”శోధిని”

Thursday, 24 November 2016

మందుబాబుల ఆగడాలు అరికట్టాలి.


తెలుగు రాష్ట్రాలలో మందు బాబుల ఆగడాలు రోజురోజుకి మితిమీరి పోతున్నాయి. పట్టపగలే తప్ప తాగి వాహనాలు నడుపుతూ రోడ్లమీద వెళ్ళే పాదచారులని, వాహనదారులని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నారు. ఎన్నో రోడ్డ్ల ప్రమాదాలకు కారకులవుతున్నారు. రోడ్డు మీద వెళ్లేవారి పాలిట యమకింకరులుగా మారుతున్నారు. వీరి ఆగడాల వల్ల ఎన్నోకుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఎంతో మంది అమాయకులు దుర్మరణం పాలవుతున్నా... మందుబాబులలో ఇసుమంతయినా కనికరం కూడా కలగడం లేదు. అంతేకాదు తాగినమైకంలోఅసభ్యపదజాలంతో ప్రజలమీడదికి కలియబడుతున్నారు. వీరి వల్ల మహిళలు, ప్రజలు తీవ్రమైన ఆవేదనను, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. రానురాను వీరి ఆగడాలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. బైట ప్రజలే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఇది ప్రధాన సమస్యే! ప్రభుత్వాలు మద్యం ఆదాయం చూసుకుంటున్నాయి తప్ప, ప్రజల కష్టనష్టాలను గురించి ఆలోచించడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని జరిమానాలు విధించినా మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు తాగి వస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు. తాగి సేల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్ట్టు ధరించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల భాధలను అర్థం చేసుకొని మద్యం దుకాణాలను పగటి పూట మూయించి, రాత్రి ఏడు గంటల తర్వాత మాత్రమే తెరిచే విధంగా చర్యలు తీసుకుంటే మందుబాబుల ఆగడాలకు కొంతవరకైనా అడ్డుకట్ట వేయవచ్చు.