
సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు, గుమ్మడి పూలతో అలంకరించిన
గొబ్బెమ్మలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల మేలగాళ్ళ సన్నాయి రాగాలు,
రకరకాల గాలిపటాలు గుర్తుకొస్తాయి. సంక్రాంతి మూడు రోజులు ప్రతి ఇల్లు ముత్యాల
ముగ్గులతో, పచ్చని తోరణాలతో కళకళ లాడుతూ ఉంటాయి. కోడి పందాలు,
ఎడ్ల పందాలు, ముగ్గులపోటీలు, గొబ్బెమ్మల పాటలతో గ్రామాలన్నీ సందడిగా
ఉంటాయి. దక్షణాయనం చివరి రోజున భోగి పండుగ జరుపుకుంటారు . ఈ రోజున
భోగి మంటలు వేసుకుని చలి పులిని పారద్రోలుతారు. ఇంట్లో ఉన్న వ్యర్ధ సామానులన్నీ
భోగి మంటలో వేసి ఇంటిని శుభ్రపరుచుకోవడం ఆనవాయితి. మన సంప్రదాయాన్ని,
తెలుగుదనాన్ని చాటిచెప్పే పండుగ భోగి పండుగ. అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు!