”శోధిని”

Thursday 30 April 2015

మంచి నాయకుడు అంటే ...




ఇతరుల బాధ్యతను తనమీద వేసుకుని నడిపించే వాడే నాయకుడు.  అటువంటి నాయకుడు ఎందరికో మార్గదర్శకుడవుతాడు.  నేడు  నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం లేని చాలా మంది నాయకుకుగా చెలామణి అవుతున్నారు. సమస్యలు ఎదురవగానే ఆవేశంతో ఊగిపోయే వారు నాయకులు కాలేరు.  నాయకుడికి ఆత్మ నిగ్రహం అవసరం.  దురదృష్టవశాత్తు ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేయడం నేడు నాయకత్వ లక్షణాలుగా  చెలామణి అవుతున్నాయి.  రోడ్ల పైన ప్రదర్శించిన ఈ విధ్వంసకర ప్రవర్తన దిగజారుడు నాయకత్వానికి నిదర్శనం అని చెప్పవచ్చు.  ఇలాంటి నాయకులు కాదు మనకి  కావాల్సింది.  భిన్నంగా ఆలోచిస్తూ...మంచి ప్రవర్తన కలిగి హుందాగా ప్రదర్శించగలిగిన   నాయకత్వం అవసరం.  ఆలోచనల్లో దార్శనీకత మాటల్లో సూటిదనం, నిర్ణయాల్లో పరిపక్వత, చర్చల్లో మేధావితనం వంటి లక్షణాలు వున్న వ్యక్తి విలక్షణ నాయకుడవుతాడు.  నిస్వార్థ సేవతో అసమాన ప్రతిభ  కనబరిచి, మంచి నాయకునిగా గుర్తింపు పొందుతాడు.


చేపల పులుసు ! (జోక్)

కొత్తగా పెళ్లయిన భార్యతో ...
"నీకు చేపల పులుసు  చేయడం తెలుసా " అడిగాడు.
"ఓ ..బాగా చేయగలను" ఉత్సాహంగా అంది. 
"అయితే ఈ చేపల్కి బాగా మసాల పట్టించి వండు చూద్దాం"
చేపల కూర చేసి భర్తకు వడ్డించింది ఆ ఇల్లాలు
తొలిసారిగా భార్య చేతి వంట రుచి చూస్తూ ...
"ఏంటీ కూర నీసు వాసన వస్తోంది.  చేపల్ని కడగలేదా ?" ముఖం అదోలా పెట్టి అడిగాడు.
"చేపలు ఎప్పుడూ నీళ్ళల్లోనే కదా ఉండేది.... ఇక వాటిని కడిగేది ఎందుకు ?
ఆమె సమాధానం.
భార్య తెలివిని ఎలా మెచ్చుకోవాలో తెలీక జుట్టు పీక్కున్నాడు ఆ భర్త గారు!




Wednesday 22 April 2015

సెల్ ఫోన్ మహత్యం !

నడుస్తున్నా, వాహనం నడుపుతున్నా, టివీ చూస్తున్నా, భోజనం చేస్తున్నా చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే!  చివరికి నిద్రిస్తున్నా పక్కలో సెల్ తప్పనిసరి అయింది.  ఒకప్పుడు నిద్రిస్తున్న సమయంలో పక్కన భాగస్వామి, లేకుంటే పిల్లలు ఉండేవారు.  ఇప్పుడు వారి స్థానాన్ని సెల్ ఆక్రమించుకుంది.  పిల్లలు, పెద్దలు  అనే తేడా లేకుండా అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి.  పక్కన వున్న వారిని సైతం పట్టించు కోకుండా ఎవరి లోకాన వారు యమా బిజీ!  ఇదీ ఇప్పుడు ప్రతి ఇంట్లో  కనిపించే సెల్ దృశ్యాలు.  ఇలా మనిషి జీవితంలో సెల్  ఒక భాగం అయిపోయింది.  ఈ సెల్ ప్రభావం మన ఆరోగ్యం పైన ఎంత ఉంటుందో సెల్ ప్రియులు ఎంత త్వరగా తెలుసు కుంటే చాలా మంచిది. అవసరానికి సెల్ అవసరమే కాని, నిత్యం అదే జీవితం కాకూడదు.

Monday 20 April 2015

సిరిమల్లె పువ్వు !



స్వచ్చమైన మల్లెపువ్వులా,  దివ్యమైన వర్చస్సుతో వెలిగిపోతున్న పదహారణాల తెలుగు అమ్మాయి 'శ్రీదివ్య' మంచినటి అని   ప్రశంసలయితే దక్కాయి  కాని,  తెలుగు దర్శకులు, నిర్మాతలు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు.  శ్రీ దివ్య నటనను గుర్తించి తమిళ చిత్ర పరిశ్రమ అవకాశాలు ఇస్తుంటే, మన దర్శకనిర్మాతలు మాత్రం మంచి నటిని మన నట్టింట్లో పెట్టుకొని తెలుగు భాష రాని ఇతర భాషల హీరోయిన్స్ ని ఎంపిక చేసుకోవడం శోచనీయం.

Tuesday 14 April 2015

నేటి మానవుడు !

నేడు మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారి పోతున్నాయి.   ఆస్తిని పెంచుకుంటూ పరుల గురించి ఆలోచించడం మానేస్తున్నారు.  ఇంటి వైశ్యాల్యం పెంచుకొంటూ...  హృదయ వైశ్యాల్యం తగ్గించుకుంటున్నారు. దాంతో  మానవత్వం నశిస్తూ,  అణువణువునా క్రూరత్వం చోటు చేసుకుంటోంది.    భోగభాగ్యాలు శాశ్వతం కాదని,   ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండటం... సమాజంతో  సత్ సంబంధాలు ముఖ్యమని  మానవుడు తెలుసుకునేదేప్పుడో ! 

Sunday 12 April 2015

స్వార్ధపరులున్నారు జాగ్రత్త !





ఇతరుల గురించి తేలిగ్గా మాట్లాడటమే అహంకారానికి పరాకాష్ట. ఎదుటి వారిని గౌరవించకపోయిన పర్వాలేదు కాని, అపహాస్యం మాత్రం చేయకూడదు.  ఎక్కడ అహంకారం వుంటుందో  అక్కడ స్వార్థం తప్పకుండా వుంటుంది.  అహంభావులతో కలసి పనిచేయాల్సివస్తే సమస్యలు తప్పవు. అందుకే సాద్యమైనంత వరకు ఇలాంటి వారికి  దూరంగా ఉండటం మంచిది. ఎంత గొప్పవాడయినా, ఎంత పెద్ద  పదవిలో వున్నా అహంకారం లేకుండా వుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుంది. అహంకారం వల్ల నష్టాలే కాని, లాభాలు ఉండవని గ్రహించాలి.  మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం గొప్ప కాదు.  ఎదుటివారిని విమర్శించే ముందు మన లోపాలను మనం సరిదిద్దుకోవాలి. కొందరు అనవసరమైన అబద్దాలతో, ఏదొక సందర్భంలో మోసపూరిత ధోరణితో ప్రవర్తిస్తుంటారు. ఇటువంటి వారికి ఎంత వీలయితే అంత దూరంగా ఉండటం శ్రేయస్కరం.  ఒకసారి వారి గుణం తెలిశాక మళ్ళీ వారికి సన్నిహితంగా వెళ్ళకూడదు. ఇలాంటి వాళ్ళు మన దగ్గరకి  వచ్చినప్పుడు, మనల్ని ఆకాశానికి ఎత్తేస్తూ... పక్కవాళ్ళ గురించి చెడుగా చెప్పడంపక్కవాళ్ళ దగ్గరకి వెళ్ళినప్పుడు మన గురించి చెడుగా చెబుతూ వాళ్ళను ఆకాశానికి ఎత్తేయడం అలవాటు.  ఇలా తన చుట్టూ ఉన్న వాళ్లల్లో  విరోధం పెంచుతూ, తను మాత్రం అందరి దగ్గర మంచివాడుగా చెలామణి అవుతూ నక్కలా  లబ్ధి పొందుతూ ఉంటారు.  ఇలాంటి వాళ్ళు విష సర్పాల కంటే ప్రమాదం కాబట్టిమన జాగ్రతలో మనం ఉండటం చాలా మంచిది.   

Sunday 5 April 2015

ప్రజా ప్రతి'నిధులు' !


మనం ఎన్నో ఆశలు పెంచుకుని ఎన్నుకున్న ప్రజా పతినిధులు చట్టసభలలోకి అడుగు పెట్టగానే ఏమవుతుందో ఏమో తెలియదు కాని ప్రతి ఒక్కరూ సభలో  వీరంగం సృష్టించడానికి  పోటీ పడుతున్నారు.  ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలు చుస్తున్నారనే విషయాన్ని మరచిపోయి, దేశంలో ఉన్న బూతు మాటలన్నీ మాట్లాడేస్తూ... దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నారు.   స్త్రీ, పురుష అనే భేదం లేకుండా వారు మాట్లాడుతున్న బూతు మాటలు, ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంటున్నాయి.  తోటి సభ్యులను బెదిరించడం, ఏకవచనంతో సంభోదించడం పరుష పదజాలంతో దూషించడం అలవాటయిపోయింది. చట్టసభలంటే  బలాబలాలు ప్రదర్శించుకోవడం, అసభ్య పదజాలంతో  వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే వేదిక కాదని,  మన ప్రజా ప్రతినిధులు ఎప్పుడు తెలుసుకుంటారో మరి.  రాబోయే సమావేశాలలో నైనా  ప్రజాప్రతినిధులు  హుందాగా ఉంటూ, సామాన్య ప్రజల సమస్యల పైన చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు...లేకుంటే తిరస్కరిస్తారు.