”శోధిని”

Sunday 20 November 2011

అధికార దాహం

ఆనాడు ఆంగ్లేయుల పాలన
అంతమైనదని ఆనందించాం!
ఈనాడు విదేశీయుల
పంచన పడి రోధిస్తున్నాం!!
ప్రపంచీకరణ ధాటికి
మాయమై పోతున్నాయి పల్లెలు!
ప్రపంచ బ్యాంకు షరతులకు
రోడ్డున పడుతున్నారు ప్రజలు !!
పాలకుల గుప్పిట్లో ---
ప్రజలు తోలుబొమ్మలు!
వరల్డ్ బ్యాంకు చేతుల్లో---
పాలకులు కీలుబొమ్మలు!!
తెల్లదొరల అమానుషం
అంతమైనదనుకుంటే ---
నల్లదొరల అధికార దాహం
అన్నిరంగాల్లో మొదలయింది
మనదేశాన్ని రక్షించడానికి---
మన జాతీయ గౌరవాన్నికాపాడటానికి---
మరో జాతిపిత కావాలి.


Thursday 17 November 2011

కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం 'శ్రీ రామరాజ్యం'



ఈ రోజు (17-11-11) విడుదలైన శ్రీ రామరాజ్యం చిత్రం, నేడు వస్తున్న
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంది.  ఈ చిత్రాన్ని చూస్తున్నంత సేపు     
మరో 'లవకుశ' ను చూస్తున్నట్టు ఉంది.  ఇలాంటి దృశ్య కావ్యాలను
శ్రీ బాపు గారే తీస్తారని మరోసారి నిరూపించారు.  శ్రీరాముని గెటప్ లో
బాలకృష్ణ గారి నటన నభూతో నభవిష్యతిగా ఉంది.  శ్రీరాముడి పాత్రకి
జీవం పోశారు. ప్రతి సన్నివేశంలోనూ  తన తండ్రిగారిని గుర్తుకు తెచ్చారు.
శ్రీ నాగేశ్వరరావు గారు, నయనతార, శ్రీకాంత్ లు తమ పాత్రలకు పూర్తి
న్యాయం చేసారు.  ఇప్పుడొస్తున్న సినిమాలలో మన సంప్రదాయాలు
కాగడా పెట్టి వెతికినా కానరావు.  అలాంటి విలువలున్న 'శ్రీ రామరాజ్యం'
చిత్రం రావడం ఆనందదాయకం. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు
ప్రత్యేక ఆకర్షణ. పాటల చిత్రీకరణ బాగుంది.  తెర పైన పాటలన్నీ బాగున్నాయి.
ఈ తరం వారిని ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకున్న 'శ్రీ రామరాజ్యం'
కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం.

Thursday 10 November 2011

ప్రేమంటే ఇదేనా?

నా హృదయంలో 
ప్రేమదీపాన్ని వెలిగించి 
నా ఊపిరిలో 
వెచ్చని జ్ఞాపకం అయ్యావు
మోడుబారిన 
నా మనసును కరిగించి
నా గళంలో 
అమృత ధారవయ్యవు
ఆప్యాయత, అనురాగాల్ని పంచి 
నా జీవితాన్ని 
నందనవనం చేశావు
నా ప్రాణానికి ప్రాణమై 
నాలో ఎన్నో ఆశలు పెంచి 
అనుకోకుండా దూరమయ్యావు 
ప్రియతమా!
ప్రేమంటే ఇదేనా ?
ఒక్కసారి ఆలోచించు 
మన  ప్రేమను బ్రతికించు.

Sunday 6 November 2011

ముస్లిం సోదరులకు 'బక్రీద్' పండుగ శుభాకాంక్షలు!


త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు  జరుపుకునే 
'బక్రీద్' పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు 
శుభాకాంక్షలు.

Thursday 3 November 2011

'డెంగీ' కి తోడు 'హంటా వైరస్'

రాష్ట్రము మాయదారి రోగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక పక్క 'డెంగీ' జ్వరం పంజా విసరడంతో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క దీనికితోడుగా 'హంటా' అనే మాయరోగం వచ్చి చేరింది.  ఈ వ్యాధి ఎలుకల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందని, ఇంతవరకూ 'హంటా' కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, ముందు జాగ్రత్తలే మేలని డాక్టర్లు అంటున్నారు. 'డెంగీ' మాదిరిగానే 'హంటా' వైరస్ వల్ల తీవ్రమైన జ్వరం, వణుకు వస్తుందని, భరించలేని ఒళ్ళు, కీళ్ళ నొప్పులతోపాటు వాంతులు అవుతుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్శ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎలుకలను ఇంట్లో లేకుండా చూసుకోవాలని, భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు.  ప్రతి మనిషి  తాను నివసించే ఇల్లు, పరిసరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంట్లో చెత్తను పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కుండీలలో  మాత్రమే వేయాలి.  ఒకవేళ ఇంటిముందు మురికి కాల్వలున్నట్లయితే అక్కడ మురికి పేరుకుపోకుండా నీటి ప్రవాహం వేగంగా సాగేటట్టు  చూడాలి.  రెండు రోజులకొకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లుతుంటే ఈ వ్యాధులకు కారణమైన దోమలు దరిచేరవు. ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు  తీసుకుంటే ఈ వ్యాధుల బారినుండి బయటపడవచ్చు.