”శోధిని”

Tuesday 31 October 2017

హడలెత్తిస్తున్న దోమలు

దోమ... ఈ పేరు వినగానే ఎంతటి వారైనా హడలిపోవాల్సిందే.  దీనిని చూడగానే ప్రజలకు ఒంటిలో వణుకు పుట్టి, చలిజ్వరంతో ముచ్చెమటలు పడతాయి.  ఇది చిన్న కీటకమే అయినా, దీన్ని తేలికగా తీసుకోకండి.  ఎన్నో వ్యాధులకు గురిచేసి, వందలాదిమందిని ఆసుపత్రుల పాలు చేస్తోంది.  అంతేకాకుండా  ఎంతో మంది   రోగుల మృతికి కారణమయ్యేది  కూడా ఈ చిన్న కీటకం వల్లే.  దోమకాటుకు జ్వరాలు విస్తరించి ప్రజల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల్లా మారుతున్నాయి.  దోమలబారిన పడేవారు ఎక్కువగా పిల్లలు, వృద్ధులు, మహిళలే ఉంటున్నారు.  'కీటకం చిన్నదే' అని నిర్లక్షం చేయకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, త్రాగునీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.   


Sunday 22 October 2017

కార్తీక దీపం ... సర్వపాపహరణం!

కార్తీకమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. దేవాలయాలలో ద్వజస్తంభానికి తాడు కట్టి చిన్న పాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. దీపం ద్వజస్తంభంపై వెలుగులీనుతూ ఉంటుంది. జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు. శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పవిత్రమైన కార్తీకమాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుందని, వ్రతాలు అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, విభూది బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుందని, రుద్రాక్షరాలను స్పర్శిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని గట్టి నమ్మకం. కార్తీకమాసంలో మనం పాటించే నియమాలే మనకు భగవంతుని అనుగ్రహం దక్కేలా చేస్తూ ఉంటాయి. ఈ మాసంలో చేసే దైవారాధన, జపం, ఉపరాస దీక్షలు, దీపారాధనలు, దానధర్మాలు, అన్నదానం అన్నీ కూడా అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయని చెబుతారు.


"అడవి బిడ్డలు ...ఆణిముత్యాలు "


        అందరిని సమానంగా ఆదరించడం, అక్కున చేర్చుకొని ఆప్యాయతను పంచడంలో అడవి బిడ్డలు ముందుంటారు. క్రమశిక్షణ, నీతినిజాయితీలు కలగి మోసం, ద్వేషం లేని సమాజం నేటికి మారుమూల గిరిజన తాండాల్లో ఉంది. గ్రామదేవతలను ఆరాధించడం, తిరునాళ్ళు, జాతరలు చేయడం లాంటి సాంస్కృతిక జీవన పద్దతులు నేటికీ సజీవంగా అక్కడ కనబడతాయి.

        హోదాలను మరచి గ్రామస్తులందరూ ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఆనందంగా గడిపే జీవితం వారి జీవితం. పెద్దల ఆచారాలు, అలవాట్లు తప్పక పాటిస్తారు. వీటిని వారసత్వం తమ తనంతర జాతికి అందిస్తారు. ప్రతి మనిషిలోనూ మమకారం, సహకారం, పరోపకారం అనే సుగుణాలుంటాయి . కొత్తవారిని గౌరవించడం వాళ్లల్లో ఉన్న గొప్ప సంస్క్హారం. కల్తీలేని ప్రకృతిలో జీవిస్తున్న వీరు కష్టపడి పనిచేస్తూ, కష్టాలలో, సుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉంటారు. వారి కుటుంబ వ్యవస్థలో ఉన్నఆత్మీయత, అనుబంధాలు, మరువలేని మధురానుభూతినిస్తాయి. సమానత్వమంటే ఏమిటో వారినుంచి పట్టణవాసులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.


Sunday 1 October 2017

"మహాత్ముడు నేర్పిన పాఠాలు ... మనకు మార్గదర్శకాలు "



దేశంలో శాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషి చేద్దాం...
మనచుట్టూ వున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం...
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో పయనిద్దాం....దేశాన్ని అభివృద్దివైపు నడిపిద్దాం!


జాతిపిత మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలతో ...