ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీ ఆర్. వి. ఎస్ .ఎస్ శ్రీనివాస్ గారు (శ్రీ) రచించిన 'మనసంతా నువ్వే' వచన కవితల సంపుటిని డా. సి నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ గ్రంధంలో 64 కమనీయమైన ప్రేమ కవితలు రూపుదిద్దుకున్నాయి. కవితలలో ఆత్మీయ స్పర్శల మధురానుభూతుల్ని, ప్రేమికుల సంబంధాలను హృద్యంగా వర్ణించారు రచయిత. ఈ గ్రంధంలోని కవితలు చదువుతుంటే... హృదయ లోతుల్లో దాగిన అక్షరాలను పైకి తీసి పేర్చినట్టున్నాయి. ఈ గ్రంధంలోని కొన్ని మధురమైన వాక్యాలు...
" నీ ప్రేమలేఖ లొని అక్షరాలు
సుగంధాలు విరజిమ్మే నందనవన పారిజాతాలు
నిశ్చలమైన నా మనోకాసారంలో
వికసించిన ప్రేమారవిందాలు"
"సాయంసంధ్యా సమయంలో
చల్లగా వీచే పిల్లతెమ్మర హాయినిస్తోంది
నా మనసుని తాకే నా సఖి పంపిన
ప్రణయ సమీరంలా"
" నీ చిరునవ్వుల జల్లులు చాలు
చిరుకవితల మాటలు అల్లేందుకు
నీ పసందయిన పలకరింపులు చాలు
ప్రణయ ప్రబంధాలు వ్రాసేందుకు"
ఈ గ్రంధం నిండా ఇలాంటి కవితలు మనోరంజకంగా అలరించాయి. ఎన్నెన్నో మధురానుభూతులు మనసును తట్టి ఆహ్లాద పరచాయి. తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగల శక్తి శ్రీనివాస్ గారికవిత్వానికి ఉందని రుజువు చేశాయి. ఈ కవితలలో రచయిత హృదయ స్పందనని అర్థం చేసుకోవచ్చు. అద్భుత పదాలతో "మనసంతా నువ్వే"కవితల సంపుటిని 64 ఆణిముత్యాలుగా అభివ్యక్తీకరించారు 'శ్రీ' గారు. మున్ముందు మరిన్ని ప్రేమ కవితలు 'శ్రీ' (శ్రీనివాస్) గారి కలం నుండి జాలువారుతాయని ఆశిద్దాం!