విద్యాలయాలు దేవాలయాలు .. ఉపాధ్యాయులు ప్రత్యేక దైవాలు. కాని కొందరు నీతి బోధకులుగా, సమాజ సృష్టలుగా తమ బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే కీచాకులుగా మారిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. ఇలాంటి వారి వద్ద విద్య నేర్చుకున్న వారిలో మానవ విలువలు నాశనమవుతున్నాయి. వ్యక్తులకు నైతిక విలువలు లోపించడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని పెద్దపూర మండలం ఓ తండాలో పసిమొగ్గలపై పైశాచానికి తెగబడ్డ నీచుడి ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. వెలుగు చూసేవి కొన్ని కేసులు మాత్రమే , వెలుగు చూడని సంఘటనలు కోకొల్లలు. కొందరి మగ మృగాల ప్రవర్తనకు మహిళలు చిగురుటాకుల్లా వణికి పోతున్నారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయనాయకులు ' ఖండిస్తున్నాం' అని అంటారు తప్ప, మహిళల రక్షణ కోసం చొరవ చూపడం లేదనేది జగమెరిగిన సత్యం. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా.. పశుప్రవృత్తికి మాత్రం కళ్ళెం వేయలేక పోతున్నాయి. మహిళలు, చిన్నారులు ఆకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మూలాలు వెతికి సమూల ప్రక్షాళన చేయాలి. అందుకు యువత ముందుకు రావాలి. ఒక్క యువతతోనే ఇది సాధ్యమవుతుంది.