”శోధిని”

Sunday 27 May 2018

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావుగారి జన్మదిన సందర్భంగా....

కృషి, పట్టుదల, క్రమశిక్షణ, మంచి నడవడికతో... అంకితభావంతో తెలుగు చలనచిత్ర రంగంలో మహోన్నత స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల మన్నలను పొందిన గొప్ప నటుడు స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గారు. మాటలో మంచితనం, భావనలో వివేకం, సాధనలో పట్టుదల, నటనలో విలీనం రామారావు గారికున్న ముఖ్య లక్షణాలు. సంపూర్ణమైన వ్యకిత్వానికి ఆయన చక్కని నిదర్శనం. తెలుగు చలన చిత్రరంగంలో ఎన్నెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి, తనకు సాటిరారని నిరూపించిన ఎన్టీఆర్ సినీ అభిమానుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. తెలుగు సినీరంగంలో అగ్రస్థానం అధిష్టించి, ఏ పాత్ర పోషించనా ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. చారిత్రాత్మకం, జానపదం, పౌరాణికం, సాంఘీకం ఇలా ఆయని చేయని పాత్రంటూ లేవు. ప్రతి పాత్రలో లీనమై తెలుగువారి హృదయాలలో జీవించి ఉన్నారు. తెలుగువాడి బింకం, తెలుగువారి మమకారం, తెలుగువాడి మాటతీరు, పద్దతి అంతా దివ్యమైన ఆయన రూపంలో కనిపిస్తుంది. వ్యక్తిగా ఆయన సమున్నతుడు... వ్యక్తిత్వంలో మహోన్నతుడు. ఇక రాజకీయాల విషయానికొస్తే, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కంచుకోటగా ఉంటూ తనకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించన ఘనత ఎన్టీఅర్ గారిది. 1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధినే 'డీ' కొన్న యోధుడు NTR. ఖండాంతరాలకు తెలుగు భాష మాధుర్యాన్ని చవి చూపించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోపార్లమెంటులో పెద్ద పార్టీలయిన బిజెపి, సిపిఐ, సిపియంల కంటే ఎక్కువ స్థానాలు 35 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో ఒక ప్రాంతీయ పార్టీ మొదటి సారిగా ప్రదాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఇది తెలుగువారందరికీ గర్వకారణం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్ చైర్మన్ గా, జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం అధిరోహించారు. మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.

నాకు నచ్చిన పాట




Tuesday 22 May 2018

ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం (22-05-2018)


సుఖాలకు అలవాటు పడిన మానవుడు చెట్లను నరుకుతున్నాడు.  భూమాత గుండెల్లో గునపాలు నింపుతున్నారు. దయాదాక్షిణ్యం లేకుండా జంతువులను చంపుతున్నాడు.  రానురానూ మానవుడిలో ప్రక్రుతి పట్ల నియమం, నిబద్దత తగ్గిపోతూ రాక్షసుడుగా మారిపోతున్నాడు.  తన స్వార్థంతో తన సుఖాన్నే వెతుక్కుంటున్నాడే తప్ప ప్రకృతి గురించి ఆలోచించడం లేదు.   ఫలితంగా   జీవవైవిధ్యం దెబ్బతింటున్నది.  కొండలు, కోనలు, లోయలు, సరస్సులు, చెరువులు ఇలా ప్రకృతి సంపదంతా మనిషి స్వార్థానికి బలి అవుతున్నాయి.  ప్రకృతి వనరులను మానవుడి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటే తప్పులేదు.  అత్యాశకు పోవడం వల్లనే ఉపద్రవాలు సంభవిస్తున్నాయి.  దాంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని అమూల్యమైన జీవరాశి అంతరించిపోతోంది.  ఇప్పటికైనా మానవుడు రాక్షసత్వాన్ని వీడి జీవరాశులన్నింటితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి.  జీవరాశులను పరిరక్షించుకుంటే జీవవైవిధ్యం  పెరుగుతుందని తెలుసుకోవాలి.


Saturday 19 May 2018

నీలాద్రి


శ్రీ వేంకటేశ్వరస్వామికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి.  ఆమె పేరుమీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి ‘నీలాద్రి’ గా నామకరణం చేశారట.  తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే.  తలనీలాలు సమర్పణ అనేది  భక్తుల  అహంకార విసర్జనకు గుర్తు.


Monday 14 May 2018

దేవదేవుడు

వేంకటేశ్వరస్వామిని అలంకార రహితంగా నిజరూపంలో దర్శించడం ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతి. ఎందుకంటే ఆ సమయంలో స్వామివారిలో దేదీప్యమానంగా ప్రకాశించే వర్చస్సు తొంగి చూస్తూ, భక్తుల్ని మరింత పారవశ్యంలో ముంచెత్తుతుంది. శ్రీవారి పాదాల దగ్గర్నుంచి నేత్రలదాకా ఉట్టిపడే ఆ శోభను తికించే అవకాశం ఒక్క శుక్రవారం అభిషేకం సమయంలో మాత్రమే లభిస్తుంది. మంగళకరమైన దివ్యకాంతియుక్తమైన శ్రీనివాసుణ్ణి చూసి పరమానందభరితులవుతారు. స్వామివారిది అతిలోక సౌందర్యంతో విలసిల్లే అత్యద్భుత దివ్య మంగళ విగ్రహం. అద్భుత రూపలావణ్యంతో తీర్చిదిద్దినట్టుండే మోముతో మందస్మిత వదనంతో ఉండే శ్రేనివాసుడు, నమ్మి కొలిచే వారికి కొండంత వరాలిచ్చే దేవదేవుడు.


Saturday 5 May 2018

శేషాద్రి




సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠoలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తేలకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పాడు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని ఆదిశేషుడు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయుదేవుడు ఏమిచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో ఆదిశేషుడు తన పడగ ఎత్తి చూశాడు. దాంతో పట్టు సడలి వాయుదేవుడు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.