”శోధిని”

Monday 29 September 2014

మాటకు మాట వద్దు !

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందనే సామెత ఉంది.  మనం స్నేహ పూర్వకంగా మాట్లాడితే పగవాడు కూడా మనవాడవుతాడు.  మన ఆలోచన, గుణగణాలు మన మాటల్లో ప్రతిబింబిస్తాయి.  కాబట్టి మాట్లాడటానికి ముందు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది.  ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం ప్రతి వ్యక్తికీ అవసరం.  పెద్దవాళ్ళతో, ప్రముఖులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో ఎవరికీ తగిన విధంగా వారి దగ్గర మాట్లాటంలో మన తెలివి, మంచితనం, చాతుర్యం బయటపడతాయి.   కొంత మంది నోటి దురుసు వల్ల అప్పుడప్పుడూ తగాదాల వరకూ వెళుతుంటారు. అలాంటివారికి ఎంత దూరంగా వుంటే అంత  మంచిది.  మన మాట తీరు  మన జీవితాన్ని పూలబాట చేయగలదు. అదేవిధంగా ముళ్ళబాటగానూ చేయగలదు.  అందుకే మనం మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తెసుకోవడం ఎంతయినా అవసరం.

Saturday 27 September 2014

జయలలితకు జైలు శిక్ష !



అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను దోషిగా నిర్ధారించిన బెంగుళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. మొత్తం దోషులు నలుగురికి కలిపి రూ. 100 కోట్లు భారీ జరిమాన విధించింది. ఈ మొత్తాన్ని దోషులు ఒక్కొక్కరు రూ.25 కోట్లు చొప్పున చెల్లించాలి. దీనితో ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నారు.

Wednesday 24 September 2014

హైదరాబాద్ ను కాటేస్తున్న కాలుష్యం !


గ్రేటర్ హైదరాబాద్ లో నానాటికి పెరుగుతున్న కాలుష్యం,   నగరవాసులకు ప్రాణసంకటంగా మారుతోంది.  లక్షల్లో పెరిగిన వాహనాల నుంచి నిత్యం వెలువడుతున్న దుమ్ము, ధూళి నగరప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  వాతావరణంలో ధూళి రేణువులు అధికం కావడం వల్ల రోజూ బయట సంచరించే వారు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. దీనికి తోడు విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ జరగడం, పరిశ్రమల నుండి హానికరమైన వాయువులు వాతావరణంలోకి వదలడం వలన భూతాపం పెరిగిపోతోంది.  కాలుష్యం వల్ల హానికర వ్యర్థాలు చెరువుల్లో కలుపుతున్నారు.  అవి నీటి వనరులను కలుషితం చేసి నీటి కాలుష్యాన్ని పెంచుతున్నాయి.  వాహన కాలుష్యం, జలకాలుష్యం పెరగడం కారణంగా భూమి రోజురోజుకు వేడెక్కి, మొత్తం జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా  మారుతోంది.  పరిస్థితి మరింత విషమించక  ముందే అధికారులు మేల్కొని,  వాయు, జల కాలుష్యం నుండి హైదరాబాద్ ను కాపాడాలి.

Sunday 14 September 2014

అనురాగ బంధం !

 
స్నేహమంటే ...
స్వార్థంలేని ఓ ఆరాధన 
కల్తీలేని ఓ మధురభావన 
కపటంలేని ఓ  భరోసా 
కష్టాలలో ఆదుకునే ఓ  ప్రాణం 
ఆప్యాయతతో ఆదరించే...
స్వచ్చమైన అనురాగ బంధం!
 

Friday 5 September 2014

గురుదేవోభవ !

మనదేశ రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతకుముందు అధ్యాపకుడు. ఆయన పుట్టిన రోజును  ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.   దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానం  ఉంది.  గురువు లేని విద్యార్థి మంచి మార్గాన ప్రయానించలేడు. గురు శిష్యుల సంబంధం అనురాగం, అనుబంధంతో కొనసాగాలి. ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్య చెప్పేవాడు మాత్రం కాదు...లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేవాడని అర్థం.  అలాంటి ఉపాధ్యాయులను  మన తెలుగు సినిమాలలో కమెడియన్లగా చూపించడం వలన సమాజంలో ఉపాధ్యాయులపట్ల తేలికభావం ఏర్పడింది.  దాంతో  గురువులను గౌరవించడం విద్యార్థులలో తగ్గుతూ... గురుశిష్యుల సంబంధాలు ఉండవలసిన రీతిలో ఉండటం లేదు. సమాజంలో మంచి చెడు ఉన్నట్లే ఉపాధ్యాయులలో కూడా చెడ్డవాళ్ళు లేకపోలేదు.  వక్రబుద్ధి కలవారు ఉపాధ్యాయులయితే సమాజం చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ.  కనుక  ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకునే వాళ్ళు  వృత్తి పట్ల అంకితభావం ఏర్పరచుకోవాలి.  అలా జరిగినప్పుడు ఉపాధ్యాయులకు సమాజంలో అత్యున్నత గౌరవ మర్యాదలు లభిస్తాయి.  

          ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు !