”శోధిని”

Saturday 31 October 2015

"జ్ఞానోదయం "


ఎన్నికల సందర్భంగా జరుగుతున్న  మీటింగ్ లో 
ఓ నాయకుడు మాట్లాడుతూ ...                                                                  "బిసీ, ఒసీల  పక్షపాతి మన మంత్రిగారు" అన్నాడు. 
మరో నాయకుడు మాట్లాడుతూ ...
"ఎస్సీ , ఎస్టీల   పక్షపాతి మన  నాయకుడు" అన్నాడు. 
ఎన్నికలు రానే వచ్చాయి
"మంత్రి గారు బిసీ, ఒసీల  పక్షపాతి కాబట్టి
మన కులాలవాళ్లు  అతనికి  ఓటు వేయవద్దు"
అని  ఎస్సీ , ఎస్టీల ఓటర్లు నిర్ణయించుకున్నారు. 
"మంత్రిగారు  ఎస్సీ , ఎస్టీల పక్షపాతి  కాబట్టి ... 
మనమంతా కలిసికట్టుగా అతన్ని  ఓడించాలి "
అని  బిసీ, ఒసీల ఓటర్లు నిర్ణయం తీసుకోవడంతో  
మంత్రిగారు  భారీ మెజారిటీతో ఓడిపోయారు.
అప్పటి నుంచి  కులాల పేరుతో 
ఓట్లు అడగకూడదని మంత్రిగారికి  జ్ఞానోదయం అయింది.

Tuesday 27 October 2015

పండ్లు ... ఆరోగ్యానికి పుండ్లు !


కాయలను ఒక్కరోజులోనే పండ్లుగా భ్రమింపచేయడానికి అక్రమ వ్యాపారులు విషపూరిత రసాయనాలను వాడి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు.  పక్వానికిరాణి పచ్చికాయలను తెంపి  రంగు తెచ్చేందుకు కాల్షియం కార్బైండ్ ను వినియోగిస్తున్నారు.  ఇలా చేయడం వల్ల  ఒక్క రోజులోనే పండు రంగు వచ్చి,   పచ్చి కాయలు నిగనిగలాడుతూ  ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.   కాల్షియం కార్బైండ్  మనుష్యుల ఆరోగ్యాన్ని   తీవ్రంగా దెబ్బతీసే విషం.  ఇలా కృత్రిమ పద్దతుల్లో మగ్గించిన పండ్లను తింటే అల్సర్, క్యాన్సర్,  కాలేయం, మూత్ర పిండాలు పాడవడం జరుగుతుంది. ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే పండ్లు రోగాలు తెచ్చి పెడుతున్నాయంటే నమ్మశఖ్యంగా లేదు కదూ!    డబ్బులు పెట్టి జబ్బులను కొంటున్నారు  ఇది పచ్చి నిజం.  ప్రకృతి  సిద్ధంగా  పండిన పండ్లు నేడు మార్కెట్లో  కనపడడంలేదంటే ఏ  మాత్రం అతిశయోక్తి కాదు.  అందుకే పండ్లను కొనేముందు బాగా పరిశీలించి కొనండి.  రసాయనాలతో మగ్గించిన పండ్లను సులభంగా గుర్తుపట్టవచ్చు.  రసాయనాలతో మగ్గిన పండ్లు గట్టిగా,  పసుపు వర్ణంతో నిగనిగలాడుతూ ఉంటాయి.  ఈ తేడాను గుర్తిస్తే ఆరోగ్యాన్నిచ్చే ప్రకృతి సిద్దమైన  పండ్లనను  కొని తినవచ్చు. 



Thursday 22 October 2015

జమ్మిచెట్టు పైన పాలపిట్ట !




విజయదశమి పర్వదినాన పాలపిట్టను చూస్తే  మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు.  అదేవిధంగా జమ్మి చెట్టును పూజించె సంప్రదాయం అనాదిగా వస్తోంది.  జమ్మి చెట్టును పూజిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయంటారు.  కాని, దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో పక్షులు కూడా అంతరించి పోతున్నాయి.  మట్టి ప్రదేశాలన్నీ కాంక్రీట్ గా మారడంతో జమ్మి చెట్లు కనుమరుగయి పొతున్నాయి.  ఇలాంటి సమయాలలో దసరా  నాడు పాలపిట్ట చిత్రాన్ని  చూసి సంతృప్తి చెందుదాం. 



Wednesday 21 October 2015

విజయదశమి శుభాకాంక్షలు !

 

పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తాయి.  పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది.  వివిధ సంస్కృతీ సంప్రదాయాలతో కలిసిన పండుగలు సంప్రదాయశోభను ద్విగుణీకృతం చేస్తూ మానసికమైన ఆనందాన్ని, తృప్తిని ఇస్తాయి. అందుకే ప్రతి పండుగను  ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. ముఖ్యంగా దసరా పండుగ ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజులు   అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తారు.   చివరి  రోజు మహిషాసురుడిని సంహరించడంతో 'సమాజంలోని దుర్మార్గం నశించి మంచి మానవత్వం పెరగాలని కోరుకుంటూ' పదవరోజు విజయదశమి పండుగను  జరుపుకోవడం ఆనవాయితి.  విజయదశమి నాడు దుర్గాదేవిని ఆరాదిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని  ప్రజల విశ్వాసం. ఈ రోజున ప్రతి ఇంటా  ఘుమఘుమలాడే పిండివంటలు, ప్రతి  గుమ్మానికి బంతిపూలు, మామిడాకుల తోరణాలతో కళకళ లాడటం దసరా పండుగ ప్రత్యేకత.   విజయదశమి పర్వదినం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖశాంతులు ప్రసాదించాలని దుర్గాదేవిని మనసారా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. 


Monday 19 October 2015

తెలంగాణా ముద్దుబిడ్డ !



అరవిరిసిన తంగేడు పూలు ...
ముగ్దమనోహర చేమంతులు....
బోసినవ్వుల గుమ్మడి పూలు ...
ముచ్చటగొలిపే ముద్దబంతులతో...
పుడమితల్లి పులకించేటట్లు
పూలపరిమళాలతో...
తెలంగాణా ముద్దుబిడ్డగా 
మస్తాబయింది  బతుకమ్మ !
మహిళలను ఆత్మీయురాలుగా ...
నిలిచింది బంగారు గౌరమ్మ !!


Sunday 18 October 2015

శ్రీ లలితా పరమేశ్వరి !


విలాసం, ఔదార్యం, గాంభీరం, మాధుర్యం, తేజస్సు, సౌకుమార్యం కలిసిన స్త్రీ మూర్తి శ్రీ లలితా త్రిపుర సుందరి. లాలిత్యం, కారుణ్యం, అనురాగం, ఆత్మీయత ఆమె స్వభావాలు.  పేరులోనే లాలిత్యం ఉన్న లలితా పరమేశ్వరి,  ప్రాణ కోటికి అండగా నిలిచిన జగన్మాత.  స్త్రీని దేవతగా పూజించే మనం... మనకు జన్మనిచ్చిన  మహిళలకు తగిన  గౌరవ మర్యాదలు ఇస్తూ... మంచి ప్రవర్తన కలిగి ఉంటే , జగన్మాతను  అర్చించినంత ఫలితం దక్కుతుంది. 

Monday 12 October 2015

స్నేహబంధం ...ఎంత మధురం !


అనురాగ మధురిమ ...
ఆప్యాయతల మమకారం ...
అనుబంధాల సమ్మేళనం ...
స్నేహమాధుర్యాల పరిమళం !


Saturday 10 October 2015

తన కోపమే తన శత్రువు !


కోపం ఒక భావోద్వేగం.  అనుకున్నది అనుకున్నట్లు జరగక పోయినా ఎదైనా అసౌకర్యం కలిగినా, ఎదుటివారి ప్రవర్తన చికాకు కలిగించినా కోపగించడం మానవ నైజం.  కోపం ఎందుకు వస్తుందో ముందుగా తెలుసూ కాబట్టి దాన్ని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవాలి.  ఎవరైనా కోపంతో ఊగిపోతున్నప్పుడు ఇవతలి వారు మౌనం వహించడం మేలు.  కోపిష్టి వ్యక్తులతో ఇంటా, బయటా కష్టమే!  అందుకే మనసును మన అదుపులో ఉంచుకోవాలి.  నా మనసు చెప్పినట్లు నేను నడుచుకుంటానని భావిస్తే, చిక్కుల్లో పడటం ఖాయం.  

 

Wednesday 7 October 2015

"తెలుగు సినిమా"

పాత తెలుగు సినిమాలలో మంచి కథ, నీతి, మితిమీరని శృంగారం, వినసొంపయిన మధురమైన పాటలు, సున్నితమైన హాస్యం ఉండేవి.  నాయికా నాయకులు నీతిని బోధించే పాత్రలు ధరించేవారు.  అవినీతి, చెడుపై విజయంగా మంచి నీతిని  ప్రబోధించేవారు.  ఆ దిశగా రచయితలు  కూడా రచనలు చేసేవారు.  వాటి ప్రభావం సమాజంపై ఉండేది.  మంచిని చూపించడంవల్ల ప్రజలకు సినిమాలపైన మంచి అభిప్రాయం ఉండేది.  కానీ,  నేడు వస్తున్న  సినిమాలలో  అతి జుగుస్సాకరమైన మాటలు, వస్త్రధారణ, సన్నివేశాలు, పోరాటాలతో దేశంలోని చెడునంతా నింపేస్తున్నారు.  కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తున్నారే తప్ప,   అన్ని వర్గాల పేక్షకులను ఉపయోగపడే సినిమాలను నిర్మించడం లేదు.   దాంతో కుటుంబసమేతంగా సినిమాలు చూసే అవకాశం లేకుండా పోతోంది.     

            

Monday 5 October 2015

మరో బాపు బొమ్మ !

 నల్ల త్రాచులా వాలు జడ...
శంఖంలా మెడ...
ఆల్చిప్పలాంటి కళ్ళు...
నునులేత అధరాలు...
ముత్యమల్లె మెరిసే పంటి వరుస...
ఇంద్రదనస్సులాంటి నడుము...
ఆబొట్టు ...చీరకట్టులో...
వయ్యారాలు ఒలకబోస్తూ ...
కొత్త కాంతులు విరజిమ్ముతున్న ప్రణీత 
మరో బాపు బొమ్మల ఉంది కదూ !

Thursday 1 October 2015

మిత్రులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు !


ప్రేమంటే...!



 కరుణామృత ధారలను కురిపించే 
ఓ చల్లని మలయ మారుతం !

స్వచ్చమైన  పరిమళాలను వెదజల్లే 
అనిర్వచనీయమైన అనుభూతి !

మమకారాల కౌగిళ్ళల్లో పూలు పూసే 
మాటలకందని మధురభావన  !