”శోధిని”

Thursday 30 July 2015

గురు పూర్ణిమ



తల్లిదండ్రుల తర్వాత విద్యాబోధన చేసే గురువులు  మానవ జన్మకు సహాయపడతారు.  విద్యార్థి వ్యక్తిత్వం, ప్రవర్తనపై బలమైన ముద్ర వేస్తారు.  విద్యను  ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం శిష్యుల కర్తవ్యం.  గురు పూర్ణిమ నాడు విద్య నేర్పిన గురువులను మరచి పోకుండా వాళ్ళకు కృతఙ్ఞతలు తెలపడం మన సంప్రదాయం.భావితరాలను తీర్చిదిద్దుతున్న గురువులంటే ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే !  ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల హృదయాలలో కొలువైనవున్న షిరిడీ సాయిబాబా గురు పూర్ణిమ మహాత్యాన్ని తెలియజెప్పిన సద్గురువు.
         మిత్రులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు !

Monday 27 July 2015

అబ్దుల్ కలాం ఇక లేరు !



నిరంతరం పరిశోధనల్లో నిమగ్నమై ఉండే పని రాక్షడుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు  ఇక మనకు లేరు.  వివిధ రంగాలలో ఆయన చేసిన సేవలు దేశ ఔన్నత్యాన్ని పెంచాయి .  ఆయన  మృతి దేశానికి తీరని లోటు.  అబ్దుల్ కలాం గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తూ...




Sunday 26 July 2015

మాట్లాడటం పద్దతిగా ఉండాలి !

సృష్టిలో ఏ ఇతర జీవికి  ఇవ్వని   మాట్లాడే  అవకాశం భగవంతుడు మానవుడుకి కల్పించాడు.  దేవుడు నోరు ఇచ్చాడు కదా అని  ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుంది.   అతిగా మాట్లాడేవారిని లోకం పట్టించుకోదు. అవసరమైనంత వరకే మాట్లాడితే ఆ మాటకు, ఆవ్యక్తికి విలువ ఉంటుంది.  అందుకే మనం మాట్లాడే ప్రతి  మాటను బాగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి మనిషి మాహాత్ముడుగా కానక్కరలేదు.  సాటి మనిషితో ప్రేమతో మాట్లాడితే చాలు.  అసహనం, కోపం అనాలోచిత చర్యల మూలంగా ఎన్నో అనర్థాలు జరిగి, మంచి మిత్రులను దూరం చేసుకోవాల్సి వస్తుంది.  కోపంతో మనం మాట్లాడే మాటలు దగ్గర వారిని ఎంతగానో బాధిస్తాయని, వారి ప్రేమను కోల్పోతామని  గ్రహించాలి.  అలా కాకుండా మనం మాట్లాడే పద్దతే మంచిదనుకుంటే, మాటల్లో కాలేసినట్లే!   ప్రతి మనిషికీ ఆత్మ నిగ్రహం అవసరం.  అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది.  



Friday 24 July 2015

పుష్కర స్నానం !



పుష్కర స్నానాలు ఆచరించేవారు గంగా దేవిని స్మరించుకుంటూ జలాన్ని కలుషితం చేయకుండా ముక్కు మూసుకుని మూడు మునకలు వేసి,  నదికి నమస్కరించి బయటకి రావాలి.  అప్పుడే పుణ్యం లభిస్తుంది.  అంతేకాదండోయ్ ... మన మనసును కూడా పవిత్రంగా ఉంచుకోవాలి.   మోసాలు, నేరాలు చేసి నదిలో మునకేస్తే చేసిన పాపాలు తొలగిపోవు.  సమాజంలో ఎవ్వరికి ఏ హాని తలపెట్టకుండా మనసును పవిత్రంగా ఉంచుకుని పుష్కర స్నానం  చేస్తే ఫలితం దక్కుతుంది.  శరీరాన్ని శుభ్రం చేసుకుని, మనసులోని మలినాన్ని కడిగేసుకోకపోతేఎన్ని పుష్కర స్నానాలు చేసినా నిష్పలం అవుతుంది.  నదిలో జలకాలాట ఆడి, జలాలను కలుషితం చేయడాన్ని పుష్కర స్నానం అనరు.  మనసును నిర్మలంగా ఉంచుకొని, మమతానురాగాలకు గాని, ఈర్ష్య అసూయలను గాని తావు ఇవ్వకుండా పుష్కర స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది.  


Monday 20 July 2015

మాటల్లో తేడా ?

అక్కడి విషయాలు ఇక్కడికి, ఇక్కడి విషయాలు అక్కడికి చేరవేయడంలో కొందరికి వెన్నతో పెట్టిన విద్య.  ఇలాంటి వాళ్ళు తాను విన్నదానికి మరికొంత  అదనంగా జోడించి చెప్పడం వీరికి అలవాటు.  ఒక్క మాట వీరి పెదవి దాటి మన చెవిలో పడేసరికి ఎన్నో కొత్త విషయాలు తోడవుతాయి.  అభూత కల్పనలు జోడించి ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెబుతుంటారు.  ఇలాంటి  వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే,  ఏ అసూయ లేకుండా మనసు విప్పి హాయిగా మాట్లాడలేరు.  పైకి మంచిగా మాట్లాడుతునట్టు అనిపించినా, వీరి మాటల్లో తేడా స్పష్టంగా కనబడుతుంది. ఎంత తీయగా మాట్లాడినా, వారి మనసులో మాత్రం విషం నింపుకొని ఉంటారు. ఎదుటివారిని ఏదోవిధంగా అవమానించడానికో, బాధించడానికో ప్రయత్నిస్తూ ఉంటారు. 

Saturday 18 July 2015

అవినీతిపరులు అంటే ..!



అవినీతిపరులు అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ప్రభుత్వ అధికారులు, రాజకీయనాయకులే!  ఎందుకంటే   వాళ్ళే  పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతూ ఉంటారుకాబట్టి.  కాని, మన మధ్యలోనే ఉంటూ “సేవ” అనే ముసుగులో అవినీతికి పాల్పడే వాళ్ళు   చాలామంది ఉన్నారు.    ఇలాంటి వాళ్ళు  అన్ని రంగాలలో వాడ వాడలో   దర్శనమిస్తుంటారు.   వాళ్ళు చేసే సేవ గోరంత... ప్రచారం చేసుకొనేది  కొండంత.  అవినీతికి పాల్పడుతున్నామని వాళ్ల మనసాక్షికి తెలుసు.  కాని బయట  ప్రపంచానికి మాత్రం తాము గొప్ప నీతిమంతులమి నమ్మిస్తుంటారు.  ఇలాంటి వాళ్ళు వేలకు, వందలకు కక్కుర్తి పడుతుంటారు కాబట్టి, వీళ్ళ గురించి  ప్రజలు పెద్దగా పట్టించుకోరు. సమాజానికి, ప్రజలకు    సేవ చేయాలనుకొనేవాడు  సేవకుడిలా ఉంటూ,  నిస్వార్థంతో ఎక్కువ సహనం కలిగి ఉండాలి.  అప్పుడే మంచి సేవకుడనిపించు కుంటాడు... నీతిమంతుడపించుకుంటాడు. 

Monday 13 July 2015

నీ కోపమే ..నీకు శత్రువు !

 

కోపం నిప్పులాంటిది.  దాన్ని అదుపులో ఉంచుకోకపోతే విచక్షనాజ్ఞానం కోల్పోయి, మానవత్వాన్ని మరచిపోతారు.  అందుకే మనిషికి అహంకారం, కోపం పనికిరాదు.  నేను చెప్పేదే వేదమని, నా మాటే వినాలనే అహంతో మూర్ఖుడిగా విర్రవీగితే,  చివరికి సమాజంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

Saturday 11 July 2015

దేవాలయం ...శోభాయమానం !

దేవాలయం అతి పవిత్రమైనది.  ఆ పవిత్ర స్థలంలో చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, గాలి  అన్నీ అత్యంత పవిత్రమైనవే!  అక్కడ ఉన్నంత సేపు మనసు ప్రశాంతతను పొందుతుంది.  బాహ్యప్రపంచాన్ని వీడి, ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించి మధురమైన అనుభూతిని పొందుతాం.  అక్కడ పవిత్రమైన ఆలోచనలతో ఉంటే,  మనలో ఉండే అన్ని రుగ్మతలు తొలగిపోతాయి.