”శోధిని”

Monday, 25 January 2016

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !



మనం రూపొందించుకున్న రాజ్యాంగం మనకు స్వాతంత్ర్యం వచ్చిన 2 1/2 ఏళ్ల తర్వాత 1950 జనవరి 26న అమలయిందిఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం.  మన దేశంలో ఉన్నన్ని మతాలు, జాతులు, భాషలు మరే దేశంలోనూ లేవు.  మనమంతా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తూ ప్రపంచంలో ఆదర్శంగా నిలిచాంఅన్ని కులాలను, మతాలను, ప్రాంతాలను సమానంగా గౌరవించుకోవడం మన రాజ్యాంగం ప్రత్యేకత.  ఈ సందర్భంగా మనదేశానికి తమ జీవితాన్ని అర్పించిన ఎందరో మహనీయుల  త్యాగఫలాన్ని స్మరించుకుందాం.

Friday, 22 January 2016

ఇదెక్కడి న్యాయం !

రోడ్డు పైన ఇద్దరు కొట్టుకుంటుంటే, మానవత్వం వున్న మనుషులు చూస్తూ ఊరుకోరు.  వారిద్దరిని విడదీసి, సద్దిచెప్పి పంపిస్తారు.  దెబ్బలు తగిలిన వారిని ఆసుపత్రిలో చేర్పిస్తారు.  నేరం చేసిన వారిని పోలీసులకు పట్టిస్తారు. కాని, మూగజీవులైన కోడిపుంజులను పందాలకు పెట్టి, అవి రక్తం చిందేలా తన్నుకుంటుంటే, మానవత్వాన్ని మరచి వందలాదిమంది సంబరంతో కేకలు వేస్తూ...ఆనందంతో చిందులేస్తారు. మనుషులకొక న్యాయం, ముగజీవులకొక న్యాయమా? ఇదెక్కడి న్యాయం ?

Monday, 18 January 2016

NTR 20వ వర్థంతి !


నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగుజాతి మన్నలను పొంది, సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస భరిత పారిజాతం యన్.టి.ఆర్. తెలుగువారి గుండెల్లో 'అన్న' గా ముద్రవేసుకున్న మరపురాని మరువలేని మహానటుడు నందమూరి తారక రామారావు గారి 20వ వర్థంతి సందర్భంగా...

Wednesday, 13 January 2016

పుష్యమాస సోయగాలు !


పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని కలిగించి ఆనందాన్ని పంచే మహాపర్వదినం సంక్రాంతి.  ప్రకృతికీ, మానవునికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచించే పండుగ కుడా ఇదే !   ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించి ఉత్తరదిశ ప్రయాణాన్ని కొనసాగించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.   తెల్లవారుజామున హేమంత శీతల పవనాలు మేనును స్పృశిస్తుండగా, మంచు బిందువులు తలను తడుపుతుండగా మహిళామణులు రంగురంగుల ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలను తీర్చిదిద్దడం మధురమైన మరుపురాని  అనుభూతిగా చెప్పుకోవచ్చు.   గంగిరెద్దుల కోలాహలం, హరిదాసుల సంకీర్తనలతో గ్రామాలన్నీ  సందడిగా మారిపోతాయి. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మన పండుగలను మరచిపోకుండా జరుపుకోవడం, మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవడంఅవుతుంది.