”శోధిని”

Friday 29 September 2017

ప్రకృతి స్వరూపిణి...ఆదిపరాశక్తి”

కోట్లానుకోట్ల జీవరాశులల్లో ఉండే జీవరూపశక్తి, సకల సృష్టికి కార్యకారణరూపిణి అయిన ఆదిపరాశక్తి...దుర్మార్గుల పై విజయఢంకా మోగించి, అఖిలలోకాలచేత కీర్తించబడే సర్వశక్తి స్వరూపిణి కనకదుర్గ. ప్రకృతి స్వరూపిణిగా వివిధ నామాలతో విరాజిల్లుతుంది. సర్వ సృష్టిని సస్యశ్యామలంగా చేసే తల్లి కనుక శాకంబరీదేవిగా కూడా పిలవబడుతూ, శరన్నవరాత్రులల్లో ఆదిపరాశక్తిని తొమ్మిది అవతారాల్లో పూజించి, పదవరోజు శివశక్తుల కలయికగా శ్రీరాజరాజేస్వరీదేవిని స్తుతిస్తాం. ఈ నవరాత్రులలో ఒక్కోరోజు ఒక్కొక్క అవతారములో ఆ తల్లి దర్శనమిస్తుంది. సృష్టిలోని ఆణువణువూ అమ్మ ప్రతిరూపమే. ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత. ఆమె సృష్టిలయకారిణి...జగదేకస్వరూపిని...సకలచరాచరణి. వీరత్వానికి ప్రతీకయినా దుర్గాదేవిని ఎన్ని విధాలుగా, ఎన్ని రూపాలుగా కీర్తించినా, అర్చించినా అవన్నీ ఆదిపరాశక్తి జగన్మాతకే చేరుతాయి. దసరా నవరాత్రులలో అమ్మవారు విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక అలంకరణలతో ప్రకాశిస్తారు. పూలు, కుంకుమలతో అమ్మవారికి పూజలు చేస్తూ, సుఖసౌఖ్యాలు కలగజేయాలని భక్తులు కోరుకుంటారు. జగన్మాత దుర్గాదేవి మహిశాసురమర్దినిగా పూజలందుకుంటున్న వేళ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
కాయల నాగేంద్ర, హైదరాబాద్