”శోధిని”

Saturday, 31 December 2016

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు !


ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న మిత్రులందరికీ  సకల శుభాలు  కలగాలని మనసారా కోరుకుంటూ...ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు !   పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి,  కోటి ఆశలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుదాం !!

Tuesday, 27 December 2016

విజయవంతంకాని (మైన) 50వ రోజు

నల్లధనాన్ని, నకిలీని కట్టడిచేయాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్యే అయినా, ఆదెబ్బకు దేశం మొత్తం  డబ్బు సమస్యతో అతలాకుతలమైపోయింది.  నల్లధనస్వాములు మాత్రం హాయిగా ఉన్నారు.  కోట్ల రూపాయల  కొత్తనోట్లు  బడాబాబుల ఇంట్లోకి చేరిపోయాయి.  ఎటొచ్చి సామాన్యులే  బ్యాంకులు,  ఏటీఎంల దగ్గర చేంతాడంత పొడవైన క్యూలో  అష్టకష్టాలు పడుతున్నారు.  బ్యాంకుల్లో డబ్బుఉండికూడా డబ్బును తీసుకోలేని పరిస్థితి. ఇంటశుభకార్యాలు తలపెట్టుకున్నవాళ్ళు నోట్లవేతలతో తల పట్టుకుంటున్నారు.  ఇది ప్రజల సహనానికి ప్రభుత్వం పెట్టిన పెద్ద పరీక్ష.  గత 50 రోజులుగా దేశంలోని ప్రజలు నరకమంటే ఏమిటో చవిచూస్తున్నారు.  కొత్త సంవత్సరంలోనైనా నోట్లపాట్లు తీరుతాయో లేదో ఆ భగవంతుడుకే తెలియాలి.  

 

Monday, 26 December 2016

చలి మంటలు !



ఉషోదయపు వేళ... చీకటి తెరలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి.  మంచు తెరల పరదాల  మధ్య ప్రకృతి సోయగాలతో అలరారుతోంది.   ఉదయాన్నే ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ళ ముందు ఆవిష్కారమవుతోంది.   చలిపులి వణికించే వేళ... చలిమంటల నునువెచ్చని వేడి శరీరానికి తగులుతుంటే ...ఎంత హాయి.  

Saturday, 24 December 2016

మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !

 

మనం ఎదుటివారిని మనస్పూర్తిగా ప్రేమిస్తే ...మనల్ని కూడా అవతలి వాళ్ళు అంతే ఇష్టంగా ప్రేమిస్తారు. సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించమని ఏసు చెప్పాడు. స్వార్థపూరితమైన ప్రార్థనలు కాకుండా ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నీతి, నిజాయితీగా నడిస్తే ఏసుక్రీస్తు ఎంతగానో సంతోషిస్తాడు. మన మనసు పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదం, ఆశీస్సులు లభిస్తాయి.

Monday, 19 December 2016

మంచి నేస్తం !

చికాకులన్నీ ఎగిరిపోవడానికి
చిరునవ్వు చాలు
కన్నీళ్లు ఆగిపోవడానికి
చల్లనిచూపు చాలు
గుండె మంటను చల్లార్చడానికి
తియ్యటి మాటలు చాలు
నేనున్నాననే భారోసానివ్వడానికి
మంచి నేస్తం దొరికితే చాలు !

Thursday, 15 December 2016

మానవ సంబంధాల మధురిమలు !

నేటి యువతకు సరదా కావాలి.  సద్దుబాటు అక్కర్లేదు.  సంతోషం కావాలి...భాద్యత అవసరం లేదు.  వారిలో  వికృత చేష్టలు ... వెర్రితలలు  తిష్ట వేయడంతో  తల్లిదండ్రుల పట్ల ప్రమానురాగాలు మృగ్యమైపోతున్నాయి. అక్కడక్కడ ఇంకా కొందరు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు కాబట్టి, ఇంకా మనవ సంబంధాల మధురిమలు మిగిలే ఉన్నాయి.  వాటిని మనం నిరంతరం కాపాడుకోవాలి.  ప్రేమ, గౌరవం అనేవి ఒకరిస్తే వచ్చేవి కావు.  మన మంచితనంతో మనమే సంపాదించుకోవాలి. చిన్నప్పటినుండి తల్లిదండ్రులు,  పిల్లలకు సత్ప్రవర్తన, సభ్యత ,సంస్కారం నేర్పించి మానవీయ విలువలను వారికి బోధించాలి. పెద్దవాళ్ళను గౌరవించడం, ప్రేమించడం నేర్పి, మనిషికి మనిషికి మధ్య అంతరాలు పెంచకుండా చూడాలి.

Sunday, 11 December 2016

అవినీతి అధికారుల భరతం పట్టాలి.

అవినీతి అధికారుల భరతం పట్టాలి.
పెద్దనోట్ల రద్దువల్ల సామాన్య ప్రజలకు నిత్యం ప్రత్యక్షనరకం కనపడుతోంది. పనులు మానుకొని బ్యాంకుల ముందు గంటలతరబడి నిల్చున్నా డబ్బులు అందక ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. నెలంతా కస్టపడి సంపాదించుకున్న డబ్బును పొందలేకపోతున్నారు. నిత్యావసర వస్తువులు , కూరగాయలు కొనేందుకు డబ్బులు లేక నిత్యం నరకయాతన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మేలు చేస్తుందేమో కాని, ఇప్పుడు మాత్రం ప్రజలు దినదినగండంను చవిచూస్తున్నారు. నల్లడబ్బు దాచుకున్న కుబేరులు మాత్రం కొందరు అవినీతి బ్యాంకు అధికారుల సహాయంతో కోట్ల రూపాయల కొత్త నోట్లు అందుకుంటున్నారు. అక్రమమార్గంలో నడిచే కొందరు బ్యాంకు అధికారులు పర్సెంటేజీలు తీసుకొని నల్లడబ్బున్న బదాబాబులకే కొత్తనోట్ల కట్టలు పంపిస్తూ, సామాన్య ప్రజలకు మాత్రం మొండిచెయ్యి చూపిసున్నారు. పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం అభినందనీయమే. కాని, కొందరు ప్రభుత్వ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ప్రధాని తీసుకున్న నిర్ణయ ఫలితాలు ప్రజలకు చేరాలంటే, అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పట్టాలి.


Sunday, 27 November 2016

బాబోయ్... రెండువేలనోటు !



ఒక మంచి లక్ష్యంతో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం.  పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం.ప్రభుత్వం తీసుకున్న చర్య సమర్థనీయమే కానీ, అమలులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోటు వల్ల పరిస్థితి మరింత చెయ్యిదాటి పోయింది. ఆనోటే సమాజంలో ప్రకంపనలు సృష్టించింది.   అన్ని రంగాలలో ఈ నోటు తీవ్ర ప్రభావితం చేసింది. సామాన్య జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రెండువేల నోటు స్థానంలో అయిదువందల నోటు ప్రవేశపెట్టి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేదికాదు. ఇప్పుడు రెండువేల నోటు ప్రజలకు తలనొప్పిగా మారింది.  దాన్ని చూడగానే ప్రజలు భయపడుతున్నారు.  ఈ నోటే దేశంలో చిల్లర సమస్యను తెచ్చిపెట్టింది.  ఈ నోటువల్ల సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగాలేదని స్పష్టంగా  అర్థమవుతోంది.  చిన్న వ్యాపారాల మీద ఈ పెద్దనోటు ప్రభావం తీవ్రంగా ఉంది. తక్షణమే అయిదువందల నోట్లు దేశమంతా అమలులోకి వస్తే, నోట్ల సమస్య అతిత్వరగా సమసిపోతుంది. అన్ని బ్యాంకుల్లోనూ,  ఏటియంలలోనూ వంద, అయిదువందల నోట్లు విరివిగా పంపిస్తే, ప్రధాని ప్రయత్నం సఫలం అవుతుంది. 

"తెలుగు సినిమా"

పాత తెలుగు సినిమాలలో మంచి కథ, నీతి, మితిమీరని శృంగారం, వినసొంపయిన మధురమైన పాటలు, సున్నితమైన హాస్యం ఉండేవి. నాయికా నాయకులు నీతిని బోధించే పాత్రలు ధరించేవారు. అవినీతి, చెడుపై విజయంగా మంచి నీతిని ప్రబోధించేవారు. ఆ దిశగా రచయితలు కూడా రచనలు చేసేవారు. వాటి ప్రభావం సమాజంపై ఉండేది. మంచిని చూపించడంవల్ల ప్రజలకు సినిమాలపైన మంచి అభిప్రాయం ఉండేది. కానీ, నేడు వస్తున్న సినిమాలలో అతి జుగుస్సాకరమైన మాటలు, వస్త్రధారణ, సన్నివేశాలు, పోరాటాలతో దేశంలోని చెడునంతా నింపేస్తున్నారు. కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తున్నారే తప్ప, అన్ని వర్గాల పేక్షకులను ఉపయోగపడే సినిమాలను నిర్మించడం లేదు. దాంతో కుటుంబసమేతంగా సినిమాలు చూసే అవకాశం లేకుండా పోతోంది.

Thursday, 24 November 2016

మందుబాబుల ఆగడాలు అరికట్టాలి.


తెలుగు రాష్ట్రాలలో మందు బాబుల ఆగడాలు రోజురోజుకి మితిమీరి పోతున్నాయి. పట్టపగలే తప్ప తాగి వాహనాలు నడుపుతూ రోడ్లమీద వెళ్ళే పాదచారులని, వాహనదారులని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నారు. ఎన్నో రోడ్డ్ల ప్రమాదాలకు కారకులవుతున్నారు. రోడ్డు మీద వెళ్లేవారి పాలిట యమకింకరులుగా మారుతున్నారు. వీరి ఆగడాల వల్ల ఎన్నోకుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఎంతో మంది అమాయకులు దుర్మరణం పాలవుతున్నా... మందుబాబులలో ఇసుమంతయినా కనికరం కూడా కలగడం లేదు. అంతేకాదు తాగినమైకంలోఅసభ్యపదజాలంతో ప్రజలమీడదికి కలియబడుతున్నారు. వీరి వల్ల మహిళలు, ప్రజలు తీవ్రమైన ఆవేదనను, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. రానురాను వీరి ఆగడాలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. బైట ప్రజలే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఇది ప్రధాన సమస్యే! ప్రభుత్వాలు మద్యం ఆదాయం చూసుకుంటున్నాయి తప్ప, ప్రజల కష్టనష్టాలను గురించి ఆలోచించడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని జరిమానాలు విధించినా మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు తాగి వస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు. తాగి సేల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్ట్టు ధరించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల భాధలను అర్థం చేసుకొని మద్యం దుకాణాలను పగటి పూట మూయించి, రాత్రి ఏడు గంటల తర్వాత మాత్రమే తెరిచే విధంగా చర్యలు తీసుకుంటే మందుబాబుల ఆగడాలకు కొంతవరకైనా అడ్డుకట్ట వేయవచ్చు.


Monday, 21 November 2016

పవిత్రమైన కార్తిక మాసం



తెలుగు మాసాలలో కార్తిక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుంది భక్తుల నమ్మకం.  కార్తిక  మాసంలో శివుడికి అభిషేకములు, మారేడుదళాలు  సమర్పించినా  శివ కటాక్షం లభిస్తుందంటారు. ఈ మాసంలో కార్తిక స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్ర పారాయణం, పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.



Sunday, 13 November 2016

బాలల సంబురం !


నేటి బాలలు ...రేపటి మేధావులు !
వీరే మనదేశ భవిషత్తు ...మన దేశ సంపద!!
అందుకే బాల్యానికి భద్రత కల్పిద్దాం
పసిమొగ్గలను జాగ్రత్తగా కాపాడుకుందాం
బాలల దినోత్సవం  సందర్భంగా...
చిన్నారులందరికీ శుభాకాంక్షలు !




శివార్చన...!

 

తెలుగు మాసాలలో కెల్లా కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది. కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది సోమవారం. శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని,  విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుందని,  రుద్రాక్షరాలను స్పర్శిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

        ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ

Thursday, 13 October 2016

ఏమిటమ్మా ఈ డ్రస్సులు !


కాజిలమ్మ ....ఏమిటమ్మా  ఈడ్రస్సు ? ఇన్నాళ్ళు అదిరేటి డ్రస్సులేసి ప్రేక్షకులను మురిపించి, మైమరపించావు.  ఇప్పుడేమో చాలిచాలని బట్టలతో అలరించాలని చూడటం నీకు భావ్యమా ? మీ చిత్తం మా భాగ్యం అన్నట్టుంది.  



Monday, 10 October 2016

సర్వశక్తి స్వరూపిణి

కోట్లానుకోట్ల జీవరాశులల్లో ఉండే జీవరూపశక్తి, సకల సృష్టికి కార్యకారణరూపిణి అయిన ఆదిపరాశక్తి...దుర్మార్గుల పై విజయఢంకా మోగించి, అఖిలలోకాలచేత కీర్తించబడే సర్వశక్తి స్వరూపిణి కనకదుర్గ.  సర్వ సృష్టిని సస్యశ్యామలంగా చేసే తల్లి కనుక శాకంబరీదేవిగా  కూడా పిలవబడుతూ, శరన్నవరాత్రులల్లో ఆదిపరాశక్తిని తొమ్మిది అవతారాల్లో పూజించి, పదవరోజు శివశక్తుల కలయికగా శ్రీరాజరాజేస్వరీదేవిని స్తుతిస్తాం.  సృష్టిలోని  ఆణువణువూ అమ్మ ప్రతిరూపమే. ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత. ఆమె సృష్టిలయకారిణి...జగదేకస్వరూపిని...సకలచరాచరణి.   వీరత్వానికి ప్రతీకయినా దుర్గాదేవిని ఎన్ని విధాలుగా, ఎన్ని రూపాలుగా కీర్తించినా, అర్చించినా అవన్నీ ఆదిపరాశక్తి జగన్మాతకే చేరుతాయి.  

         మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు !
  

Sunday, 9 October 2016

"బతుకమ్మ పండుగ "



దేవిశరన్నవరాత్రులలో  ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ.  అసమానతలను ఎదురిద్దాం...ఆత్మగౌరవంతో బతుకుదాం అంటూ ఆడపడుచులు ఉత్సాహంగా , ఆనందంగా ఎంతో సంబరంగా  ఈ పండుగను జరుపుకుంటారు. ముత్తయిదువులంతా గౌరీదేవి దీవెనలను కోరుతూ... తమ మాంగల్య సౌభాగ్యం చల్లగా ఉండాలని ప్రార్థిస్తే, యువతులు తమకు మంచి భర్త లభించి,  దాంపత్య జీవనం సుఖసంతోషాలతో సాగాలని వేడుకుంటారు.  బతుకమ్మ పండుగ  వచ్చే సమయానికి చెట్లు ఆకులతో అల్లుకుపోతాయి.  భూమి పచ్చదనం పర్చుకుంటుంది.  బతుకమ్మను తయారుచేసే తంగేడు, మునుగు, బంతి, చామంతి, గన్నేరు, జిల్లేడు, తామర, గుమ్మడి, గడ్డి పువ్వులు లాంటి రంగురంగుల పూలు వికసిస్తాయి. కుల, మతాలకతీతంగా  వాడవాడలో జరుపుకునే బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని, మహిళలను గౌరవించాలని.

Saturday, 1 October 2016

మహాత్ములు నేర్పిన పాఠాలు ... మనకు మార్గదర్శకాలు !



దేశంలోశాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషిచేసిన మహాత్మాగాంధీ గారు  చూపిన బాటలో పయనిద్దాం....  మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం.....  దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం !

స్వచ్చమైన పరిపాలన అందించి, మచ్చలేని ప్రధానమంత్రిగా.... పొట్టివాడయినా మహాగట్టివాడని అందరి మన్నలను పొందిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని గుర్తుచేసుకుందాం.  ఈ తరంవారికి తెలియచేద్దాం !

 మహాత్ములు నేర్పిన పాఠాలు ... మనకు మార్గదర్శకాలు !


 

Sunday, 18 September 2016

ఉగ్రఘాతుకం


మనదేశ రక్షణకోసం నిరంతరం శ్రమిస్తున్న మన సైనికులను దొంగచాటుగా దేబ్బదీసిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. మనకోసం, మనదేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవానుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతిని తెలియచేద్దాం!


Wednesday, 14 September 2016

"జలధారలు"


వరునిదేవుడి కుండపోత ...నింగినుండి నేలవరకు జలధారలు... మూడురోజుల నుండి ఇదే తీరు.  ఆకాశం నల్లని మేఘాలతో భూమి మీదికి విరుచుకుపడుతోంది.  భూమి మీద ఉన్న అన్ని కాలుష్యాలను ప్రక్షాళన చేసే వరకు విశ్రమించకూడదని ఒట్టు పెట్టుకున్నట్టు... వరుణుడు తన ప్రతాపం  చూపిస్తున్నాడు.  పుడమి పులకరించి... చెరువులు జలకలతో మెరుస్తుంటే, పచ్చని చేలు  మురుస్తున్నాయి.

 

Monday, 12 September 2016

నిశ్శబ్ద వానజల్లులు !


నల్లటి మబ్బులు కమ్మలేదు 
అయినా నీలిమేఘాలు వర్షిస్తున్నాయి 
ఉరుములు, మెరుపులు లేవు
కానీ, ప్రశాంత గగనంలోంచి ...
నిశ్శబ్ద వానజల్లులు  జాలువారుతున్నాయి
చిటపటచినుకులతో  ప్రకృతి పరవశించింది  
చల్లని వాతారణానికి మేను పులకించింది !

 

త్యాగానికి చిహ్నం 'బక్రీద్'



ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది.  అలాంటి సందేశాత్మక పండుగలలో మంచికోసం, మానవ సంక్షేమం కోసం పాటుపడుతూ త్యాగానికి ప్రతీతగా భక్తిభావంతో జరుపుకునే పండుగ 'బక్రీద్'.  ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ  త్యాగం, పరోపకారం లాంటి  సుగుణాలను అలవరచుకోవాలని కోరుకుంటూ, మిత్రులందరికీ 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు !

Friday, 9 September 2016

నిత్యానందుడు !


దివ్యస్వరూపుడు... విఘ్నేశ్వరుడు
విఘ్నాలను హరించే ఓంకార స్వరూపుడు
మట్టితో మలచబడ్డ మా అపార్ట్ మెంట్ 
గణనాథుడు...నిత్యానందుడు !


"నిజమైన భక్తి"

 
పుణ్యమంతా తమకే దక్కాలనే ఉద్దేశంతో కొందరు 'భక్తి' అనే ముసుగులో అంగరంగ వైభోగాలకు, ఆడంబరాలకు వెళుతూ ఉంటారు.  దీనికి కారణం మన చుట్టూ ఉన్న వాతావరణం, అవగాహనారాహిత్యం.  ఇలాంటి భక్తి ఎప్పటికీ నిజమైన భక్తి అనిపించుకోదు.   హృదయంలో నిత్యం  భగవంతుడిని నిలుపుకొని పత్రమో, ఫలమో, పుష్పం లేదా నీటినిగాని భక్తితో భగవంతుడికి సమర్పించిన వారికి భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది.  అంతేకాదు ఎదుటివారిని గౌరవిస్తూ, వారిలో దేవుడ్ని చూడటమే  నిజమైన భక్తి.  నన్ను మించిన వారు లేరు  అనే అహంభావం, మంచి  చెడ్డల్ని విస్మరింపచేసే అహంకారంతో ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు. 

Sunday, 4 September 2016

"మట్టి గణపతే...మహాగణపతి "



ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం.  ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు.  అందుకే వినాయకచవితి నాడు నీటిలో కరిగే మట్టి విగ్రహాన్ని పూజించాలి... పర్యావరణాన్ని పరిరక్షించాలి.  కొండంత దేవుడుకి కొండంత పత్రి సమర్పించాకపోయినా ఫలమో, పత్రమో ఏదో ఒకటి స్వామికి నివేదిస్తే చాలు గణనాధుడు తృప్తి చెందుతాడు.  పర్యావరణ పరిరక్షణతో పాటు జలవనరులు, జీవరాసుల పరరక్షణ, మానవుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సహజసిద్ధమైన రంగులతో వినాయక విగ్రహాలను తయారుచేయడం వల్ల నీటిలో నివసించే జీవరాసులకు ముప్పు వాటిల్లదు.  మనం తినే ఆహారం, నీరు కలుషితం కాకుండా ఉంటాయి.   గణపతిని పూజించేందుకు ప్రకృతిలో లభించే ఆకులు, పువ్వులు, పండ్లను వినియోగిస్తాం.  వినాయక ప్రతిమలను మాత్రం ప్రమాదకరమైన రసాయానక రంగులతో తయారు చేస్తున్నారు.  భగవంతుడు ప్రమాదకరమైన రంగులను కోరుకోడు....ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన రంగులనే ఇష్టపడతాడు.   మట్టితో చేసి రంగులువేయని వినాయక విగ్రహాన్ని పూజించడం వలన  కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని, వ్యవసాయాభివృద్ది కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.

    మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!

 

Monday, 29 August 2016

మా తెలుగు తల్లికి మల్లెపూదండ !



మా ఆఫీసులో పనిచేసే వారంతా తెలుగువారే. కాని, తెలుగు మాట్లాడితే తమ హొదాకు భంగమనుకుంటారు. ఆంగ్లంలో మాట్లాడితే గొప్పగా భావిస్తూ, తెలుగు మాట్లాడేవారిని చూసి నవ్వుకుంటారు.  ముద్దులొలుకు తెలుగు పదాలను హేళన చేస్తుంటారు.  పరభాషా వ్యామోహంలో పడి,  మన తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు. తెలుగు భాషలోని తియ్యదనం ఇలాంటివారికి ఎంత చెప్పినా చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లు అవుతుంది. కట్టు, బొట్టు తెలుగువారిదయినప్పుడు  తెలుగులో మాట్లాడటం అవమానంగా భావించడం ఎందుకు? గొప్పలకుపోయి  మాతృభాషను కించపరచడం ఎందుకు? ఇలాంటివారివల్ల తెలుగు సంస్కృతులు, ఆచారవ్యవహారాలు మాయమైపోతున్నాయి.  'మధురమైన తెలుగు  భాషలోని  పలుకులు తేనెలొలికే గులికలని' ప్రతి తెలుగుపదం వీనులవిందుగా, వినసొంపుగా ఉంటాయని మన తెలుగువాళ్ళు తెలుసుకొనే రోజు రావాలి. 

      "ముద్దులొలుకు తెలుగు భాష అందం .... వాడని మల్లెల సుగంధం"  

Sunday, 21 August 2016

"పుష్కర స్నానం"



అవినీతికి పాల్పడుతూ....మోసాలు, నేరాలు చేసి నదిలో మునకేస్తే చేసిన పాపాలు తొలగిపోతానుకోవడం ఒట్టి భ్రమ.  సమాజంలో ఎవ్వరికి ఏ హాని తలపెట్టకుండా మనసును పవిత్రంగా ఉంచుకుని పుష్కర స్నానం  చేస్తే, ఫలితం తప్పకుండా దక్కుతుంది. పుష్కర స్నానాలు ఆచరించేవారు మనసును పవిత్రంగా ఉంచుకుని,  జలాన్ని కలుషితం చేయకుండా మూడు మునకలేసి   నదికి నమస్కరించి బయటకి రావాలి.  మనసును నిర్మలంగా ఉంచుకొని,  ఈర్ష్య అసూయలకు  తావు ఇవ్వకుండా పుష్కర స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది.... పుణ్యం లభిస్తుంది.   శరీరాన్ని శుభ్రం చేసుకుని, మనసులోని మలినాన్ని కడిగేసుకోకపోతే ఎన్ని పుష్కర స్నానాలు చేసినా నిష్పలం అవుతుంది.  



Wednesday, 17 August 2016

"అన్నాచెల్లెల అనుబంధం ... రక్షాబంధన సుగంధం"



శ్రావణ పౌర్ణమి  నాడు సోదర అనుబంధాల్ని గుర్తు చేసే ఆత్మీయానురాగాల పండుగ రాఖీ పండుగ.  భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి.  ఈ రోజున సోదరి, సోదరుడికి కట్టే రక్షణ కవచం రాఖీ.  మహిళలకు రక్షణగా నిలవడడమే ఈ పండుగ ఉద్దేశం.  స్త్రీల పట్ల సోదరభావం, పవిత్రభావం ప్రతి ఒక్కరిలో కలగాలి. సమాజంలో తనకు పూర్తి రక్షణ ఉందన్న నమ్మకం ప్రతి మహిళలో కలిగించాలి.  
   "అన్నాచెల్లెల అనుబంధం ... రక్షాబంధన సుగంధం"

 


తీపి కబురు !




ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో మన దేశానికి తోలి పతకం సాధించిపెట్టిన తొలి మహిళ 'సాక్షిమాలిక్' కి అభినందనలు తెలియచేద్దాం !

Friday, 12 August 2016

మంగళప్రదం... సౌభాగ్యప్రదం...వరలక్షి వ్రతం !


వరలక్ష్మి వ్రతం మహిళలందరికీ మంగళప్రదమైనది...ఎంతో శుభదాయకమైనది.  సౌభాగ్యప్రదమయిన శ్రావణమాసంలో   మహిళలు భక్తిశ్రద్ధలతో చేసే వ్రతం శ్రవణ శుక్రవార వ్రతం.  ఈ మాసంలో వరలక్ష్మి పూజ, శుక్రవార వ్రతం  చేస్తే, ఆయురారోగ్య ఐశ్వర్యాలనిస్తాయి.  శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే శుక్రగ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయని మహిళలు నమ్ముతారు.   ఈ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.  

Monday, 8 August 2016

చూపుల్లో నిలిచావు !



సుప్రభాతవేళ ...
పువ్వులోని మాధుర్యాన్ని 
ఆస్వాదించే తుమ్మెదలా ...
నీటి అలల పైన 
విహరించే రాజహంసలా ...
కొలనులో విరిసిన
అందమైన తామర పువ్వులా...
కన్నుల్లో మెరిసావు
చూపుల్లో నిలిచావు 


Monday, 18 July 2016

అందమైన దృశ్యం !


చిరుజల్లుల సందడిలో ...
హాయినిచ్చే ఆహ్లాదమైన
చల్లని వాతావరణంలో ...
ఉల్లాసంగా ...ఉత్సాహంగా ...
ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ...
వరినాట్లు వేస్తున్న రైతు బిడ్డలు !
ఈ అపురూపమైన దృశ్యం ...
అచ్చమైన పల్లెతనానికి 
స్వచ్చమైన చిరునామా !!

 

Wednesday, 6 July 2016

పరమ పవిత్రం ...రంజాన్ పర్వదినం !



రంజాన్ పేరు వినగానే హృదయంలో భక్తిభావం ఉప్పొంగుతుంది. సమస్త శుభాలతో ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళిస్తాయి.   ఈ మాసమంతా ముస్లిం సోదరీసోదరులకు అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ పండుగకు ఇంతటి గౌరవం, పవిత్రత.  నెల రోజులపాటు పవిత్ర ఉపవాసాలు ఆచరిస్తూ... ఎంతో దీక్షతో వీనులవిందుగా ఖురాన్ పారాయణ చేస్తారు. అనాధులకు, ఆర్తులకు దానధర్మాలు చేస్తారు.  మాసంలో చివరి రోజున ఉపవాసాలు ముగించి ఆనందం విరిసిన హృదయంతో రంజాన్ పండుగను అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాలతో శోభాయమానంగా  జరుపుకుంటారు. ఇఫ్తార్  విందుకు ఇతరులను ఆహ్వానించి సమైఖ్యతను,  మతసామరస్యాన్ని చాటుకుంటారు.  

 రంజాన్ పర్వదిన శుభసందర్భంగా...మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు !  

Sunday, 3 July 2016

దాంపత్యం !


దంపతుల మద్య కలహాలు నీటిలో కెరటాల్లాంటివి. అవి అలా వచ్చి ఇలా పోతుండాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న కలహాలు వస్తేనే ఒకరినొకరు  అర్థం చేసుకోగలిగితే వాళ్ళ అనుబంధం మరింత దృఢమై అన్యోన్యంగా ఉండగలుగుతారు.   అయితే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఆరోగ్యకరంగా ఉండాలి. చిలికి చిలికి గాలివాన కాకుండా జాగ్రత్త పడాలి.  కొందరు 'మా దంపత్యజీవితంలో గోడవలు లేవు' అని గొప్పలు చెబుతూ ఉంటారు. ఇది పచ్చి అబద్దం. ఎందుకంటే భార్యాభార్తలన్నాక ఏదోక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అసలు కలహాలు లేని దాంపత్యం ... దాంపత్యమే కాదు. సంసారంలో అలకలు, బ్రతిమాడుకోవడాలు ఉంటేనే, దాంపత్యానికి నిండుదనం వస్తుంది. ఆలుమగల బంధం జీవితకాలం కొనసాగాలంటే, వారి మధ్య వచ్చే కలహాలు హుందాగా ఉండాలి.  అప్పుడప్పుడు వచ్చే ఘర్షణను మాటలవరకే పరిమితం చేస్తే,   దాంపత్య జీవితంలో చక్కని ఫలితాలను పొందగలుగుతారు.


Friday, 1 July 2016

"అహంకారం"

అహంకారం, మొండితనం, మూర్ఖత్వం  ఇవి తీవ్రమైన మనోరుగ్మతలు.  మనిషిలో అహంభావం ఉన్నంతవరకు ఎవరినీ ప్రేమించలేరు.  అహంవల్ల ఎదుటివారు తన కన్నా తక్కువవారిగా కనిపిస్తారు.  స్వార్థబుద్ధి వెంటాడుటం వల్ల నీచమైన అలవాటు మనసులో చోటుచేసుకుంటుంది. అలా కాకుండా ఉండాలంటే, అహంకారపూరిత మాటలకు, చేతలకు దూరంగా ఉంటూ, మనసును మల్లెపువ్వులా మలచుకోవాలి.  'నేను' అనే అహంకారానికి, 'నాది' అనే మమకారానికి స్వస్తి పలకాలి.



Wednesday, 29 June 2016

పవిత్రమైన తులసి !


భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేకస్థానం ఉంది. హిందువులు తులసిని పరమ పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు ఆరోగ్యప్రదాయని.... చక్కని ఔషదం కూడా. అది ఎన్నోమొండి రోగాలను నయం చేస్తుంది. రోజూ కొన్ని ఆకులు నమిలి మింగితే వ్యాధుల దరిచేరవంటారు. మనవ శరీరంలో శ్లేష్మం పెరిగి శ్వాస ఆడక ప్రాణం పోతుంటే, తులసి తీర్థం తగిలి శ్లేష్మం విరిగి మనిషి బ్రతికిన సందర్భాలున్నాయి. అందుకే మనిషి తుదిశ్వాస విడిచేటప్పుడు తులసి తీర్థం గొంతులో పోస్తారు. ఇంత పవిత్రమైనది కాబట్టి దేవాలయాలలో భగవంతుని తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు.


Wednesday, 22 June 2016

ప్రేమ ఎంత మధురం !



ప్రేమ మధురాతిమధురం. అది అమృతంతో సమానం.  సంజీవని వంటి ప్రేమను ఎంత పంచినా తరగదు.  అది అక్షయ పాత్రలా  సర్వత్రా నిండుదనాన్ని సంతరించుకొంటుంది.  అనంతమైన ప్రేమకు అంతం ఉండదు.  అది ఎప్పుడూ కరుణ అనే  సువాసనభరిత  పుష్పంలా వికసిస్తూ.. దివ్య సుగంధంలా  గుబాలిస్తూ ఉంటుంది.   

   
                 

Friday, 17 June 2016

మానవత్వం !

ఉన్నతమైన వ్యక్తిత్వం, సేవాగుణం వల్లనే మనిషికి సమాజంలో గౌరవం పెరుగుతుంది.  ఎదుటి వ్యక్తి  నుంచి గౌరవం పొందాలనుకునేవారు ముందుగా తామే ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోవాలి.  మల్లెపువ్వు సువాసన అందర్ని అలరించినట్టు, మానవత్వం కారణంగానే మనిషి అందరి మనస్సుల్లో నిలిచి ఉంటాడు.  మనిషి మనుగడ సవ్యంగా సాగాలంటే, నీతి  నిజాయితీ తప్పకుండా పాటించాలి.  మనిషి ఎంత ఎత్తు  ఎదిగినా వినయం, విధేయత, నీతి  నిజాయితీలను వీడరాదు.  నియమ, నిబద్దలతో జీవిస్తే మనిషిజన్మ ధన్యమవుతుంది.    

Sunday, 12 June 2016

సోమవారం శివదర్శనం ...సర్వపాపహరణం !



పంచభుతాత్మక స్వరూపుడు మహాశివుడు.  అందుకు పతీకలే ఈ పంచభూత లింగాలు.  పృధ్వీలింగం, అరుణాచలేశ్వరలింగం, జలలింగం, వాయులింగం, ఆకాశలింగంగా  పరమేశ్వరుడు ప్రకాశిస్తూ...విశేష పూజలు అందుకుంటున్నాడు.  

Tuesday, 7 June 2016

" మహనీయుడు "


బాటసార్లుకు చల్లదనం కోసం, స్వచ్చమైన గాలి కోసం   రోడ్లకు ఇరువైపుల అశోకుడు  చెట్లను నాటించాడు.  భూగర్భ జలాలను పెంచేందుకు,  పంటలు పండించేందుకు  ప్రతి గ్రామానికి చెరువులు,  మంచినీటి కోసం బావులు తవ్వించాడు.  ప్రకృతి రమణీయత,  పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేశాడు.  ఆయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లేవారని చరిత్ర చెబుతోంది.  ఆయన చేసిన సేవలు మరువలేనివి.  అందుకే ఆయన మహనీయుడు.  కేవలం ప్రచారం,  ప్రసంసల కోసం కాకుండా  అశోకుడిలా మన నాయకులు కూడా ప్రజల కోసం నిజమైన సేవ చేస్తే ఎంత బాగుండును. 

Saturday, 4 June 2016

ప్రకృతిని కాపాడుకుందాం !


కొందరు ఆధునిక అవసరాల పేరుతో కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు. మరికొందరు ధన సంపాదనకోసం నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ అత్యంత దయనీయంగా, క్రూరంగా పెనువిద్వంసం సృష్టిస్తున్నారు.  ఇంకొందరు నిర్ధాక్షణంగా చెట్లను నరికేస్తూ, వ్యర్ధాలను నలువైపులా వెదజల్లుతూ, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నారు.  ఇలా సహజవనరులను హరించేస్తూ, జంతువులను, పక్షులను నాశనం చేస్తూ ప్రకృతి వినాశనానికి ఇదొక విధంగా కారణమవుతున్నారు.   ఫలితంగా తుఫానులు, భూకంపాలు! మన కళ్ళను మనేమే పొడుచుకుంటూ...  మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం. ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు రెక్కలు తెగిన పక్షుల్ల విలవిలాడుతున్నాయి.  పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం... భూమిని భూమిలా ఉండనిద్దాం... చెట్లను చెట్లగా బ్రతకనిద్దాం... నదులను నదులుగానే పారనిద్దాం ... మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !
  

" శ్రీవారి దివ్యరూపం "


కోరిన వరాలిచ్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి  విగ్రహం ఆగమాలకు అందని రూపం.  వక్షస్థలంపై కౌస్తుభం, చేతికి నాగాభారణాలు, ఆలయ గోపురంపై శక్తి వాహనమైన  సింహం ... ఇలా విభిన్న దేవతా చిహ్నాలు కలిగిన దివ్య మనోహర రూపం తిరుమలేశుని ప్రతిమ. 

Friday, 3 June 2016

" ప్రజల మనిషి "


ప్రేమతో పలకరించడం ...
పదిమందికి చేయూత నివ్వడం ...
శ్రీ కృష్టదేవరాయుల వారి సొంతం !
వారి పాలన సత్యం, దర్మం,
శాంతం, ప్రేమలకు ఆదర్శం !!

Saturday, 28 May 2016

"నట సింహం"

         
 "నందమూరి తారక రామారావు" ఈ పేరే ఒక సంచలనం... ఒక ప్రభంజనం. ఆ పేరు మంచి మానవతల మేలు కలయిక. పట్టుదల, కార్యదీక్ష ఆయన సొత్తు. తెలుగు వారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రేక్షకులే ఆరాధ్య దైవం అని భావించే నందమారి చేసిన ప్రతి విన్యాసం జనబాహుళ్యాన్నిపొందింది. సినిమా రంగంలో ఆయన పాటించిన క్రమ శిక్షణ ఎందరికో మార్గదర్శకం అయింది. నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగుజాతి మన్నలను పొంది, సాంఘీక, జానపద,పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, తెలుగు సినీమానవ సరోవరంలో నిరంతరం విహరించిన నట సింహం నందమూరి తారక రామారావు. తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస పరిమళ భరిత పారిజాతపుష్పం. నమ్మిన వారిని ఆదరించడం, ఆత్మీయతను పంచడంలో ఆయనకు మరెవ్వరూ సాటిరారు. 1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధినే 'డీ' కొని, ఖండాంతరాలకు తెలుగు మాధుర్యాన్ని చవి చూపించిన యోధుడు. అటు సినీరంగంలోనూ...ఇటు రాజకీయరంగంలోనూ తనదైన ముద్ర వేసిన రామారావుగారు సామాన్యుడు కాదు...ఒక మహాశక్తి. ఎన్నో విశిష్టలున్న మహామనిషి. సినీరంగంలో శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా, కర్ణుడుగా, దుర్యోధనునిగా, రావణాసురుడుగా ఆ పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్ చైర్మన్ గా, జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం అధిరోహించారు. మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.
          మరపురాని మరువలేని మహా నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి (మే 28) సందర్భంగా....