”శోధిని”

Monday 27 August 2018

ఏడో జ్యోతిర్లింగం


వరుణ, అసి అనే రెండు నదుల సంగమం అయిన  వారణాసిలో కొలువై ఉన్నాడు సుప్రసిద్ధుడైన కాశీవిశ్వేశ్వరుడు. ఇక్కడ అమ్మవారు విశాలాక్షిగా, అన్నపూర్ణగా భక్తులను కాపాడుతోంది.  కాశి  దర్శనం వల్ల పాపాలన్నీ పోతాయంటారు.  ఆ అనాథ నాథుడు విశ్వనాథుడు.  ప్రళయకాలంలో ప్రపంచం మొత్తం నీటిలో మునిగినా కాశిక్షేత్రం మాత్రం అలాగే ఉంటుందని స్కాందపురాణం చెబుతోంది.  ఇక్కడ మరణించినవారికి ముక్తి లభిస్తుందంటారు. 

Sunday 26 August 2018

"అన్నాచెల్లెల అనుబంధం ... రక్షాబంధన సుగంధం"


  

శ్రావణ పౌర్ణమి  నాడు సోదర అనుబంధాల్ని గుర్తు చేసే ఆత్మీయానురాగాల పండుగ రాఖీ పండుగ.  భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి.  ఈ రోజున సోదరి, సోదరుడికి కట్టే రక్షణ కవచం రాఖీ.  మహిళలకు రక్షణగా నిలవడడమే ఈ పండుగ ఉద్దేశం.  స్త్రీల పట్ల సోదరభావం, పవిత్రభావం ప్రతి ఒక్కరిలో కలగాలి. సమాజంలో తనకు పూర్తి రక్షణ ఉందన్న నమ్మకం ప్రతి మహిళలో కలిగించాలి.  అప్పుడే నిజమైన రక్షాబంధం.


Thursday 23 August 2018

సౌభాగ్యప్రదం వరలక్ష్మివ్రతం!



సృష్టి, స్థితి లయకారిణి అయిన  అమ్మవారు అనంత శక్తి స్వరూపిని.  ఈ ప్రపంచమంతా సర్వం తానై  ఇమిడి ఉంది.  అమ్మ కరుణ ఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ మటుమాయమైపోతాయి. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం మైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరించడం ఎంతో శుభకరమని  మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది శ్రావణమాసం.  ఈ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. అమ్మవారిని  భక్తిశ్రద్దలతో నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి,  నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన  వారింట అమ్మవారు కొలువై ఉంటుండని భక్తుల విశ్వాసం.


Tuesday 21 August 2018

మిత్రులందరికీ 'బక్రీద్' శుభాకాంక్షలు

ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. అలాంటి సందేశాత్మక పండుగలలో మంచికోసం, మానవ సంక్షేమం కోసం పాటుపడుతూ త్యాగానికి ప్రతీతగా భక్తిభావంతో జరుపుకునే పండుగ 'బక్రీద్ పండుగ. ' ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలని కోరుకుంటూ, మిత్రులందరికీ హృదయపూర్వక 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు !


పెద్దలపై నిర్లక్ష్యం తగదు


Monday 20 August 2018

ఆరో జ్యోతిర్లింగం


ఆరో జ్యోతిర్లింగం  'భీమశంకరం'  మహారాష్ట్రంలో సహ్యాద్రిపై ఉంది.   భీమానది సమీపంలో ఉండడం వల్ల  భీమశంకరుడు అయినాడు.  దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిని 'డాకిని' అంటారు.  ఆమె ఇక్కడ పరమేశ్వరునికై  తపస్సు చేయడం వల్ల  ఈ ప్రాంతాన్ని డాకిని, శాకిని  మొదలైన భూతప్రేత పిశాచాలు  ఇక్కడ స్వామిని సేవిస్తూ ఉంటాయట.  ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి భూతప్రేత పిశాచాల భయం పోతుందట.  




Thursday 16 August 2018

మహానేతకు నివాళి

భారతదేశ కీర్తిని ఖండాంతరాలకు  వ్యాపింపచేసిన మహానేత, ఉత్తమ పార్లమెంటేరియన్, ఉత్తమ ప్రధానిగా ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న గొప్ప మానవతావాది అటల్ బిహారీ వాజపేయి గారి ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతుడిని కోరుకుంటున్నాను.  


జలహారం

జాలువారే జలపాతం 
ప్రకృతి  మనకిచ్చిన వరం 
జలజలజారే జలపాతం 
ప్రకృతిమాతకు ఆభరణం 
ఎంతో ఆహ్లాదం ప్రకృతి  రమణీయం
సమస్త జీవజాలానికి జీవనాధారం !


Tuesday 14 August 2018

మన జెండా పండుగ

జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో జరుపుకునే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం. ఇది ఎందరో వీరుల పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలం. తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడి మన దేశానికి విముక్తి లభించిన రోజు.... 'ఆగస్టు 15' మన దేశ చరిత్రలో మరచిపోలేని ఒక అపురూపమైన రోజు. ఈ సందర్భంగా మనకు స్వేఛ్ఛావాయువులు అందించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ! 

Monday 13 August 2018

అయిదో జ్యోతిర్లింగం


కేదారేశ్వరలింగం భూమికి పదకొండువేల అయిదు వందల అడుగుల ఎత్తులో ఉన్న కేదారేశ్వర లింగం హిమాలయపర్వతంపై ఉంది. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారట. ఉత్తరదిక్కున ఎత్తయిన మంచుకొండల్లో ప్రత్యేక జ్యోతిర్లింగ క్షేత్రం ఈ కేదారేశ్వర జ్యోర్లింగం. ఇక్కడ ఋషులందరూ స్వామిని దర్శిస్తూ ఉంటారు.  దేవతలు,  రాక్షసులు,  యక్షులు మొదలైన వారు సేవిస్తూ ఉంటారు.  వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి వరకు ఆరు నెలలు మాత్రమే ఈ దేవాలయం తెరచియుండి భక్తులకు దర్శనం కలుగుతుంది.  దీపావళి రోజున  స్వామికి నేతితో దివ్యజ్యోతి వెలిగించి మూసిన దేవాలయం తలుపులు వైశాఖ శుద్ధ పాడ్యమినాడు తెరిచేనాటికి ఆరు నెలల క్రితం వెలిగించిన దీపం యథాతథంగా వెలుగుతూ దర్శనమిస్తుంది.

Sunday 5 August 2018

నాలుగో జ్యోతిర్లింగం

ఓంకారేశ్వర  క్షేత్రం మధ్యప్రదేశ్ లో  ఉంది.   ఈ క్షేత్రం వింధ్య పర్వతశ్రేణుల్లో నర్మదా కావేరి నదుల మధ్య ఉంది.  సూర్యవంశరాజు మాంధాత అడవికి వెళ్ళినప్పుడు ధూపదీపనైవేద్యాలు లేని శివలింగం కనబడిందట.  ఆ శివలింగంలోంచి ఓంకారం వినబడుతుంది గ్రహించాడు.  ఆయన పెద్దలను తీసుకొచ్చి  చూపించాడట.  పెద్దలు చూసి 'ఓంకారేశ్వరుడని' పేరు పెట్టారని చెబుతారు.   అన్ని మంత్రాలకు, శబ్దాలకు మూలం ఓంకారం.  అది నిత్యనూతనం.  ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వల్ల  ప్రణవనాద అనుసంధానంతో ఏకాగ్రత లభిస్తుందంటారు.