
సగటు ప్రేక్షకుడు సినిమా నుంచి వినోదాన్ని ఆశించి థియేటర్ కు వస్తాడు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వారికి సినిమానే ప్రధాన వినోదం. కానీ, నేడు సకుటుంబ సమేతంగా వెళ్లి చూడతగ్గ సినిమాలు ఏ కోశానా కనబడటం లేదు. వినోదం పేరిట జుగుస్సాకరంగా వుండే అశ్లీల పదాలను యదేచ్చగా వాడుతున్నారు. కుటుంబ సభ్యులతో ఇలాంటి సినిమాకి వెళితే తల దించు కోవాల్సి వస్తోంది. అడ్డమైన అశ్లీల పదాలను సెన్సారు వాళ్ళు ఎలా అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే కథ, సున్నితమైన హాస్యం, వినసొంపు సంగీతం, శ్రావ్యమైన సంభాషణలతో పాటు వినోదాన్ని అందిస్తూ, మంచి సందేశాన్ని ఇవ్వడమే సినిమా ప్రధాన లక్ష్యం. కానీ, ఇప్పుడొస్తున్న చిత్రాలలో ఇవేమీ కనిపించడం లేదు. కేవలం హీరోల అభిమానుల కోసమే సినిమాలు తీస్తున్నట్టు అశ్లీల సన్నివేశాలు, బూతు డైలాగులు, రక్తపు మడుగులను తెర నిండా నింపుతున్నారు. కోట్ల రూపాయలు వసూలు చేసిందని సొంత డబ్బా కొట్టుకొనే చిత్రాలన్నీనా దృష్టిలో చెత్త సినిమాలే. ఇలాంటి సినిమాలు సమాజానికిఉపయోగపడేవి కావు. మన తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను, తెలుగు భాషను కనుమరుగు చేస్తున్న చిత్రాలు. హీరోలు డబ్బుకు ఆశపడకుండా మంచి చిత్రాలలో నటించడానికి పూనుకోవాలి. అలాగే దర్శక నిర్మాతలు కేవలం డబ్బునే కాకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మిస్తే, పదికాలాలు పాటు గుర్తుండిపోతారు.