”శోధిని”

Saturday, 27 June 2015

విమాన వెంకటేశ్వర స్వామి

తిరుమలలో శ్రీవారిని దర్శించి బయటకు వచ్చేటప్పుడు ఉత్తర దిశలో "విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించండి" అని బాణం గుర్తు చూపుతూ బోర్డు ఉంటుంది.  విమాన వెంకటేశ్వర స్వామికి వెండి మకర తోరణాన్నిఏర్పాటుచేయడాన్నిగమనించవచ్చు.  విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే,  మూలవిరాటైన శ్రీవారిని దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.  సరిగా స్వామివారి దర్శనం కలగనప్పుడు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించవచ్చు.


Friday, 26 June 2015

ఆహ్లాదం !


నీలాకాశంలో నీలిమబ్బులు
కదలాడుతున్న వేళ...
చల్లని గాలులు మేనును తాకగా...
చిరుజల్లులు అక్షింతలై పలకరించగా ...
ఆహ్లాదకరమైన వాతావరణం
నయనానందకరం !

Sunday, 21 June 2015

మార్గదర్శకం !


అమ్మ మనసు...
మల్లెలంత తెల్లదనం !
నాన్న హృదయం...
వెన్నెలంత చల్లదనం !
అమ్మ మమకారం...
నాన్న సహకారం !
అమ్మ త్యాగం...
నాన్న అభయం !
తల్లి దీవెన...
తండ్రి ఆదరణ !
అమ్మ తోడు...
నాన్న నీడ !
అమ్మతో  సమానంగా
ప్రేమను పంచే  ఆదర్శముర్తి నాన్న!
బిడ్డలకు మార్గదర్శకం నాన్న !!

యోగామృతం !



'యోగ' అనేది ఏ మతానికో, సంస్కృతికో సంబంధించింది కాదు.  ఇది  సర్వజనుల శరీర ఆరోగ్యానికి సంబందించినది.  మనిషి ఒత్తడిని తగ్గించి, శరీరానికి, మనసుకు  అవసరమైన ప్రశాంతతను అందించే సంజీవిని.  ప్రకాశవంతమైన ప్రేమకాంతిని వెదజల్లి, వ్యక్తి చుట్టూ ప్రశాంతమైన, పరిపూర్ణమైన వాతావరణాన్ని కలిగించే అమృతవాహిని.  అంతేకాకుండా  అసూయ, ద్వేషం, భయం, శోకం, దుఃఖం వంటి మానసిక ఆందోళనలను తగ్గించి  కుళ్ళు,  కుతంత్రాలను దూరం చేసే సంపూర్ణ ఆరోద్యప్రదాయిని.  శరీరాన్ని తేలిక పరచి జీవనశైలిలో మంచి మార్పును తీసుకొచ్చి, అనేక రుగ్మతలకు పరిష్కారం చూపే   గొప్ప సాధనం 'యోగ'.



Tuesday, 16 June 2015

కమ్మని మట్టి పరిమళాలు !


నింగి నిండా మేఘమాలికలు
కమ్ముకోగా మెరిసింది మెరుపు
ఆహ్లాదకరమైన చల్లని గాలులు
ప్రకృతి అంతా విస్తరించగా ...
వెలసింది సప్తవర్ణాల హరివిల్లు !
ఆ అపురూప దృశ్యాన్ని చూసి
దేవతలు అక్షింతలు చల్లి దీవించినట్లు
నింగి నేలను కలుపుతూ...
కురిశాయి తొలకరిజల్లులు !
పుడమితల్లి ఆనందంతో పులకించి
మట్టి పరిమళాలను వెదజల్లగా ...
కమ్మని వాసన పరిసరాలను
మురిపించింది ...మైమరపించింది!


Thursday, 11 June 2015

ముసుగు దొంగలు (జోక్)

మంత్రిగారి భార్య  తన భర్తతో కలసి న్యూస్ ఛానల్ చూస్తోంది.
బ్యాంక్ చోరి కేసు నిందుతులకు ముసుగేసి మీడియా సమావేశంలో ప్రవేశ పెట్టారు పోలీసులు.
మంత్రి గారి భార్య : ఏమండీ నాదొక అనుమానం
మంత్రి : ఏమిటది ?
మంత్రిగారి భార్య : పట్టుపడ్డ దొంగలకు ఇలా ముసుగేసి చూపించడం ఎందుకని ?
మంత్రి  : "పిచ్చి మొహమా ... పూర్వం నాకు కూడా ఇలాగే ముసుగేసి తీసుకెళ్ళారు కాబట్టి, ఇప్పుడు మంత్రినయినా  నన్నెవరూ గుర్తుపట్టడం లేదు"  అసలు విషయం చెప్పాడు మంత్రిగారు.