”శోధిని”

Sunday 28 December 2014

అభిషేక ప్రియుడు !



సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు.  ఈ రోజున అభిషేక ప్రియుడు అయిన  పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల విశేష ఫలప్రదమని చెబుతారు.   ఈశ్వరుడు  ....సమస్త దారిద్ర్యాలను, దుఃఖాలను హరించే భోళాశంకరుడు.  మనస్పూర్తిగా, భక్తిపూర్వకంగా ' శివా ' అని పిలిస్తే చాలు సకల పాపాలను, దుఃఖాలను పోగొడతాడు. 

కీసరగుట్ట పైన హనుమంతుని విగ్రహం !

ఆద్యాత్మికతకు, ఆహ్లాదానికి నెలవుగా విరాజిల్లుతోంది హైదరాబాద్ సమీపంలో వున్న  కీసరగుట్ట.  కొండల మధ్య ప్రశాంత వాతావరణంలో కీసరగుట్ట పై కొలువున్న శ్రీరామ లింగేశ్వరస్వామి నిత్యపూజలు అందుకుంటున్నాడు.  ఆలయ పరిసరాలలో వున్న పచ్చని వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతుంది... గొప్ప అనుభూతిని కలుగజేస్తుంది... ప్రకృతి రమణీయత కళ్ళను కట్టి పడేస్తుంది.  ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఎత్తైన హనుమంతుని విగ్రహం  ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

Wednesday 24 December 2014

'క్రిస్మన్' శుభాకాంక్షలు !

దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు క్రిస్మస్.   అందుకే ఈరోజు భక్తి శ్రద్దలతో పవిత్రంగా  పండుగ చేసుకుంటారు.   ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని ఏసుక్రీస్తు చెప్పాడు. ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు.   క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.  క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడాలి.  " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు... పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు..." ఇలాంటి వాక్యాలు కోకొల్లలు.  మిత్రులందరికీ  'క్రిస్మన్' పర్వదిన శుభాకాంక్షలు. 

Tuesday 23 December 2014

దర్శక,నిర్మాతలలో మార్పు రావాలి!



మహిళలు ఏ రంగంలో నైనా పురుషులకు దీటుగా తమ సత్తా చూపిస్తున్నారు.  కానీ సినిమా రంగంలో మాత్రం అందుకు బిన్నంగా ఉంది.  స్త్రీ పురోగతి, పురోభివృద్ది మన తెలుగు సినిమాలమో అసలు కన్పించవు.  ఎంతసేపు హీరోహిన్ అనబడే స్త్రీమూర్తిని నటనలో ఆటబొమ్మగా, పాటలలో శృంగారతారగా ఉపయోగించుకుంటున్నారు.  ఈ మధ్య ఇంకొక అడుగు ముందుకేసి ఐటెంసాంగ్ అనే పేరుతో  హీరోయిన్స్ చేత  అభ్యంతకరమైన డ్రస్సులు, డ్యాన్సులు  వేయిస్తున్నారు.   మన దర్శకనిర్మాతలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు నిర్మించకపోయినా పర్వాలేదు.  కనీసం సమాజాన్ని నాశనం చేసే సినిమాలు నిర్మించకుంటే చాలు. వాళ్ళ కున్న క్రియేటివిటీని మంచి సినిమాలను రూపొందించడానికి ఉపయోగించాలి కానీ, డబ్బు  కోసం చెత్త సినిమాలు తీసి సమాజాన్ని చెడకొట్టవద్దు. సంఘంలో ప్రతి మనిషికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.  కానీ, సినిమాలు తీసే వాళ్ళకి ఇలాంటి కట్టుబాట్లు లేకపోవడం శోచనీయం.  సమాజం పైన కనీస భాద్యతలు లేవు.  ప్రతి విషయాన్ని డబ్బుతోనే చూస్తారు... డబ్బుకోసం  వ్యంగ్య, బూతు సినిమాలను తీస్తూనే ఉంటారు.   ఒకసారి పాత సినిమాలను చూడండి.  ప్రతి సినిమాలో ప్రజలకు ఉపయోగపడే ఎదోక సందేశం ఉంటుంది.  ఇప్పటికైనా సినీ పెద్దలు మేల్కొని స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఔనత్యాన్ని ఉన్నతంగా చూపించే చిత్రాలు నిర్మిస్తే సమాజం హర్షిస్తుంది.


Saturday 13 December 2014

వృద్దులు... మన పూజ్యులు!

వృద్దులు అమృత హృదయులు. వారు తమ సంతానాన్ని బాల్యంలో ఎంత చక్కగా సంరక్షించారో అంతకంటే ఎక్కువగా వృద్ధాప్యంలో వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృద్దాప్యంలో వారిని నిర్లక్ష్యం చేసి శోకించే స్థితి కల్పించకూడదు. అందరూ ఉండి కూడా చాలా మంది వృద్దులు అనాదాశ్రయాలలో బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. వారిని కష్టపెట్టడం ఇంటికి క్షేమం కాదు... మనకు మంచిది కాదు. మన జీవితం వారు పెట్టిన బిక్షం. వారి ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. మన కన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు కాబట్టి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన ధర్మం. వారు ఎన్నో భాదలు అనుభవించి చనిపోయిన తరువాత ఘనంగా పితృకర్మలు ఆచరించే కంటే, వారు బ్రతికుండగా వారిని అక్కునచేర్చుకుని సంతోషపెట్టడం అన్ని విధాల సముచితం. పెద్దలను పుజ్యునీయులుగా చూడలేని వారు దైవారాధన చేయడం శుద్ధ దండగ.

Sunday 7 December 2014

బాల్యస్మృతులు !


జీవితంలో మధురమైన ఆణిముత్యాలు
మళ్ళీ మళ్ళీ తిరిగిరాని మధుర జ్ఞాపకాలు
చిన్ననాటి కమనీయమైన తీపి గురుతులు !
అమ్మా-నాన్న బొమ్మలాటలు ...
చెడుగుడు... గోళీలాటలు...
కర్రా బిల్ల ...బొంగరాలు ...
కోతికొమ్మచ్చి..కాగితాల పడవలు ...
బిళ్ళాగోడు ...పీచుమిఠాయిలు...
గుడిలో ప్రసాదానికి తోపులాటలు ...
తూనీగల వెంటపడే తుంటరి తనాలు ...
జామ , మామిడికాయల దొంగతనాలు ...
ఇవన్నీ చిన్ననాటి చిలిపి చేష్టలు
స్వచ్చమైన అపురూప సౌరభాలు
మరువలేని మరుపురాని బాల్యస్మృతులు !