”శోధిని”

Wednesday 13 January 2016

పుష్యమాస సోయగాలు !


పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని కలిగించి ఆనందాన్ని పంచే మహాపర్వదినం సంక్రాంతి.  ప్రకృతికీ, మానవునికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచించే పండుగ కుడా ఇదే !   ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించి ఉత్తరదిశ ప్రయాణాన్ని కొనసాగించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.   తెల్లవారుజామున హేమంత శీతల పవనాలు మేనును స్పృశిస్తుండగా, మంచు బిందువులు తలను తడుపుతుండగా మహిళామణులు రంగురంగుల ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలను తీర్చిదిద్దడం మధురమైన మరుపురాని  అనుభూతిగా చెప్పుకోవచ్చు.   గంగిరెద్దుల కోలాహలం, హరిదాసుల సంకీర్తనలతో గ్రామాలన్నీ  సందడిగా మారిపోతాయి. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మన పండుగలను మరచిపోకుండా జరుపుకోవడం, మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవడంఅవుతుంది.