”శోధిని”

Monday 28 July 2014

పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు!


శుభాలు కురిపించే వారాల  మాసం రంజాన్.  ఈ పవిత్ర మాసం అత్యంత శుభప్రదమైనది.  ఎనలేని శుభాలను అందించే ఈ నెలంతా ముస్లిం సోదర సోదరీమణులలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.  మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి జీవనసాఫల్యానికి కావాల్సిన అనేక విషయాలు ఈ మాసంతో ముడిపడి ఉన్నాయి.  అంతేకాకుండా ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించడంతో  ఈ పవిత్ర గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది. అందుకే ఈ మాసమంతా ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రం, పుణ్యదాయకం.   శుభాల సిరులు అందించే రంజాన్ పర్వదినం అందరికీ సకల శుభాలను, శోభలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను.  
       మిత్రులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు!

Sunday 27 July 2014

విద్యుత్ అలంకరణ!

ఆదివారం (27-07-2014) బోనాల పండుగ సందర్భంగా నాగారం (కీసర) రోడ్డు పైన ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ!

Saturday 26 July 2014

నేటి మానవుడు !



నిర్దాక్షణంగా చెట్లను నరికేస్తూ ...
వ్యర్ధాలను నలువైపులా వెదజల్లుతూ ...
భూగర్భ జలాలను పిండేస్తూ...
సహజవనరులను హరించేస్తూ...
జంతువులను, పక్షులను నాశనం చేస్తూ... 
ప్రకృతి వినాశనానికి కారణమవుతున్నాడు  విజ్ఞానవంతుడయిన నేటి మానవుడు !

Thursday 24 July 2014

పాపం ... పసివాళ్లు!




గుండెలు పిండేసే విషాదం. హృదయాలను ద్రవింపచేసే ఘోర ప్రమాదం. పాపపుణ్యమెరుగని పసివాళ్ల ప్రాణాలను మృత్యుశకటం చిదిమేసిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చదువుల కోసం బ్యాగులు భుజాన వేసుకుని బస్సు ఎక్కిన చిన్నారులు కానరానిలోకాలకు వెళ్లిపోయారు. వెళ్లొస్తామంటూ ఉత్సాహంగా వెళ్లిన తమ బంగారు కొండలను రైలు రాక్షసుడు కానరాని లోకాలకు ఎత్తుకుపోయాడని తెలియగానే తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల శోకాగ్నికి చల్లార్చడం ఎవరి తరం?

ధూమపానం ... ప్రాణాంతకం !



బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా...  దీని పైన అధికారులు దృష్టి  సారించక పోవడంతో పొగబాబులు, తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాక పక్క నున్న వారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు.  నిబంధనలు కాగితాలకే పరిమితం చేయకుండా వాటిని అమలు చేస్తూ, బహిరంగ  ప్రదేశాలలో పొగత్రాగే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి.  ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించాలి.    సిగరేట్టులో నికోటిన్ అనే పదార్ధం ఉండటం వలన క్యాన్సర్, శ్వాశాకోస  వ్యాధులు, బి. పి, హార్ట్ ఎటాక్ వంటివి వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నా కుర్రకారు మాత్రం గుప్పు గుప్పు మంటూ పొగను ఉదేస్తూ వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.  బతుకంతా పొగవలయమైతే చివరికి మిగిలేది అస్థిపంజరమేనని పొగబాబులు గుర్తుంచుకోవాలి. 


Sunday 20 July 2014

మనసారా నవ్వు !



మనిషికి 'నవ్వు' అద్భుతమైన టానిక్. నవ్వటం వల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు కలుగుతుంది.  శరీరంలో పేరుకు పోయిన మలినాలన్నిటినీ తొలగించ గలుగుతుంది.  హాయిగా నవ్వగలిగిన వారి ముఖంలో ప్రశాంతత వస్తుంది.... ముఖం కళగా తయారవుతుంది.   నవ్వు రోగ నిరోధకవ్యవస్థను మెరుగు పరుస్తుంది.  తద్వారా ఆరోగ్యం బాగుంటుంది.  నవ్వుకు దూరమవ్వడమంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.  అందుకే నిత్యం 'సిరిమల్లె పువ్వల్లె నవ్వు'  (పేస్ బుక్) లోని  కార్టూన్లు  చూడటం, జోక్స్ చదవటం, కామెడీ సినిమాలను తిలకించడం అలవాటు చేసుకుంటే  జీవితం నందనవనం అవుతుంది.  


Friday 18 July 2014

పరమాత్మ !




పరమాత్మను పిలుచుకునే పదాలు
ఓం నమశ్శివాయ ...
అల్లాహో అక్బర్ ...
హలెలూయా...
 రూపాలు వేరయినా దేవుడు ఒక్కడే !

*********

Thursday 17 July 2014

'గాలి అమ్మబడును'!

చేతిలో డబ్బుంటే చాలు అన్ని కొనగలం.  కాని,  స్వచ్చమైన గాలి దొరకడం కష్టం.  అందుకే కొందరు స్వార్థపరులు సంపాదనలోపడి పంచభూతాలను అమ్మకానికి పెడుతున్నారు.  ఇప్పటికే భూమి, నీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.  ఇప్పుడు గాలి వంతు వచ్చింది.  గాలి లేనిదే శ్వాస ఆడదు.  అందుకే కొందరు బడాబాబులు గాలిని క్యాష్ చేసుకోవడానికి ప్రణాలికలను రచిస్తున్నారు.  పారిశ్రామిక వ్యర్థాలతో , వాహన, జల వనరుల కాలుష్యంతో గాలిని కలుషితం చేస్తున్నారు.  వీరి చర్యల వల్ల నగర జీవులకు స్వచ్చమైన గాలి కరువయిపోయింది.  వాతావరణ సమతుల్యం దెబ్బతిని జీవుల మనుగడ ప్రమాదంలో పడింది.  దాని ఫలితమే నేడు వర్షాకాలం వచ్చి 40 రోజులు  గడుస్తున్నా వాన చినుకు రాలడం లేదు. ఇప్పటికైన ప్రభుత్వాలు మేల్కొనకపోతే మానవులు జీవించాలంటే  గాలిని కొనక తప్పదు. దుకాణాల దగ్గర 'గాలి అమ్మబడును' అని బోర్డులు దర్శనమిస్తాయి.  ఈ పరిస్థితే కనుక  వస్తే జంతువులు, పక్షులు మన కంటికి కానరావు.  తలుచుకుంటేనే శరీరం జలదరిస్తోంది కదూ!

Friday 11 July 2014

ఆచార్య దేవోభవ !

       

     
     అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు ... పరబ్రహ్మ స్వరూపులు.  తమ శిష్యులలో జ్ఞానజ్యోతిని వెలిగించి... అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సన్మార్గంలో పయనించడానికి ప్రేరణ కలిగిస్తారు. దాంతో గురువుల సన్నిధిలో శిష్యులు జ్ఞానవంతులవుతారు.  అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమును ఇచ్చేవారు గురువులు కాబట్టి వారిని  దైవంగా భావించాలి.  అయితే గురువులకు నేర్పు, పట్టుదల కలిగిన శిష్యులు ఉన్నప్పుడే సమాజం అన్ని రంగాలలో వృద్ధి చెంది ముందుకు వెళుతుంది.  అటువంటి గురువుల ఆశ్రయం శిష్యులందరికీ మార్గదర్శకం అవుతుంది.  అయితే గురువులపైన శిష్యులకు అచంచల విశ్వాసం ఉండాలి.  అలాగే శిష్యులపైన గురువులకు అమితమైన అభిమానం ఉండాలి.  ధనం కన్నా జ్ఞానం గొప్పదని ఇరువురు గుర్తించాలి.   

     గురు పౌర్ణమి సందర్భంగా  దైవస్వరూపులయిన గురువులందరికీ ప్రణామములు.

Wednesday 2 July 2014

సమస్యల వలయం!

జూన్ పోయింది ... జూలై వచ్చింది.  అయినా వాన చినుకు లేదు.  ఊరిస్తూ వర్షించని ఆకాశం వైపు రైతులు  ఎదురు చూస్తున్నారు.  ఒకప్రక్క రాజకీయనాయకులు,  మరోప్రక్క వరుణదేవుడు మోసం చేయడంతో దేశానికి వెన్నుముక అయిన రైతులలో  దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జలాశయాలు అడుగంటడం, చాలినంత బొగ్గు అందుబాటులో లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బేరసారాలకు పోవడంతో సమస్య మరింత జటిలమయింది.  ఇప్పటికైనా ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమయి రెండు రాష్ట్రాల సమస్యల పైన చర్చించి,  ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అడుగులు ముందుకేస్తే ప్రజలు సంతోషిస్తారు.  లేకుంటే రెండు రాష్ట్రాలు తీవ్ర కరవుబారినపడే ప్రమాదం లేకపోలేదు.  ఇది  పంతాలకు పోయే సమయం కాదు.  ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి నెలరోజులు దాటినా ఇంతవరకూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాకపోవడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా తెలుగు ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రులిద్దరూ వెంటనే సమావేశంమయి,  ఉమ్మడి సమస్యల పైన చర్చలు జరపాలని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.


Tuesday 1 July 2014

భార్యాభర్తల కలహాలు

దంపతుల మద్య కలహాలు నీటిలో కెరటాల్లాంటివి.  అవి అలా వచ్చి ఇలా పోతుంటాయి.  అప్పుడప్పుడు చిన్న చిన్న కలహాలు వస్తేనే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు.  వాళ్ళ  అనుబంధం మరింత దృఢ పడుతుంది.  ఏ అమరికలకు తావులేకుండా అన్యోన్యంగా ఉంటారు.  అయితే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఆరోగ్యకరంగా ఉండాలి.  చిలికి చిలికి గాలివాన కాకుండా జాగ్రత్త పడాలి.  కొందరు 'మా దంపత్యజీవితంలో గోడవలు లేవు' అని  గొప్పలు  చెబుతూ ఉంటారు.  ఇది పచ్చి అబద్దం.  ఎందుకంటే భార్యాభార్తలన్నాక  ఏదోక  విషయంలో ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం.  అసలు కలహాలు లేని దాంపత్యం ... దాంపత్యమే కాదు.  సంసారంలో అలకలు, బ్రతిమాడుకోవడాలు  ఉంటేనే, దాంపత్యానికి నిండుదనం వస్తుంది.  ఆలుమగల బంధం జీవితకాలం కొనసాగాల్సి ఉంటుంది కాబట్టి ... వారి మధ్య వచ్చే కలహాలు హుందాగా ఉండాలి.  ఘర్షణను మాటలవరకే పరిమితం చేయాలి. అప్పుడే దాంపత్య జీవితంలో చక్కని ఫలితాలను పొందగలుగుతారు.