”శోధిని”

Friday 2 December 2011

ఇదిగో, ఇదీ దారి!

image.png

ఇదిగో, ఇదీ దారి!

హైదరాబాద్, December 2nd, 2011
తెలుగు భాష ఎప్పుడు ఎలా పుట్టింది అని జుట్టు పీక్కునే బదులు ఇప్పుడు తెలుగు భాషను ఎలా బ్రతికించుకోవాలి? తెలుగు భాష వాడకానికి తీసుకోవలసిన చర్యలు గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఏ భాషను ఆదరిస్తే ప్రజలు ఆ భాషపైన మక్కువ చూపుతారు. మనం ఆంగ్ల భాష వైపు పరుగులు తీస్తున్నామంటే, దానికి కారణం మన ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలలో తెలుగు భాషకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వాడకాన్ని ప్రవేశపెడితే తప్పకుండా ప్రజలలో మార్పు వస్తుంది. తప్పనిసరిగా ఉద్యోగులకు తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలనే నిబంధన వుంటే! ఈ స్థితి వచ్చేదా? ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని స్థాయిల్లో విధిగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన తెలుగు భాషను అమలుపరచాలి. అధికార పత్రాలు, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో ముద్రించి, అందిరికీ అర్థమయ్యేలాచేయాలి.
నేటి తరానికి తెలుగు భాష పైన మక్కువ పెంచాలంటే, తెలుగు భాష సరళంగా ఉండాలి. తెలుగు భాష కనుమరుగు కాకుండా వుండాలంటే, ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు బోధించడాన్ని తప్పనిసరి చేయాలి. తెలుగు భాషపట్ల అభిరుచి కలిగేలా తెలుగు పాఠ్య పుస్తకాల రచనా నిర్మాణం జరగాలి. తెలుగు భాష గొప్పదనాన్ని, అందులోని మాధుర్యాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలి.
టీవీ ఛానల్ వాళ్లకి తెలుగు భాషలో పదాలు లేనట్టు ఆంగ్ల పదాలతో కార్యక్రమాలను తయారుచేసి ప్రజల మీద రుద్దడం మానుకోవాలి. తారల ఇంటర్వ్యూలు, వక్తల ప్రసంగాలలోనూ ఆంగ్ల పదాలు మేళవిస్తూ అతి చక్కని తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పటికే టీవీ ఛానళ్ల పుణ్యమా అని హిందూ స్ర్తిలలో కొందరు నుదుటున బొట్టు పెట్టుకోవడం మానేశారు. టీవీ ఛానల్ వాళ్లు ప్రసారం చేసే కార్యక్రమాల్లో తెలుగు సంప్రదాయాలు మచ్చుకైనా కనిపించవు. ఇప్పటికైనాతెలుగు టీవీ ఛానళ్ల వారు కళ్ళు తెరచి, పరభాషా వ్యామోహాన్ని తగ్గించి, తెలుగు భాషలోని మాధుర్యాన్ని, ఉచ్చారణను, తెలుగువారి సంప్రదాయాలను ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. మాతృభాషలో పరిపాలన, కళాశాలలో మాతృభాషలో బోధన, టీవీ ఛానళ్ళలో తెలుగు సంప్రదాయ కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పుడు మన తెలుగు భాషకు పూర్వవైభవం వస్తుంది.