”శోధిని”

Saturday 7 July 2012

ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న సెల్ టవర్లు




       నేడు మానవుని జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం కావడంతో సెల్ ఫోన్ లేనిదే   క్షణం కూడా గడవని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సెల్ ఫోన్ కి సిగ్నల్ అందించే సెల్ టవర్లు జనావాసాల మధ్య కొలువై ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి.  భవనాల  యజమానులు వివిధ సెల్ ఫోన్ కంపెనీ వారిచ్చే డబ్బుకు ఆశపడి  తమ భావనాల పై సెల్ టవర్లు నిర్మించుకోవడానికి  ఏళ్ళ తరబడి లీజుకు ఇస్తున్నారు.  సెల్ టవర్ల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుండటంతో ప్రజలు అనేక సమస్యలనుఎదుర్కొంటున్నారు.  ఈ సెల్ టవర్లు విడుదలచేసే రేడియేషన్ ద్వారా చర్మ వ్యాధులు, మానసిక రుగ్మతులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలపై అధిక ప్రభావం కలిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.మరో ప్రక్క పర్యావరణ వేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు.  ఎప్పుడూ మన మధ్యనే వుంటూ మనల్ని' ఆత్మీయుల్లా 'కిచ...కిచ...'అంటూ పలకరించే పిచ్చుకలు ఈ సెల్ టవర్ల వల్ల కనుమరుగవుతున్నాయి. ఈ సెల్ టవర్ల నిర్మాణాల విషయంలో నియంత్రణ లేకపోవడంతో  ఎక్కడ  బడితే అక్కడ విచ్చల విడిగా టవర్లను నిర్మిస్తూ ... ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గృహ సముదాయాల మధ్యనే ఈ టవర్లను నిర్మించడం, నిబంధనలు పాటించక పోవడం ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ప్రాణాంతక మైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటి కైన ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని , సంబంధిత అధికారులు సెల్ టవర్ల ఏర్పాటు విషయంలో కఠిన చర్యలు అవలంభించాలి.  జనావాసాలకు దూరంగా సెల్ టవర్లను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.