శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్రుడిని రంగురంగుల పూలతో అలంకరించి, రుచికరమైన పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించి, సీతాదేవిని మారేడు దళములతో, ఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చిస్తే అనంత ఫలితాలు కలుగుతాయంటారు. 'రామ' అనే శబ్ధం ఒకసారి పటిస్తే విష్ణుసహస్రనామాలు ఒకసారి పఠించిన దానితో సమానము అంటారు. కనుక రామనామము అంత విశిష్టమైనది, అన్నినామములలోకెల్లా శ్రేష్ఠమైనది. రామాయణంలో పవిత్రతకు సీతాదేవి, సోదరమైత్రికి లక్ష్మణుడు, వినయానికి భరతుడు, విశ్వాసానికి గుహుడు, స్నేహానికి సుగ్రీవుడు, భక్తికి శబరి, ప్రభుసేవ, వాక్చాతుర్యానికి హనుమంతుడు ఇలా ప్రతి పాత్రా మహోన్నత విలువలతో కూడుకుని ఆత్మీయత, అనుబంధం, అనురాగాలను గుర్తుచేస్తాయి. కులమతాలకు అతీతంగా ధనిక బీద తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించడం, సమానధర్మాన్ని ఆచరించడం ఒక్క రాముడికే సాధ్యమైంది. అందుకే ఆయన ప్రజల మనసులలో శాశ్వతంగా నిలిచిపోయాడు.
Sunday, 25 March 2018
కలియుగ దైవం
నల్లనివాడు, పద్మనయనాలు కలవాడు శ్రీ వేంకటేశ్వరుడు ఎంతో అందంగా, నిత్యం అద్వితీయ తేజస్సుతో విరాజిల్లుతుంటాడు. ఇంత దివ్యమంగళ స్వరూపం మరేదేవుడికి లేదని చెప్పవచ్చు. అందుకే భక్తులు కన్నార్పకుండా చూస్తూ ఆయన ఆకర్షణలోపడి తామని తాము మరచిపోతుంటారు. స్వామి అంత మనోహర సుందరమూర్తి మరెక్కడా కానరాడు. అందువల్లే ఈ కలియుగంలో ప్రత్యక్షదైవం జగన్మోహనుడయి, భక్తుల గుండెల్లో కొలువయ్యాడు. తలచుకోగానే కళ్ళముందు స్వామి దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కరిస్తుంది. గుండెల్లో దివ్యానుభూతిని గుబాళింపజేస్తుంది. తిరుమలతో సమానమైన ప్రదేశం ప్రపంచంలో మరొకటిలేదు. వెంకటేశునితో సమానమైన దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులో కూడా ఉండబోడు.
Subscribe to:
Posts (Atom)