”శోధిని”

Tuesday 27 May 2014

"ది లెజెండ్"



      ' NTR 'ఈ మూడక్షరాలు ఒక ప్రభంజనం. ఒక సంచలనం. మంచి మానవతల మేలుకలయిక నందమూరి తారక రామారావు. పట్టుదల, కార్యదీక్ష ఆయన సొత్తు. కృషి, దీక్ష, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిబద్దత, మడమతిప్పని నిజం ఆయన సహజ కవచకుండలాలు. ఆంధ్రరాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆంద్రుల అభిమానానికి, ఆత్మగౌరవానికి ఆయన మారుపేరు. ప్రేక్షకులే నా ఆరాధ్య దైవం అని భావించే నందమారి చేసిన ప్రతి విన్యాసం జనబాహుళ్యాన్నిఉర్రూత లూపింది. సినిమా రంగంలో ఆయన పాటించిన క్రమ శిక్షణ ఎందరికో మార్గదర్శకమైంది. నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు జాతి మన్నలను పొందారు. సాంఘీక, జానపద,పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, సినీమానవ సరోవరంలో నిరంతరం విహరించే నట సింహం. తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస పరిమళ భరిత పారిజాతపుష్పం. అన్నిరకాల పాత్రలలో నటించి ప్రజల మన్నలను పొందారు. నమ్మిన వారిని ఆదరించడంలో ఆయనకు ఆయనే సాటి. నిక్కచ్చగా, నిజాన్ని దాచకుండా చెప్పడం ఆయన వ్యక్తిత్వంలో ఒక విశేషం. ఆత్మీయతను పంచడంలో తన పరభేదం లేకుండా ప్రేమను చూపించగలిగే ప్రేమశీలి. 1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధి నే 'డీ' కొన్న యోధుడు NTR. ఖండాంతరాలకు తెలుగు మాధుర్యాన్ని చవి చూపించారు. అటు సినీరంగంలోనూ...ఇటు రాజకీయరంగంలోనూ తనదైన ముద్రవీసిన రామారావు గారునిజంగా రియల్ హీరో. ఆయన సామాన్యుడు కాదు ...ఒక మహాశక్తి . ఎన్నో విశిష్టలున్న మహామనిషి.సినీరంగంలో శ్రీరాముడుగా , శ్రీ కృష్ణుడుగా, కర్ణుడుగా , దుర్యోధనునిగా, రావణాసురుడుగా వేసిన పాత్రలు అమోఘం. ఆ పాత్రలకు ఆయన ప్రాణం పోశారు.

         సాహసాలు చేయడంలో ఆయనకి ఆయనే సాటి. అందుకు ఉదాహరణ రావణబ్రహ్మ పాత్ర. ఏదయిన ప్రయోగం చేయాలంటే , ముందుగా ఆయనమీదే చేసుకునేవారు. 'దాన వీర శూర కర్ణ ' చిత్రంలో మూడు పాత్రలు వేసి శభాష్ అనిపించారు. శ్రీమద్విరాటపర్వం లో ఏకంగా అయిదు పాత్రలు వేసి గొప్ప సాహసం చేసి విజయం సాధించారు. ఇలాంటి సాహసం మరే నటుడికి సాధ్యం కాదు అంటే అతిశయోక్తి కాదు. నటనలో లీనమై ప్రతిపాత్రకు న్యాయం చేకూర్చిన నటుడు. దాదాపు మూడువందల చిత్రాలలో నటించి, తెలుగువారి హృదయాలలో పదిలంగా స్థానం ఏర్పరచుకున్న NTR ధరించని పాత్ర లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్ చైర్మన్ గా , జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం అధిరోహించారు. మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.

          తన అసాధారణ నటనతో, ప్రతిభతో విశాల అభిమనలోకాన్నిఏర్పరచుకున్న అగ్రశ్రేణి నటుడు. సుందరమైన, సున్నితమైన, సునిశితమైన హాస్యం మేళవించి రంజింపజేసిన నటుడు. నటనలో లీనమై ప్రతీ పాత్రకు న్యాయం చేకూర్చిన నటసార్వభౌముడు. ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్ చైర్మన్గా, జాతీయ స్థాయి నాయకుడిగా, ప్రజల మనిషిగా రామారావు గారు కీర్తి శికరం అధిరోహించారు.

        మరపురాని మరువలేని మహా నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి (మే 28) సందర్భంగా....