మా ఆఫీసులో పనిచేసే వారంతా తెలుగువారే. కాని, తెలుగు మాట్లాడితే తమ హొదాకు భంగమనుకుంటారు. ఆంగ్లంలో మాట్లాడితే గొప్పగా భావిస్తూ, తెలుగు మాట్లాడేవారిని చూసి నవ్వుకుంటారు. ముద్దులొలుకు తెలుగు పదాలను హేళన చేస్తుంటారు. పరభాషా వ్యామోహంలో పడి, మన తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు. తెలుగు భాషలోని తియ్యదనం ఇలాంటివారికి ఎంత చెప్పినా చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లు అవుతుంది. కట్టు, బొట్టు తెలుగువారిదయినప్పుడు తెలుగులో మాట్లాడటం అవమానంగా భావించడం ఎందుకు? గొప్పలకుపోయి మాతృభాషను కించపరచడం ఎందుకు? ఇలాంటివారివల్ల తెలుగు సంస్కృతులు, ఆచారవ్యవహారాలు మాయమైపోతున్నాయి. 'మధురమైన తెలుగు భాషలోని పలుకులు తేనెలొలికే గులికలని' ప్రతి తెలుగుపదం వీనులవిందుగా, వినసొంపుగా ఉంటాయని మన తెలుగువాళ్ళు తెలుసుకొనే రోజు రావాలి.
"ముద్దులొలుకు తెలుగు భాష అందం .... వాడని మల్లెల సుగంధం"