”శోధిని”

Tuesday 6 December 2011

కాలమ్ సైజ్ ప్రేమకథ


మనసంతా నువ్వే !
ప్రియా...!

     నీ పరిచయంతో నా బతుకు బాటలో పూతోటలు విరబూసాయి.
నీ మనసొక  ఆత్మీయ సరోవరం. సుకుమారమైన నీ నయనాల
పలకరింపులు సుమధుర మనోహరం. నీ దరహాసంలో ఏదో తెలియని
పరవశం.  నీ స్వరం వింటే కోకిలగొంతు కుడా మూగబోతుంది.
నీలోని ప్రతి అంశం నన్ను మైమరపించాయి.  నీ హావభావాలు నన్ను
మంత్రముగ్దున్ని చేసాయి.  నా మనసంతా నువ్వే నిండిపోయావు.
నా ఉచ్వాస నిశ్వాసాల్లో నిన్ను తప్ప మరేవరిని తలుచుకోలేనంతగా
నీ ప్రేమకు దాసుడయి పోయాను.  మన ప్రేమబంధాన్ని చూసి
ఒర్వలేనివాళ్ళు ఒక పథకం ప్రకారం మన మధ్య చిచ్చు పెట్టారు.
వారి మాయలో పడి మన ప్రేమను నిర్లక్ష్యం చేసావు. అప్పటినుంచి
నాతో ముభావంగా ఉంటున్నావు. నీతో ఏ విధంగా వ్యవహరించాలో
తెలియక నా హృదయం గాలిలో దీపంలా కొట్టుకుంటోంది.  మనం
ఎంచుకున్న అభిలాషలు , లక్ష్యాలు మన జీవితాన్ని నడిపించే
ఇందనాలుగా పనిచేయాలి. అవి కొరబడితే జీవితం నిస్సారంగా,
అర్ధరహితంగా ఉంటాయనడానికి మనమే ఒక నిదర్శనం.  ఎందుకంటే
ప్రేమంటే నీ దృష్టిలో నిర్లక్ష్యం. కాని నా దృష్టిలో మాత్రం అదొక త్యాగం.
ప్రేమంటే శారీరక సంబంధం అనుకుంటావు. నేను మాత్రం పవిత్రమైన
స్నేహబంధం అనుకుంటాను. ప్రేమ మనసులోంచి పుట్టాలి.  గుండె
లోతుల్లోంచి ఉబకాలి. అదే శాశ్వత ప్రేమ అవుతుంది. అలాంటి ప్రేమ
కోసమే నీతో పరిచయం పెంచుకున్నాను. కలిసున్నవాళ్ళంతా
ప్రేమికులు కాలేరని, కలిసి పనిచేసే వాళ్ళంతా సన్నిహితులు కాలేరని
తెలుసుకున్నాను.  స్వచ్చమైన ప్రేమను ఎవ్వరూ నమ్మరు. నటించే
వారివైపు పరుగులు తీస్తారు. మనం  ఇష్టపడే వాళ్ళను కాకుండా
మనల్ని ప్రేమించే వాళ్ళను ప్రేమించాలనే నగ్నసత్యాన్ని తెలుసుకున్నాను.
నీ కిష్టమైన వారిని ప్రేమించు.  కేవలం ప్రేమిస్తే సరిపోదు. ఆప్రేమను
జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవాలని నా కోరిక.  నువ్వు నా
జీవితంలో ఓ మంచి స్నేహితురాలిగా మిగిలిపోతే చాలు.
ఇట్లు
ఎప్పుడూ నీ క్షేమాన్ని కోరే ....