”శోధిని”

Thursday 21 November 2019

తెలుగువారు తెలుగుభాషను ప్రేమించాలి


మాతృభాషలో చదవడం చిన్నప్పటినుంచే ప్రారంభం కావాలి.   కనీసం పదవ  తరగతి వరకైనా మాతృభాషలోనే  విద్యాబోధన జరగాలి.  జీవనోపాధికోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు.  కానీ, మనల్ని మనం ఆవిష్కరించుకోవడం మాత్రం మాతృభాషలోనే సాధ్యపడుతుంది.  తెలుగువారు తెలుగుభాషను ప్రేమించాలి....  గౌరవించాలి... అమ్మలా ఆదరించాలి. 

Wednesday 20 November 2019

ఆరోగ్యసిరి...ఉసిరి!

ఆరోగ్యసిరిగా చెప్పుకునే ఉసిరి మన శరీరంలోని ప్రతి అవయవానికి దివ్యౌషధం.  చూడగానే నోరూరిస్తూ  కాస్త తీపిగా, కాస్త వగరుగా, మరికాస్త పుల్లగా ఉండే గుండ్రటి  ఉసిరికాయలను తీసుకోవడం వల్ల  మన జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. చెడు  కొలేస్ట్రాల్  అంతరించి మంచి కొలేస్ట్రాల్ తయారవుతుంది.  ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సర్వరోగనివారిణి.  

Monday 11 November 2019

కార్తీకదీపం

                                                                                                                       
కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున   శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన  పుణ్యం కలుగుతుందని భుక్తుల విశ్వాసం. ఈ రోజున మహిళలు 365 వత్తులతో ప్రీతికరంగా దీపాలను వెలిగిస్తారు. పున్నమి రోజున చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్తీక పౌర్ణమి నాడు చెప్పుకోతగ్గ అంశం దీపారాధన.  దేవుని సన్నిధిలో, పవిత్రమైన తులసికోట దగ్గర బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాల వెలిగించాలి.  ఆ దీపాలను  కుంకుమ, పసుపు, పూలతో అలంకరించి దీపం వెలిగిస్తే విశేష శుభఫలితాలు, సకల సంపదలు దరిచేరతాయని ప్రజల విశ్వాసం. 
                                                                               
                                   
  

Sunday 10 November 2019

ఓం నమశ్శివాయ...



కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది సోమవారం.  శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, బిల్వపత్రం అంటే చాలా ఇష్టం.  ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.    విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుందని   రుద్రాక్షరాలను స్పర్శిస్తే  శివుని అనుగ్రహం లభిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం.  

               

Saturday 9 November 2019

శివారాధన


శివకేశవులకు ప్రీతికరమైన మాసం...  ఆధ్యాత్మికశోభను భావితరాలకు అందించేమాసం కార్తీకమాసం.   శివుని సిగలో వెలిగే చంద్రుని వారం సోమవారం కాబట్టి ఉపవాసానికి విశేష ఫలితం లభిస్తుంది.  అందుకే భక్తులు కార్తీకమాసంలో వచ్చే సోమవారాల్లో భక్తిశ్రద్దలతో శివుణ్ణి ఆరాధిస్తారు.  శివుడిని, శివతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.  అయితే ఆయన అనుగ్రహం పొందడం మాత్రం చాలా సులభం.  




Monday 4 November 2019

శివునికి అత్యంత ప్రీతికరం 'కార్తీక సోమవారం'

తెలుగు మాసాలలో కెల్లా కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది.  కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది సోమవారం.  శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, బిల్వపత్రం అంటే చాలా ఇష్టం.  ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి.   విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుంది.  రుద్రాక్షరాలను స్పర్శిస్తే  శివుని అనుగ్రహం లభిస్తుంది.

Monday 30 September 2019

ఒకరికి ఒకరు

భార్యాభర్తలిద్దరూ  ఒకరికోసం ఒకరుగా జీవించే అనురాగ సాగరం.... ఆనంద సంగమం.  ఆ అనుబంధం ఆనందమయం కావాలంటే, ప్రేమానురాగాలతోపాటు ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉండాలి.  ఎంత అన్యోన్య దాంపత్యమైనా కొన్ని సర్దుబాట్లు, దిద్దుబాట్లు ఇద్దరికీ అవసరం. 


Tuesday 24 September 2019

పల్లెసీమలు






పల్లెసీమలు అద్భుతంగా ఉంటాయి.  ఎటు చూసినా పచ్చటి తివాచీ పరిచినట్టు వారి పొలాలు -- వాటిపైనుంచి వచ్చే పైరుగాలి చల్లగా వీస్తుంటే, మది పులకించి పోతుంది.  మనసు పరవశించి పోతుంది.   అందుకే గ్రామాలు  దేశానికి వెన్నెముకలంటారు.   గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.


Sunday 8 September 2019

పవిత్ర బంధం!


దాంపత్య జీవితం ... ఒక పవిత్ర బంధం!  భార్యాభర్తలిద్దరూ ఒకరికోసం ఒకరుగా జీవించే స్వచ్ఛమైన అనురాగ సాగరం.   ఇద్దరిమధ్య ప్రేమానురాగాలతోపాటు చక్కటి అవగాహన ఉంటే, ఆ అనుబంధం మరింత బలపడి ఆనందమయమవుతుంది. మనసంతా మల్లెలవాన  కురిసినంత హాయిగా ఉంటుంది.


Sunday 1 September 2019

సహజ రంగుల గణేశుడు



జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు. నిందలను, విఘ్నాలను తొలగించి ముక్తిని ప్రసాదించే గణనాధుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.  

అందరికీ 'వినాయక చవితి' శుభాకాంక్షలు!

Saturday 3 August 2019

స్నేహబంధం !


ఇరు మనసులను కలిపేది ... 
ఆత్మీయతల్ని పంచేది ... 
అనురాగాలను పెంచేది...  
అపురూప అనుబంధం ... 
స్వఛ్చమైన  స్నేహబంధం !



Tuesday 30 July 2019

జలనిధి


వాన నీటిని ఒడిసి పడితే ... 
ఒదిగి పోతుంది 
విడిచి పెడితే ... 
నాశనం చేస్తుంది 
జలనిధిని పెంచడం మన విధి !



Tuesday 23 July 2019

మనసున.. మనసై !

భాష ఏదయినా, మతం ఏదయినా పెళ్లి ప్రమాణాల అర్థం ఒక్కటే!  భాగస్వామిని ప్రేమిస్తానని, గౌరవిస్తానని, కష్టశుఖాల్లో తోడూ  నీడగా నిలుస్తానని చెప్పడమే!  ఆ ప్రమాణాలకు కట్టుబడి భార్యాభర్తలు తమ జీవన విధానాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మలచుకోవాలి.  సంసారం అన్నాక అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు.  తాము అనుకున్నట్టుగానే జరిగితే బాగుంటుందని ఇద్దరికీ ఉంటుంది.   ఎవరికివారే తమ మాటే నెగ్గాలన్న అహంకారం ప్రదర్శిస్తే, చినికి చినికి గాలి వాన అవుతుంది.  తెలివైన దంపతులయితే స్నేహపూరిత వాతావరణంలో సామరస్యంగా మంచి చెడులను విశ్లేషించుకుని  తగిన నిర్ణయం తీసుకుంటారు.  

Sunday 14 July 2019

సుగుణాల నేరేడు


మే , జూన్, జులై నెలల్లో మాత్రం దొరికే నేరేడు పండ్లు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత  మంచిది.  వగరు, తీపి కలకలిసిన  ఈ పండును తినడానికి అందరూ  ఇష్టపడతారు.  ఈ పండులో ఉండే విటమిన్ 'ఎ ' కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ 'సి రోగనిరోధకశక్తిగా పనిచేస్తుంది.  పొటాషియం, ఐరన్, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించి, గుండె జబ్బులను అడ్డుకుంటుంది.  ఈ పండును తినడం వల్ల రక్తాన్ని శుభ్రపరచి, రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బైటకు పంపుతుంది.   ఈ పండ్లను తినేటప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే చాలా  బాగుంటాయి.   ఇన్ని సుగుణాలున్న నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు త్రాగకూడదంటారు. ఈ పండ్లను మధుమేహానికి ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే!

Friday 12 July 2019

దివ్యమనోహరుడు ... శ్రీ వేంకటేశ్వరుడు !


ఆనంద నిలయంలో కొలువై ఉండి,  భక్తులను తనవద్దకు రప్పించుకునే  దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడు. కోరిన వరాలిచ్చే కోనేటి రాయని  మొక్కు తీర్చుకునేందుకు రోజూ  తిరుమలకు వేలసంఖ్యలో భక్తులు వెల్లువెత్తుతారు.  వైకుంఠం ఎలా ఉంటుందో మనం చూడలేదు కాని, తిరుమలలో అడుగు పెట్టగానే నిజమైన వైకుంఠం మనకళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది.  స్వామివారిని  కనులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.  తిరుమలేశుని విగ్రహం  విష్ణురూపమే అయినా విభిన్న దేవతాచిహ్నాలు కలిగిన దివ్యమనోహర విగ్రహం.  అంటే, ముక్కోటి దేవతలు స్వామియందే ఉన్నారని అర్థం.  


Saturday 6 July 2019

పుష్ప విలాసం !



రకరకాల పుష్పాలన్నీ ఒకచోట కనిపిస్తే మురిసిపోయి  ఆనందంతో మైమరచిపోతాం.  ప్రకృతిలో అందాన్ని ఆహ్లాదాన్ని పంచేవి పూలు.  వీటికున్న   అద్భుతమైన శక్తి అలాంటిది.  మరుగొల్పే చల్లని మల్లెలు, కాంతులీనే కనకాంబరాలు, సన్నజాజుల సోయగాలు, పరిమళాలు వెదజల్లే లిల్లీలు కలువలా  కనువిందు చేస్తాయి.  గులాబీల గుబాళిస్తాయి. 



Saturday 15 June 2019

మహాద్భుతం.


తిరుమలలో రెప్పపాటు సమయం  కళ్ళముందు కదలాడే శ్రీనివాసుడి రూపం మహాద్భుతం.  తిరుమలలో వేసే ప్రతి అడుగు మహోన్నతమే!  ఉదయాన్నే సుప్రభాతం వింటూ మేల్కొనడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది.  సాయంత్రం వేళ  కొండపైన వీచే చల్లనిగాలికి చెట్లు నాట్యం చేస్తూ గిలిగింతలు పెడుతుంటే నయనమనోహరంగా ఉంటుంది.  సప్తగిరులలో ఇలాంటి మధురానుభూతులు ఎన్నో! 


Sunday 9 June 2019

మెరిసే పట్టులాంటి కురులు కోసం ....


యాబై గ్రాముల మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గుప్పెడు మందారాకులను, గుప్పెడు గోరింటాకులను  జతచేసి మెత్తగా మిక్సీ చేసి, ఆ మిశ్రమాన్ని  కురులకు  పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి.  ఇలా నెలకు రెండుసార్లు చేస్తే,  జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది.  అంతేకాదు మెదడును చల్లపరచి  జుట్టు రాలడాన్ని  తగ్గిస్తుంది. మెరిసే పట్టులాంటి కురులు మన సొంతం అవుతాయి. ఈ మిశ్రమాన్ని స్త్రీ, పురుషులిద్దరూ ఉపయోగించవచ్చు.




Tuesday 4 June 2019

శుభాలు కురిపించే రంజాన్


శుభాలు కురిపించే వరాల  మాసం రంజాన్.  ఈ పవిత్ర మాసం అత్యంత శుభప్రదమైనది.  ఎనలేని శుభాలను అందించే ఈ నెలంతా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది  మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించడంతో పవిత్ర గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది. అందుకే రంజాన్ మాసమంతా పవిత్రం, పుణ్యదాయకం.  రంజాన్ పేరు వినగానే హృదయంలో భక్తిభావం ఉప్పొంగుతుంది. సమస్త శుభాలతో ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళిస్తాయి .  మాసంలో చివరి రోజున ఉపవాసాలు ముగించి ఆనందం విరిసిన హృదయంతో రంజాన్ పండుగను అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాలతో శోభాయమానంగా  జరుపుకోవడం ఆనవాయితి.  
        రంజాన్ పర్వదిన శుభసందర్భంగా...మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ! 



Monday 27 May 2019

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా....


తెలుగువాడి బింకం, తెలుగువారి మమకారం, తెలుగువాడి మాటతీరుతెలుగువారి పద్దతి అంతా ఆయన దివ్యమైన రూపంలో కనిపిస్తుంది. వ్యక్తిగా ఆయన సమున్నతుడు...  వ్యక్తిత్వంలో మహోన్నతుడు. ఆయనే      విశ్వవిఖ్యాత నటసార్వభౌమ  నందమూరి తారక రామారావు గారు.  మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగాన్ని  ఏకచత్రాదిపతిగా పాలించి,  పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.  ఓటును నోటుతో కొనకుండా ప్రజల అభిమానంతో  నిజాయితీగా గెలిచిన మొదటి నాయకుడు ఎన్టీఆర్.  మరపురాని మరువలేని మహా నటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా....


Sunday 26 May 2019

తులసితో ఆరోగ్యం


తులసి ఆకులను వేడినీళ్లలో వేసి మరిగించి కొద్దిగా తేనెను కలిపి తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది.  

ప్రతిరోజూ నాలుగు తులసి ఆకులు నమిలి మింగితే, మానసిక ఆందోళన తగ్గుతుంది.

రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నాలుగు తులసి ఆకులను వేసి ఉదయం పడగడుపున తాగితే, కడుపులోని క్రిములు నశిస్తాయి.  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

Thursday 23 May 2019

అనుకున్నది ఒక్కటి.... అయినది ఇంకొక్కటి !


ఒక చంద్రుడు ఉత్తరం నుంచి, మరో చంద్రుడు దక్షిణం నుంచి తన రాజకీయ చతురతకు పదును పెట్టి, కేంద్రంలో రాజకీయ చక్రం తిప్పాలనుకున్న  ఇద్దరు చంద్రులకు తీవ్ర నిరాశ మిగిల్చాడు  మోడీ.  ఆశకూ  ఓ హద్దుంటుందని నిరూపించాయి  ఎన్నికల ఫలితాలు. 





Sunday 19 May 2019

మధురమైన పండు

















వేసవిలో దొరికే మధురమైన పండు మామిడి పండు.  సహజంగా  చెట్టుకు పండిన పండ్లు పసిడి వన్నెమెరుపుతో, మంచి సువాసనతో  మధురంగా ఉంటాయి.  వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం రసాయనాలతో పండించిన పండ్లు పుల్లగా ఉంటూ అనారోగ్యాలను తెచ్చిపెడతాయి.

  

Saturday 4 May 2019

హాయిగా నవ్వుదాం....

మాటకన్న ముందుగా మందహాసంతో పలకరించడం మనిషి వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది.  కంటి నిండా నిద్ర, కడుపునిండా మంచి భోజనంతోపాటు  మనసారా నవ్వగలిగితే   ఏ వ్యాధులు మన దరిచేరవు.  ఆరోగ్యానికి నవ్వే దివ్యౌషధం.  అందుకే ప్రతి రోజూ  కనీసం 20 నిముషాలపాటు నవ్వగలిగితే మనలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.  మానసిక ఆందోళనను మటుమాయం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచ్గుతుంది. 

ప్రపంచ నవ్వుల దినోత్సవం  సందర్భంగా... 



Tuesday 30 April 2019

శ్రామిక మహర్షి


ఉద్యోగాల  కోసం  నగరబాట పట్టే యువత,   వ్యవసాయరంగంలో కూడా మంచి ప్రగతి సాధించవచ్చని తెలుసుకొని వ్యవసాయరంగంలో   భాగస్వామ్యం  కావాలి.  కొత్తగా వచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని వ్యవసాయరంగంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. పట్టణాల నుంచి పల్లెబాట పట్టి,  వ్యవసాయరంగానికి పూర్వవైభం తీసుకురావాలి.   శ్రామికులే  చరిత్ర నిర్మాతలు.

అందరికీ "మేడే" శుభాకాంక్షలు !


Saturday 27 April 2019

ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి.

సరైన  పర్యవేక్షణ లేకపోవడంతో ఇంటర్మీడియట్ బోర్డులోని ప్రతి వ్యవస్థ లోపభూయిష్టంగా  మారింది.  అసలు బోర్డులో ఏమి జరుగుతోంది? అక్కడ సిబ్బంది పనితీరు ఎలా ఉంది ? అని తెలుసుకునే నాధుడే లేకపోవడంతో  సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది.   వారి నిర్లక్షానికి ఏంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు  బలికావడం ఏమిటి?   అధికారుల తప్పిదాలవల్ల పొరపాట్లు జరిగాయని చెప్పడం సహించరాని నేరం.   మళ్ళీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని,  విద్యార్థుల కన్నీటికి కారకులయిన అధికారులను కఠినంగా శిక్షించాలి.  సప్లిమెంటరీ పరీక్షలను కొద్దిరోజులు వాయిదా వేసి, రీకౌంటింగ్, వెరిఫికేషన్ కోసం విద్యార్థులు నుండి ఎలాంటి రుసుము తీసుకోకుండా తగు చర్యలు చేపట్టాలి.  ఇప్పటికయినా  ప్రభుత్వం స్పందించి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్న ఇంటర్ బోర్డును  పూర్తిగా ప్రక్షాళన చేయాలి.



                                                                                            -

Tuesday 23 April 2019

వేసవిలో చల్లగా... హాయిగా !


ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ప్రకృతితో మమేకమవ్వాలి.  దాంతో ఒత్తిడి తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.  గత నెల రోజులుగా  మండుతున్న ఎండలకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో   ఒక్కసారిగా భారీ వర్షం కురిసి  వాతావరణం  ఆహ్లాదంగా మారడంతో,   ప్రకృతి  ప్రేమికులు ఆనందంతో పరవశించిపోయారు.  చల్లదనాన్ని మదిలో నింపుకొని మేఘాలలో తేలిపోయేలా తన్మయభరితం.    


Saturday 13 April 2019

సీతారాముల కల్యాణం కమనీయం, రమణీయం














తల్లిదండ్రుల మాట జవదాటని తనయుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ధర్మ ప్రభువుగా అందరి మన్నలను పొందిన   శ్రీరామచంద్రుడు  ఎంతో మహాన్నతుడు.  తమ్ముళ్ళ పట్ల ప్రేమానురాగాలు, భర్యాభార్తల మధ్య ఉండవలసిన అనురాగం, ఆప్యాయతలు,  పిల్లల పట్ల తండ్రి బాధ్యత మొదలైనవన్నీ తాను ఆచరించి లోకానికి తెలియజెప్పిన ఆదర్శముర్తి శ్రీరాముడు.  రామబాణం రక్షిస్తుంది... రామహస్తం దీవిస్తుంది... రామ పాదం నడిపిస్తుంది...రామమంత్రం సుఖశాంతులను అందిస్తుంది. రామ నామం మధురం... మధురాతి మధురం.  సీతారాముల కల్యాణం కమనీయం, రమణీయం…. సర్వజనులకు ఆనందదాయకం.  శ్రీరామచంద్రుడి జన్మదినం లోకానికంతటికీ పర్వదినం.   



Wednesday 20 March 2019

వసంతోత్సవం

వసంత ఋతువు ఆగమనాన్ని పురష్కరించుకొని పిల్లలు, పెద్దలు ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా జరుపుకునే సరదా పండుగ హోలి.  వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి.  సంప్రదాయ బద్దమైన రంగుల పండుగ కాబట్టి,  రకరకాల పూలతో తయారు చేసుకున్న రంగులతోనే రంగులు చల్లుకుని, కేరింతలతో, ఆటపాటలతో ఆనందంగా హోలి జరుపుకోవడం ఉత్తమం. 

                        అందరికీ హోలీ శుభాకాంక్షలు!


Friday 15 March 2019

జలదుర్గ

హైదరాబాద్, ఎస్.ఆర్ నగర్ సమీపంలోని బల్కంపేట  ఓ బావిలో వెలసిన   ఎల్లమ్మ అమ్మవారు భక్తులకు సర్వశుభాలను ప్రసాదిస్తున్నారు. అమ్మవారి శిరస్సు భాగం నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉండటం ఇక్కడ ప్రత్యేకత.  ఆ పవిత్రజలాన్నే భక్తులు తీర్థంగా స్వకరిస్తూ ఉంటారు.   జలదుర్గగా పూజలందుకుంటున్న అమ్మవారిని  బల్కంపేట ఎల్లమ్మగానూ, రేణుకా ఎల్లమ్మగాను పిలుస్తుంటారు.     ఎల్లమ్మకు ప్రీతిపాత్రమైన ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు అధికసంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితి.