”శోధిని”

Friday, 28 March 2014

గురువును మించిన శిష్యుడు!


ఆరోజు పంతులమ్మ-- పక్షుల గురించి పాఠం  చెబుతూ ...
" ప్రవీణ్ ...! నేను చెప్పిన పాఠం  అర్థమయిందా?"
" బాగా అర్థమయింది టీచర్"
"అయితే నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పరా!"
"అడగండి టీచర్"
"గుడ్డులోంచి కోడిపిల్ల ఎలా బైటకు వస్తుంది? "
"గుడ్డులోకి కోడిపిల్ల ఎలా వెళ్ళిందో  మీరు చెప్పలేదు టీచర్?"
విద్యార్ధి అమాయకంగా  అడగడంతో అవాక్కవడం  పంతులమ్మ వంతయింది.

  

Tuesday, 25 March 2014

మంచి నాయకులను ఎన్నుకోండి !

ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే సిబ్బంది సమయానికి రారు... లేటుగా వచ్చినా సీట్లో కనిపించరు...ఒకవేళ కనిపించినా చేతులు తడవందే పని ప్రారంభించరు. ఇదీ మన రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల పరిస్ధితి.  చివరికి ఆఫీసర్ సంతకం అయిన తర్వాత కూడా  స్టాంప్ వేయడానికి  చేతులు చాపుతున్నారంటే ముమ్మాటికి ఇది  మన పాలకుల వైఫల్యమే.  నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులలో క్రమశిక్షణతో పాటు భయం కూడా ఉండేది.  ఉద్యోగి పోరపాటున కూడా చూయి చాపడానికి జంకేవాడు. కాని, నేడు తాము ప్రజల సేవకులమని మరచి దర్జాగా అవినీతికి పాల్పడుతున్నారు.  ఉద్యోగంలో కొత్తగా చేరుతున్న  యువకులు సైతం అదే బాటలో నడుస్తుంటే.. ఇక ఈ వ్యవస్థను కాపాడేదెవరు? అందుకే యువతీయువకుల్లారా  ఎన్నికల పైన దృష్టి పెట్టండి... ప్రజలల్లో విద్వేషాలను పెంచే నాయకుల భరతం పట్టండి.  ఓటు హక్కు వినియోగంలో అజాగ్రత్త వహిస్తే... ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని గుర్తించండి.  ప్రతి ఇంటిలోనూ, ప్రతి గ్రామం లోనూ ఓటు విలువను గురించి ప్రజలకు తెలియజేసే భాద్యతను తీసుకోండి.  కులం, మతం, ప్రాంతం, పార్టీలను చూడకుండా మంచి వ్యక్తులకు ఓటు వేయించేవిధంగా  కృషి చేయండి.  మోసగాళ్ళ ఉచ్చులో చిక్కుకున్న ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకురండి.  ప్రజలలో మార్పు వచ్చినప్పుడే మంచి నాయకులు ఎన్నుకోబడతారు.  మంచిపాలనను చూడగలుగుతాం. 

Thursday, 20 March 2014

దాచావంటే... దాగదులే !

 

 

విలేఖరి       : "మీరు ఏదీ దాచుకోకుండా నటిస్తారని

                       ప్రేక్షకుల వాదన... మీరేమంటారు ?"

హీరోయిన్  :  "వాళ్ళ వాదన తప్పంటాను !"

విలేఖరి      :  "ఎలా చెప్పగలుగుతున్నారు?"

హీరోయిన్  :  "ఇప్పటి వరకు నా వయసెంతో ఎవ్వరికీ

                     తెలియకుండా దాచాను ... ఇది చాలదా     

                     నేనెంత దాస్తున్నానో ...!"

                 

విలేఖరి     : ఆ (... !

Saturday, 15 March 2014

సరదాల రంగుల హోలీ...!


పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ  ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా జరుపుకునే సరదా పండుగ హోలి.  వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి.  సంప్రదాయ బద్దమైన రంగుల పండుగ కాబట్టి  రంగు వచ్చే రకరకాల పూలతో, ముఖ్యంగా మోదుగ పూలతో తయారు చేసుకున్న రంగులతోనే హోలి జరుపుకోవడం ఉత్తమం.  కృత్రిమ రసాయనిక రంగులు వాడి చర్మ వ్యాధులు తెచ్చుకోవడం మూర్ఖత్వం.  అంతేకాదు రసాయనిక రంగులు వాడటం వలన కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉందని మరచిపోవద్దు.  రంగులు చల్లుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటూ,  సున్నితమైన రంగులతో సరదాగా కాసేపు ఆడుకుని, ఆవెంటనే వంటికి అంటిన రంగుల్ని తొలగించుకోండి.  ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ హోలి పండుగను ఆనందంగా జరుపుకోండి.

                        అందరికీ హోలీ శుభాకాంక్షలు!

Thursday, 13 March 2014

పనిమనిషి ---- యజమానురాలు !

యజమానురాలు : "నేను ఇచ్చిన చీరలు కట్టుకుని పనిలోకి రావద్దు...  తెల్సిందా?"
పని మనిషి : "అదేంటి అమ్మ గారు... అలా అనేశారు!"
యజమానురాలు : "అదికాదే పిచ్చి మొద్దు... మా వారిది వట్టి  వంకరబుద్ధి.  కావాలనే నిన్ను కౌగలించుకొని,'మీ అమ్మగారు అనుకున్నాను'  అంటాడు" అసలు విషయం చెప్పింది.


Sunday, 9 March 2014

మన తెలుగువాడు !


పక్కవాడి ఎదుగుదలను 
జీర్ణించు కోలేనివాడు 
తన మాటే వినాలనే 
అహంభావం కలవాడు 
ఏదోవిధంగా ఎదుటివారిని 
అవమానించడానికో... 
భాదించడానికో... 
నిరంతరం ప్రయత్నించేవాడు 
వాడే ... మన తెలుగువాడు!
 

Friday, 7 March 2014

అంతర్జాతీయ మహిళా దినోత్సవం !



'స్త్రీ' అంటే ఓర్పు, సహనం, ప్రేమ, అణకువ, ఆప్యాయత, త్యాగం, అనురాగం.  తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచి జీవితయాత్ర ముగిసే వరకు ఎన్ని కష్టాలు  ఎదుర్కొన్నా...  తన పైనే ఆధారపడి జీవిస్తున్న  పురుషుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం నిజంగా పురుషుల అదృష్టం.  అందుకే ఆమెను త్యాగమూర్తి అన్నారు.  ప్రకృతి స్వరూపిణి అయిన  స్త్రీకి కష్టం కలిగించినవాడు బ్రతికి బట్ట కట్టలేదు.  దాని పర్యావసారం చాలా తీవ్రంగా ఉంటుంది.  ఏ  గృహంలో స్త్రీ కన్నీరు పెడుతుందో అక్కడ సిరిసంపదలు తొలగిపొతాయి. ఎక్కడయితే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువయి ఉంటారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా సమైక్య శక్తులుగా, సాహస మూర్తులుగా ఉద్యమించాలని కోరుకుంటూ...

అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!