిని నిర్మించుకోవడం,  ఫంక్షన్‌ల పేరుతో రోడ్లపైన  టెంట్లు వేసి, రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటివి కూడా అవినీతిలో భాగాలేనని గుర్తించాలి. 



Saturday, 17 November 2018

ప్రకృతి రమణీయం












ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఎత్తయిన  పచ్చని చెట్లు, కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం.   ఆహ్లదకర వాతావరణం, ప్రకృతి సౌందర్యం కంటికింపుగా   మదిని పులకరింప చేస్తోంది.  ఆహ్లాదాన్నిచ్చే చల్లని పిల్లగాలులు శరీరాన్ని తాకుతూ వేళ్తుంటే ఆ అనుభూతే వేరు.


Sunday, 11 November 2018

శుభాలనొసగే కార్తీకం


గోరంత పూజకి కొండంత ప్రతిఫలం!
తెలుగు మాసాలలో కార్తీక  మాసం ఎంతో పవిత్రమైనది.  ఈ మాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుంది భక్తుల నమ్మకం. కార్తీక  మాసంలో  శివుడికి అభిషేకములు, మారేడుదళాలు  సమర్పించినా  శివ కటాక్షం లభిస్తుందంటారు. ఈ మాసంలో కార్తీక  స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్ర పారాయణం, పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.



  

Saturday, 10 November 2018

కార్తీకదీపం... సకలపాపహరణం !


శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగించే పవిత్రమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీకమాసంలో మనం పాటించే నియమాలే మనకు భగవంతుని అనుగ్రహం దక్కేలా చేస్తూ ఉంటాయి. ఈ మాసంలో చేసే దైవారాధన, జపం, ఉపరాస దీక్షలు, దీపారాధనలు, దానధర్మాలు, అన్నదానం అన్నీ కూడా అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయని చెబుతారు. కార్తీకమాసంలో 'దీపం' ప్రత్యేకత అందరికీ తెలిసిందే ! మహిళలు సమీప నదులలో దీపాలను వెలిగించి వదిలే దృశ్యం ఎంతోరమ్యంగా,నేత్రపర్వంగా,హృదయానందకరంగా ఉంటుంది.



Sunday, 28 October 2018

అడుగడుగునా అవకాశవాదులే !


మంచికి పోతే చెడు మూటకట్టుకునే రోజులివి.  ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి.  అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక మరొకలా  అబద్దాలు ఆడటం వీరి నైజం.  అందుకే ఇలాంటి అవకాశవాదులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం  ఆలవాటు చేసుకోవడం  ఉత్తమం. 




Wednesday, 24 October 2018

నేటి ఫ్యాషన్


చింపిరి జుట్టు...

పెంచిన గడ్డం...
చిరిగిన  దుస్తులు ...
ఇవి ఒకప్పుడు
పేదరికానికి చిహ్నాలు !
అదే నేడు ...
యువత మెచ్చిన ఫ్యాషన్లు !!


Saturday, 20 October 2018

'నందనవనం'

కులమేదయినా,  మతమేదయినా   పెళ్లి ప్రమాణాల  అర్థం ఒక్కటే! ' భాగస్వామిని ప్రేమిస్తానని, గౌరవిస్తానని, కష్టసుఖాల్లో తోడు నీడగా నిలుస్తానని చెప్పడమే! ' అదే విధంగా భార్య చేత భర్త ప్రేమించబడాలి.  భర్త చేత భార్య ఆరాధించబడాలి.  ఈ విధంగా దంపతులిద్దరూ హృదయాలతో మాట్లాడుకుంటూ  కట్టుబడి జీవిస్తే, ఆ దాంపత్య జీవితం  అందమైన 'నందనవనం' అవుతుంది.  


Thursday, 18 October 2018

అపురూపం...అమ్మ దర్శనం


బ్రహ్మదేవుని వరం పొంది గర్వంతో ఋషులను, దేవతలను నానా బాధలు పెట్టిన మహిషాసురుడ్ని సంహరించిన అనంతరం తన ఉగ్రరూపాన్ని భరించగల యక్షున్ని   సింహాసనంగా చేసుకొని దుర్గాదేవిగా అవతరించిందిఅమ్మవారు.    అలా స్వయంభువుగా వెలసిన అమ్మవారు మహిషుడ్ని  తన 18 బాహువులతో అంతమొందించిన రోజు విజయదశమిగా జరుపుకుంటారు.   శ్రీరాముడు దశకంఠున్ని  సంహరించిన రోజు కూడా ఇదే కావడం వల్ల  ప్రజలు పండుగను జరుపుకుని ఆనందించింది కూడా ఇదే రోజు కావడం విశేషం.  అర్జునుడు ఈశ్వరుడిని తన తపస్సుతో మెప్పించి పాశుపతాస్త్రం పొంది విజయుడయినందున కూడా ఈ రోజును విజయదశమిగా జరుపుకుంటారని మరోగాధ. ఏదిఏమైనా చెడుపై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి. 

మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!




Friday, 12 October 2018

ప్రేమంటే....?



వికసించే పుష్పం
విరజిమ్మే సుగంధం
కురిసే మమకారం
విరిసే అనురాగం
అంతే కాదు.....
ఆత్మీయతల నిధి
అనురాగాల సన్నిధి
ఆప్యాయతల పెన్నిధి!


Monday, 1 October 2018

మహాత్మాగాంధీ 150 వ జయంతి సందర్భంగా...


చరిత్రలో ఇంకెప్పటికీ చూడలేని నాయకుడు మహాత్మాగాంధీ.  ఆయన చెప్పిన మాట.... నడిచిన బాట ఏ తరానికయినా  ఆదర్శం.  బాపూజీ చెప్పిన సూక్తులు ప్రపంచ మానవాళికి సైతం ఆచరణీయం.  స్వాత్రంత్ర ఫలాలను అనుభవిస్తున్న మనకు అనుక్షణం ఆ మహానుభావుడు గుర్తుకు వస్తూనే ఉంటాడు. జాతిపిత చూపిన ధర్మమార్గంలో నడుద్దాం!  

Sunday, 30 September 2018

పన్నెండో జ్యోతిర్లింగం


పన్నెండో జ్యోతిర్లింగం  ఘృష్టేశ్వరం.  ఇది మహారాష్ట్రలో ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ఎల్లోరా  పురాణనామం ఇలాపురం.  ఇలాపురం  భూమిపై చాలా అందమైన ప్రదేశం కావడం వల్ల పార్వతీ పరమేశ్వరులు కొంతకాలం ఇక్కడ నివసించారట.  పార్వతీదేవి   ఒకనాడు తన ఎడమ చేతిలోని కుంకుమను కుడిచేతి ఉంగరపు వేలితో చాదుతుండగా ఆ ఘర్షణతో ఒక జ్యోతి ఉద్భవించిందట.  మిగిలిన జ్యోతిర్లింగాలలో పరమేశ్వరుని ఆవిర్భావానికి వేరే కథలున్నాయి.  ఇక్కడ మాత్రం అమ్మవారి చేతి రాపిడితో జ్యోతిర్లింగ  రూపాన్ని ధరించింది.  ఇది పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను, దంపతుల మధ్య ఉండవలసిన అవగాహనను, ఆప్యాయతను తెలుపుతుంది.  ఎదురుగా ఉన్న వేడిమినైనా, విషాన్ని  అయినా తనలోకి తీసుకుని ఎదుటివారికి, తనను నమ్మినవారికి కష్టాలను, దుఃఖాలను తొలగించడమే పరమేశ్వరతత్వం అనే రహస్యం  ఘృష్టేశ్వర దర్శనంతో అవగతమౌతుంది.  ఘర్షణలో ఆవిర్భవించడం చేత ఈ జ్యోతిర్లింగానికి  ఘృష్టేశ్వరనామం ఏర్పడింది. 

చివరిగా  భారతదేశం నలుగు దిక్కులా  జ్యోతిర్లింగ రూపుడై సమస్త ప్రాణులను కాపాడుతున్న పరమేశ్వరుని కరుణాకటాక్షం అందరికీ  కలగాలని కోరుకుందాం.



Friday, 28 September 2018

ప్రేమంటే...



 స్వచ్చమైన ప్రేమకు షరతులు ఉండవు.  ఎప్పుడైతే ప్రేమను షరతుల తక్కెడలో వేసి తూకం వేస్తారో అప్పుడే అది నిజమైన ప్రేమ కాదని తేలిపోతుంది.  అదేవిధంగా  ప్రేమ ఎప్పుడూ వన్వే కాకూడదు.  ప్రేమించడానికైనా, ప్రేమను పొందడానికైనా విశాలమైన హృదయం ఉండాలి.  అందరినీ ఆప్యాతతో ఆదరించే గుణాన్ని అలవర్చుకోవాలి.  ప్రేమతో అందరి మనసులను గెలవాలి.  మనసుకు నచ్చినవారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారి సంతోషం కోసమే ఆలోచించగలగడమే నిజమైన ప్రేమ.  అలాంటి ప్రేమ ఇద్దరి మధ్య ఏర్పడితే అప్పుడు మాత్రమే వారు నిజమైన ప్రేమికులవుతారు.  జీవితాంతం  ప్రేమ పక్షుల్లా జీవించగలుగుతారు. 



Tuesday, 18 September 2018

మనం పనిచేసే సంస్థ కన్నతల్లి లాంటిది


మనం ఏ సంస్థలో పనిచేస్తున్నా, ఏ భాద్యత నిర్వహిస్తున్నా వాటి పరిధులకు లోబడి ఆ సంస్థకు సేవ చేయాలి.  స్వలాభం కోసం   ఏ పని చేయకూడదు.  మన వల్ల సంస్థ వృద్ది చెందాలే తప్ప నష్ట పడకూడదు.  మనం సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి,  సంస్థ లాభనష్టాలలో భాగమవ్వాలి.  ఎంత సంపాదిస్తున్నామని కాదు ముఖ్యం.  సంస్థకు ఎంతలా ఉపయోగపడుతున్నామో ఆలోచించాలి. ఎందుకంటే మనం పనిచేసే సంస్థ  కన్నతల్లి లాంటిది.  సమాజంలో బ్రతకడానికి ఒక దారి చూపించి,  మనల్ని, మన కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న కల్పతరువు.



Monday, 17 September 2018

పదో జ్యోతిర్లింగం


పదో జ్యోతిర్లింగం  'నాగేశ్వర లింగం'.  పడమటి సముద్రతీరాన గుజరాత్ లో ద్వారకా పట్టణ  సమీపంలోని దారుకావనంలో ఈ క్షేత్రం ఉంది.  దారుకాసుర సంహారం చేసి లోకాలను శివుడు కాపాడిన ఘటన ఇక్కడే జరిగింది.  సుప్రియుడు అనే భక్తుని ప్రార్ధనతో స్వామి ఇక్కడ నాగేశ్వర లింగంగా అవతరించాడు.  పడగలతో సర్పరూపంగా దర్శనమిచ్చే ఈ జ్యోతిర్లింగం ఇతర ప్రాంతాలలో సహజీవనాన్ని జీవ  వైవిధ్యాన్ని ప్రబోధిస్తోంది.  



Wednesday, 12 September 2018

"మట్టి గణపతే...మహాగణపతి "



ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం.  ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు.   జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు ఓంకార దివ్యస్వరూపుడు గణనాథుడు. సర్వ విఘ్నములను తొలగించే సిద్ది వినాయకుడు.  సత్వర శుభాలను ప్రసాదించే శుభంకరుడు విఘ్నేశ్వరుడు 
                                                 వినాయకచవితి శుభాకాంక్షలు !


Tuesday, 11 September 2018

'బాసర పుణ్యక్షేత్రం'

నిండు కుండలా ప్రవహిస్తున్న గోదావరి తీరాన చదువులతల్లి  సరస్వతి అమ్మవారు  కొలువైవున్న 'బాసర పుణ్యక్షేత్రం'

Monday, 10 September 2018

తొమ్మిదో జ్యోతిర్లింగం


తొమ్మిదో జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వరం. ఈ జ్యోతిర్లింగం  మహారాష్ట్రలో ఉంది.  తూర్పు, ఉత్తర దిక్కుల మధ్య హౌ మాగ్ని మధ్యలో గిరిజాసమేతుడై  వైద్యనాథేశ్వరుడు  ఇక్కడ దర్శనమిస్తాడు.  ఈ జ్యోతిర్లింగాన్ని తాకితే  దీర్ఘ వ్యాధులు కూడా నయమవుతాయట.  క్షీరసాగర మథనంలో పుట్టిన దేవవైద్యుడు  ధన్వంతరి  ఈ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాడట.  అందుకే ఈ స్వామి వైద్యనాథేశ్వరుడు అయ్యాడు.   

Wednesday, 5 September 2018

గురువులందరికీ శుభాకాంక్షలు!


అక్షరజ్యోతుల్ని వెలిగించి విజ్ఞానాన్ని అందిస్తూ, విద్యార్థుల లక్షసాధనకు పునాది వేసేవారు గురువులు ! విద్యార్థులలో స్పూర్తిని నింపి విజయం వైపు నడిపిస్తూ ...తమలో దాగివున్న గొప్ప విషయాలను బోధిస్తూ, భావితరాలను తీర్చిదిద్దుతున్న గురుదేవులకు వందనాలు. దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానం ఉంది. గురువు లేని విద్యార్థి మంచి మార్గాన ప్రయానించలేడు. ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్య చెప్పేవాడు మాత్రం కాదు...లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేవాడని అర్థం. లక్షలాది మంది అధ్యాపకులకు ఆదర్శమూర్తి, మహాజ్ఞాన సంపన్నుడు, ఒక గొప్ప తత్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్టన్ గారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అధ్యక్ష పదవికి చేరుకున్న మహానుభావుడు. ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గురువులందరికీ ఆదర్శప్రాయుడయిన డా. సర్వేపల్లి గారి జన్మదినం నేడు. ఈ సందర్భంగా గురువులందరికీ శుభాకాంక్షలు!


Monday, 27 August 2018

ఏడో జ్యోతిర్లింగం


వరుణ, అసి అనే రెండు నదుల సంగమం అయిన  వారణాసిలో కొలువై ఉన్నాడు సుప్రసిద్ధుడైన కాశీవిశ్వేశ్వరుడు. ఇక్కడ అమ్మవారు విశాలాక్షిగా, అన్నపూర్ణగా భక్తులను కాపాడుతోంది.  కాశి  దర్శనం వల్ల పాపాలన్నీ పోతాయంటారు.  ఆ అనాథ నాథుడు విశ్వనాథుడు.  ప్రళయకాలంలో ప్రపంచం మొత్తం నీటిలో మునిగినా కాశిక్షేత్రం మాత్రం అలాగే ఉంటుందని స్కాందపురాణం చెబుతోంది.  ఇక్కడ మరణించినవారికి ముక్తి లభిస్తుందంటారు. 

Sunday, 26 August 2018

"అన్నాచెల్లెల అనుబంధం ... రక్షాబంధన సుగంధం"


  

శ్రావణ పౌర్ణమి  నాడు సోదర అనుబంధాల్ని గుర్తు చేసే ఆత్మీయానురాగాల పండుగ రాఖీ పండుగ.  భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి.  ఈ రోజున సోదరి, సోదరుడికి కట్టే రక్షణ కవచం రాఖీ.  మహిళలకు రక్షణగా నిలవడడమే ఈ పండుగ ఉద్దేశం.  స్త్రీల పట్ల సోదరభావం, పవిత్రభావం ప్రతి ఒక్కరిలో కలగాలి. సమాజంలో తనకు పూర్తి రక్షణ ఉందన్న నమ్మకం ప్రతి మహిళలో కలిగించాలి.  అప్పుడే నిజమైన రక్షాబంధం.


Thursday, 23 August 2018

సౌభాగ్యప్రదం వరలక్ష్మివ్రతం!



సృష్టి, స్థితి లయకారిణి అయిన  అమ్మవారు అనంత శక్తి స్వరూపిని.  ఈ ప్రపంచమంతా సర్వం తానై  ఇమిడి ఉంది.  అమ్మ కరుణ ఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ మటుమాయమైపోతాయి. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం మైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరించడం ఎంతో శుభకరమని  మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది శ్రావణమాసం.  ఈ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. అమ్మవారిని  భక్తిశ్రద్దలతో నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి,  నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన  వారింట అమ్మవారు కొలువై ఉంటుండని భక్తుల విశ్వాసం.


Tuesday, 21 August 2018

మిత్రులందరికీ 'బక్రీద్' శుభాకాంక్షలు

ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. అలాంటి సందేశాత్మక పండుగలలో మంచికోసం, మానవ సంక్షేమం కోసం పాటుపడుతూ త్యాగానికి ప్రతీతగా భక్తిభావంతో జరుపుకునే పండుగ 'బక్రీద్ పండుగ. ' ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలని కోరుకుంటూ, మిత్రులందరికీ హృదయపూర్వక 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు !


పెద్దలపై నిర్లక్ష్యం తగదు


Monday, 20 August 2018

ఆరో జ్యోతిర్లింగం


ఆరో జ్యోతిర్లింగం  'భీమశంకరం'  మహారాష్ట్రంలో సహ్యాద్రిపై ఉంది.   భీమానది సమీపంలో ఉండడం వల్ల  భీమశంకరుడు అయినాడు.  దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిని 'డాకిని' అంటారు.  ఆమె ఇక్కడ పరమేశ్వరునికై  తపస్సు చేయడం వల్ల  ఈ ప్రాంతాన్ని డాకిని, శాకిని  మొదలైన భూతప్రేత పిశాచాలు  ఇక్కడ స్వామిని సేవిస్తూ ఉంటాయట.  ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి భూతప్రేత పిశాచాల భయం పోతుందట.  




Thursday, 16 August 2018

మహానేతకు నివాళి

భారతదేశ కీర్తిని ఖండాంతరాలకు  వ్యాపింపచేసిన మహానేత, ఉత్తమ పార్లమెంటేరియన్, ఉత్తమ ప్రధానిగా ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న గొప్ప మానవతావాది అటల్ బిహారీ వాజపేయి గారి ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతుడిని కోరుకుంటున్నాను.  


జలహారం

జాలువారే జలపాతం 
ప్రకృతి  మనకిచ్చిన వరం 
జలజలజారే జలపాతం 
ప్రకృతిమాతకు ఆభరణం 
ఎంతో ఆహ్లాదం ప్రకృతి  రమణీయం
సమస్త జీవజాలానికి జీవనాధారం !


Tuesday, 14 August 2018

మన జెండా పండుగ

జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో జరుపుకునే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం. ఇది ఎందరో వీరుల పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలం. తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడి మన దేశానికి విముక్తి లభించిన రోజు.... 'ఆగస్టు 15' మన దేశ చరిత్రలో మరచిపోలేని ఒక అపురూపమైన రోజు. ఈ సందర్భంగా మనకు స్వేఛ్ఛావాయువులు అందించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ! 

Monday, 13 August 2018

అయిదో జ్యోతిర్లింగం


కేదారేశ్వరలింగం భూమికి పదకొండువేల అయిదు వందల అడుగుల ఎత్తులో ఉన్న కేదారేశ్వర లింగం హిమాలయపర్వతంపై ఉంది. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారట. ఉత్తరదిక్కున ఎత్తయిన మంచుకొండల్లో ప్రత్యేక జ్యోతిర్లింగ క్షేత్రం ఈ కేదారేశ్వర జ్యోర్లింగం. ఇక్కడ ఋషులందరూ స్వామిని దర్శిస్తూ ఉంటారు.  దేవతలు,  రాక్షసులు,  యక్షులు మొదలైన వారు సేవిస్తూ ఉంటారు.  వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి వరకు ఆరు నెలలు మాత్రమే ఈ దేవాలయం తెరచియుండి భక్తులకు దర్శనం కలుగుతుంది.  దీపావళి రోజున  స్వామికి నేతితో దివ్యజ్యోతి వెలిగించి మూసిన దేవాలయం తలుపులు వైశాఖ శుద్ధ పాడ్యమినాడు తెరిచేనాటికి ఆరు నెలల క్రితం వెలిగించిన దీపం యథాతథంగా వెలుగుతూ దర్శనమిస్తుంది.

Sunday, 5 August 2018

నాలుగో జ్యోతిర్లింగం

ఓంకారేశ్వర  క్షేత్రం మధ్యప్రదేశ్ లో  ఉంది.   ఈ క్షేత్రం వింధ్య పర్వతశ్రేణుల్లో నర్మదా కావేరి నదుల మధ్య ఉంది.  సూర్యవంశరాజు మాంధాత అడవికి వెళ్ళినప్పుడు ధూపదీపనైవేద్యాలు లేని శివలింగం కనబడిందట.  ఆ శివలింగంలోంచి ఓంకారం వినబడుతుంది గ్రహించాడు.  ఆయన పెద్దలను తీసుకొచ్చి  చూపించాడట.  పెద్దలు చూసి 'ఓంకారేశ్వరుడని' పేరు పెట్టారని చెబుతారు.   అన్ని మంత్రాలకు, శబ్దాలకు మూలం ఓంకారం.  అది నిత్యనూతనం.  ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వల్ల  ప్రణవనాద అనుసంధానంతో ఏకాగ్రత లభిస్తుందంటారు. 




Sunday, 29 July 2018

మూడో జ్యోర్లింగం

ఉజ్జయిని మహాకాళేశ్వరలింగంగా  ప్రసిద్ధమైనది మూడో జ్యోర్లింగం.   ఈనాటి ఉజ్జయిని ప్రాచీన నామం అవంతి.  మహాభక్తుడైన మార్కOడేయుణ్ణి రక్షించడానికి కాలుడైన యముణ్ణి సంహరించిన శివుడు ఇక్కడ మహాకాళుడు అయినాడట.  కాశి దాసాది మహాకవులు, ఆదిశంకరుల వంటి ఆచార్యులు స్వామి అనుగ్రహాన్ని పొందిన ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లో ఉంది.  ఈ క్షేత్రంలో స్వామి ముక్తిప్రదుడు.  అకాలమృత్యువు నుండి రక్షిస్తాడట.