”శోధిని”

Friday 29 September 2017

ప్రకృతి స్వరూపిణి...ఆదిపరాశక్తి”

కోట్లానుకోట్ల జీవరాశులల్లో ఉండే జీవరూపశక్తి, సకల సృష్టికి కార్యకారణరూపిణి అయిన ఆదిపరాశక్తి...దుర్మార్గుల పై విజయఢంకా మోగించి, అఖిలలోకాలచేత కీర్తించబడే సర్వశక్తి స్వరూపిణి కనకదుర్గ. ప్రకృతి స్వరూపిణిగా వివిధ నామాలతో విరాజిల్లుతుంది. సర్వ సృష్టిని సస్యశ్యామలంగా చేసే తల్లి కనుక శాకంబరీదేవిగా కూడా పిలవబడుతూ, శరన్నవరాత్రులల్లో ఆదిపరాశక్తిని తొమ్మిది అవతారాల్లో పూజించి, పదవరోజు శివశక్తుల కలయికగా శ్రీరాజరాజేస్వరీదేవిని స్తుతిస్తాం. ఈ నవరాత్రులలో ఒక్కోరోజు ఒక్కొక్క అవతారములో ఆ తల్లి దర్శనమిస్తుంది. సృష్టిలోని ఆణువణువూ అమ్మ ప్రతిరూపమే. ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత. ఆమె సృష్టిలయకారిణి...జగదేకస్వరూపిని...సకలచరాచరణి. వీరత్వానికి ప్రతీకయినా దుర్గాదేవిని ఎన్ని విధాలుగా, ఎన్ని రూపాలుగా కీర్తించినా, అర్చించినా అవన్నీ ఆదిపరాశక్తి జగన్మాతకే చేరుతాయి. దసరా నవరాత్రులలో అమ్మవారు విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక అలంకరణలతో ప్రకాశిస్తారు. పూలు, కుంకుమలతో అమ్మవారికి పూజలు చేస్తూ, సుఖసౌఖ్యాలు కలగజేయాలని భక్తులు కోరుకుంటారు. జగన్మాత దుర్గాదేవి మహిశాసురమర్దినిగా పూజలందుకుంటున్న వేళ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
కాయల నాగేంద్ర, హైదరాబాద్


Monday 4 September 2017

ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు !



లక్షలాది మంది అధ్యాపకులకు ఆదర్శమూర్తి, మహాజ్ఞాన సంపన్నుడు, గొప్ప తత్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్టన్ గారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అధ్యక్ష పదవికి చేరుకున్న మహానుభావుడు. గురువులందరికీ ఆదర్శప్రాయుడయిన డా. సర్వేపల్లి గారి జన్మదినం నేడు.  ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానం ఉంది. గురువు లేని విద్యార్థి మంచి మార్గాన ప్రయానించలేడు.  ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్య చెప్పేవాడు మాత్రం కాదు...లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేవాడని అర్థం.  సమాజ నిర్మాణంలో కీలక పాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేకమైన రోజుని ఏర్పాటుచేసి, ఆవృత్తిని గౌరవించడం మన సంస్కృతి గొప్పదనం. ఈ రోజున వారిని సత్కరించాలి...వారి సేవలను గౌరవించాలి...వారి ఆదర్శాలను అనుసరించాలి.    గురువులందరికీ అభినందనలు...శుభాకాంక్షలు!


Friday 1 September 2017

భక్తికి, త్యాగానికి ప్రతీక 'బక్రీద్'


అల్లా కోరిక మేరకు తన ముద్దుల కుమారుడిని బాలి ఇవ్వడానికి పూనుకొని, కొడుకు మెడ పైన కత్తి పెట్టగానే ఆకాశం నుంచి ఓ ధ్వని వచ్చి 'నీ భక్తికి, త్యాగానికి నేను ముగ్ధున్నయ్యాను....  అందుకే నీ కొడుకు స్థానంలో పొట్టేలు బలి అయ్యింది. మీ తండ్రీకొడుకుల  త్యాగానికి ప్రతి సంవత్సరం జిల్ హజా మాసంలో  ఆర్థికంగా బాగున్న ముస్లింలు తమ సంపాదనతోనే జంతువులను కొని బలివ్వాలి.  అలా బలి అయిన జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భాగం తన కుటుంబం కోసం, రెండో భాగాన్ని బంధువుల కోసం, మూడో భాగం పేదలకోసం సమానంగా పంచాలి' అని సూచిస్తాడు.  ఇలా తండ్రీకొడుకుల త్యాగానికి ప్రతీకగా ముస్లింలు 'బక్రీద్' పర్వదినాన్ని జరుపుకుంటారు.  ముస్లిం సోదర సోదరీమణులకు 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు.