”శోధిని”

Sunday 30 September 2018

పన్నెండో జ్యోతిర్లింగం


పన్నెండో జ్యోతిర్లింగం  ఘృష్టేశ్వరం.  ఇది మహారాష్ట్రలో ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ఎల్లోరా  పురాణనామం ఇలాపురం.  ఇలాపురం  భూమిపై చాలా అందమైన ప్రదేశం కావడం వల్ల పార్వతీ పరమేశ్వరులు కొంతకాలం ఇక్కడ నివసించారట.  పార్వతీదేవి   ఒకనాడు తన ఎడమ చేతిలోని కుంకుమను కుడిచేతి ఉంగరపు వేలితో చాదుతుండగా ఆ ఘర్షణతో ఒక జ్యోతి ఉద్భవించిందట.  మిగిలిన జ్యోతిర్లింగాలలో పరమేశ్వరుని ఆవిర్భావానికి వేరే కథలున్నాయి.  ఇక్కడ మాత్రం అమ్మవారి చేతి రాపిడితో జ్యోతిర్లింగ  రూపాన్ని ధరించింది.  ఇది పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను, దంపతుల మధ్య ఉండవలసిన అవగాహనను, ఆప్యాయతను తెలుపుతుంది.  ఎదురుగా ఉన్న వేడిమినైనా, విషాన్ని  అయినా తనలోకి తీసుకుని ఎదుటివారికి, తనను నమ్మినవారికి కష్టాలను, దుఃఖాలను తొలగించడమే పరమేశ్వరతత్వం అనే రహస్యం  ఘృష్టేశ్వర దర్శనంతో అవగతమౌతుంది.  ఘర్షణలో ఆవిర్భవించడం చేత ఈ జ్యోతిర్లింగానికి  ఘృష్టేశ్వరనామం ఏర్పడింది. 

చివరిగా  భారతదేశం నలుగు దిక్కులా  జ్యోతిర్లింగ రూపుడై సమస్త ప్రాణులను కాపాడుతున్న పరమేశ్వరుని కరుణాకటాక్షం అందరికీ  కలగాలని కోరుకుందాం.



Friday 28 September 2018

ప్రేమంటే...



 స్వచ్చమైన ప్రేమకు షరతులు ఉండవు.  ఎప్పుడైతే ప్రేమను షరతుల తక్కెడలో వేసి తూకం వేస్తారో అప్పుడే అది నిజమైన ప్రేమ కాదని తేలిపోతుంది.  అదేవిధంగా  ప్రేమ ఎప్పుడూ వన్వే కాకూడదు.  ప్రేమించడానికైనా, ప్రేమను పొందడానికైనా విశాలమైన హృదయం ఉండాలి.  అందరినీ ఆప్యాతతో ఆదరించే గుణాన్ని అలవర్చుకోవాలి.  ప్రేమతో అందరి మనసులను గెలవాలి.  మనసుకు నచ్చినవారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారి సంతోషం కోసమే ఆలోచించగలగడమే నిజమైన ప్రేమ.  అలాంటి ప్రేమ ఇద్దరి మధ్య ఏర్పడితే అప్పుడు మాత్రమే వారు నిజమైన ప్రేమికులవుతారు.  జీవితాంతం  ప్రేమ పక్షుల్లా జీవించగలుగుతారు. 



Tuesday 18 September 2018

మనం పనిచేసే సంస్థ కన్నతల్లి లాంటిది


మనం ఏ సంస్థలో పనిచేస్తున్నా, ఏ భాద్యత నిర్వహిస్తున్నా వాటి పరిధులకు లోబడి ఆ సంస్థకు సేవ చేయాలి.  స్వలాభం కోసం   ఏ పని చేయకూడదు.  మన వల్ల సంస్థ వృద్ది చెందాలే తప్ప నష్ట పడకూడదు.  మనం సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి,  సంస్థ లాభనష్టాలలో భాగమవ్వాలి.  ఎంత సంపాదిస్తున్నామని కాదు ముఖ్యం.  సంస్థకు ఎంతలా ఉపయోగపడుతున్నామో ఆలోచించాలి. ఎందుకంటే మనం పనిచేసే సంస్థ  కన్నతల్లి లాంటిది.  సమాజంలో బ్రతకడానికి ఒక దారి చూపించి,  మనల్ని, మన కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న కల్పతరువు.



Monday 17 September 2018

పదో జ్యోతిర్లింగం


పదో జ్యోతిర్లింగం  'నాగేశ్వర లింగం'.  పడమటి సముద్రతీరాన గుజరాత్ లో ద్వారకా పట్టణ  సమీపంలోని దారుకావనంలో ఈ క్షేత్రం ఉంది.  దారుకాసుర సంహారం చేసి లోకాలను శివుడు కాపాడిన ఘటన ఇక్కడే జరిగింది.  సుప్రియుడు అనే భక్తుని ప్రార్ధనతో స్వామి ఇక్కడ నాగేశ్వర లింగంగా అవతరించాడు.  పడగలతో సర్పరూపంగా దర్శనమిచ్చే ఈ జ్యోతిర్లింగం ఇతర ప్రాంతాలలో సహజీవనాన్ని జీవ  వైవిధ్యాన్ని ప్రబోధిస్తోంది.  



Wednesday 12 September 2018

"మట్టి గణపతే...మహాగణపతి "



ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం.  ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు.   జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు ఓంకార దివ్యస్వరూపుడు గణనాథుడు. సర్వ విఘ్నములను తొలగించే సిద్ది వినాయకుడు.  సత్వర శుభాలను ప్రసాదించే శుభంకరుడు విఘ్నేశ్వరుడు 
                                                 వినాయకచవితి శుభాకాంక్షలు !


Tuesday 11 September 2018

'బాసర పుణ్యక్షేత్రం'

నిండు కుండలా ప్రవహిస్తున్న గోదావరి తీరాన చదువులతల్లి  సరస్వతి అమ్మవారు  కొలువైవున్న 'బాసర పుణ్యక్షేత్రం'

Monday 10 September 2018

తొమ్మిదో జ్యోతిర్లింగం


తొమ్మిదో జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వరం. ఈ జ్యోతిర్లింగం  మహారాష్ట్రలో ఉంది.  తూర్పు, ఉత్తర దిక్కుల మధ్య హౌ మాగ్ని మధ్యలో గిరిజాసమేతుడై  వైద్యనాథేశ్వరుడు  ఇక్కడ దర్శనమిస్తాడు.  ఈ జ్యోతిర్లింగాన్ని తాకితే  దీర్ఘ వ్యాధులు కూడా నయమవుతాయట.  క్షీరసాగర మథనంలో పుట్టిన దేవవైద్యుడు  ధన్వంతరి  ఈ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాడట.  అందుకే ఈ స్వామి వైద్యనాథేశ్వరుడు అయ్యాడు.   

Wednesday 5 September 2018

గురువులందరికీ శుభాకాంక్షలు!


అక్షరజ్యోతుల్ని వెలిగించి విజ్ఞానాన్ని అందిస్తూ, విద్యార్థుల లక్షసాధనకు పునాది వేసేవారు గురువులు ! విద్యార్థులలో స్పూర్తిని నింపి విజయం వైపు నడిపిస్తూ ...తమలో దాగివున్న గొప్ప విషయాలను బోధిస్తూ, భావితరాలను తీర్చిదిద్దుతున్న గురుదేవులకు వందనాలు. దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానం ఉంది. గురువు లేని విద్యార్థి మంచి మార్గాన ప్రయానించలేడు. ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్య చెప్పేవాడు మాత్రం కాదు...లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేవాడని అర్థం. లక్షలాది మంది అధ్యాపకులకు ఆదర్శమూర్తి, మహాజ్ఞాన సంపన్నుడు, ఒక గొప్ప తత్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్టన్ గారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అధ్యక్ష పదవికి చేరుకున్న మహానుభావుడు. ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గురువులందరికీ ఆదర్శప్రాయుడయిన డా. సర్వేపల్లి గారి జన్మదినం నేడు. ఈ సందర్భంగా గురువులందరికీ శుభాకాంక్షలు!