”శోధిని”

Tuesday, 24 April 2012

'మల్లీశ్వరి'



ప్రకృతి సోయగాల్ని, హృదయపు లాలిత్యాన్ని మేళవించిన పాటలు పరిమళిస్తాయ.  మనసున నిలిచి మధురానుభూతిగా మిగులుతాయి. 'మల్లీశ్వరి'  చిత్రంలోని ఈపాట ఈ కోవలోకే వస్తుంది. 

మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల  డోలలూగెనె
ఎంత హాయి ఈ రేయి నిండెనో 
ఎన్నినాళ్ళకి బ్రతుకు పండెనో 

కొమ్మలు గువ్వలు గుసగుస మనినా 
రెమ్మల గాలులు ఉసురుసురనినా 

అలలు కొలనులో గలగలమనినా 
దవ్వుల రేణువు సవ్వడు వినినా 

నువ్వు వచ్చేవని -నీ పిలుపే విని 
కన్నుల  నీరిడి కలయ చూసితిని

గడియ ఏని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయం పగుల నీకుమా 

ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో 
ఎంత హాయి ఈ రేయినిండెనో 

చిత్రం:    మల్లీశ్వరి 
రచన:    దేవులపల్లి కృష్టశాస్త్రి 
గానం:    భానుమతి 
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 

Saturday, 21 April 2012

భూమాతను రక్షించుకుందాం!



ఇవాళ ధరిత్రీ దినోత్సవం.
     నాయకులు కాలుష్యనివారణ గురించి ప్రసంగిస్తారు.  మొక్కల్ని నాటమంటారు.  ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమంటారు. కానీ, వాళ్ళు మాత్రం ఇవేమీ చేయరు. నీతులు చెప్పడం ఇతరుల కోసమేనని వాళ్ళ ఉద్దేశం కాబోలు.
                                                                                                                                    లక్షలాదిలా పెరిగిపోతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం దేశాన్ని  కలవరపెడుతున్న సమస్య. పెరుగుతున్న కాలుష్యంతో జీవన విధానం గతి తప్పుతోంది.                                                                                                  నగరాలలో పరిశ్రమలు విడిచి పెడుతున్న పొగ జీవ రాసులకు సెగగా మారింది. దీనికితోడు పెరిగిపోతున్ననగరీకరణ మరింత కాలుష్యరహితసమాజాన్నివృద్దిచేస్తోంది. లక్షలాదిలా పెరిగి పోతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం దేశాన్ని  కలవరపెడుతున్నసమస్య.  భూమి, నీరు, గాలి అన్నీ కలుషితమయి పోతున్నాయి. దీనికితోడు ప్లాస్టిక్ వినియోగం పరిసరాలకు, వాతావరణానికి, పర్యావరణానికి ప్రమాదకరమని తెలిసినా ప్లాస్టిక్ వస్తువులను విచ్చలవిడిగా వాడుతున్నారు.  ఏ నగరంలో చూసినా, ఏ యాత్రా స్థలంలో చూసినా ప్లాస్టిక్ దుర్గంధం పెచ్చరిల్లుతోంది. పెళ్ళిళ్ళలో వందలాది ప్లాస్టిక్ వస్తువులను వాడి పడేస్తున్నారు.  విందు వినోదాలపేరట ప్లాస్టిక్ ప్లేట్లు కూడా వచ్చాయి.  మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసి కుడా ప్లాస్టిక్ వినియోగానికి విపరీతంగా అలవాటు పడటం ధరిత్రికి పెద్ద వపత్తని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు.  ప్లాస్టిక్ వస్తువులు పచ్చదనాన్నినాశనం చేస్తున్నాయి. నీటిని కలుషితం చేస్తున్నాయి.అంతేకాకుండా పరిసరాలను విషపూరితం చేస్తున్నాయి.  

     ప్లాస్టిక్ లేని రోజుల్లో మన జీవన విధానం ఎలా ఉండేది ...మనకున్న ఉపకరనాలేమిటో గుర్తుకు తెచ్చుకుని ఎవరికి వారు ప్లాస్టిక్ వాడకం పట్ల తమకు తాము నిషేధం విధించుకోవాలి.  కాలుష్యకోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న భూమాతను రక్షించుకోవాలి.  మనిషి అప్రమత్తతే ధరిత్రికి బాసట.

Saturday, 14 April 2012

నాయకులు

కొందరు కీర్తి, పదవులకోసం....
మరికొందరు డబ్బు, అధికారం కోసం....
ఇంకొందరు భోగ బాగ్యాలను 
అనుభవించడానికి  మాత్రమే
రాజకీయాలలోకి వస్తున్నారు తప్ప,                                          అభాగ్యజీవుల  కన్నీటిని 
తుడవటానికి మాత్రం కాదు. 
ఇలాంటి వారిని బాగుచేయడం....
హుస్సేన్ సాగర్ ని శుభ్రం చేయడం....
ఎవ్వరి వల్ల కాదు.
ప్రజలే  వీరిపట్ల   అప్రమత్తతగా ఉండాలి. 



Wednesday, 11 April 2012

జలసంపద

రాష్ట్రంలో మంచి నీటికోసం సామాన్య ప్రజలు అల్లాడి పోతున్నారు. గొంతు తడుపుకోనేందుకు నీటి బొట్టు కోసం నానా అవస్థలు పడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.  నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్  చార్జీలు పెంచడంలో వున్నశ్రద్ధ  సామాన్య ప్రజలు త్రాగే మంచి నీటి పైన లేకపోవడం విచారకరం. అధికారుల నిర్లక్ష్యం , కొరబడిన పర్యవేక్షణ కారణంగా మంచినీటి సమస్య ఉత్పన్నమైంది.  కలుషితమైన నీరు త్రాగడం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది.  ఎన్నికల్లో రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు.  పారిశ్రామిక వేత్తలు లెక్కలేనంత నోట్ల కట్టలను దేవుని హుండీలో వేస్త్రారు కాని,ప్రజల అవసరాలు తీర్చే పనులకు ఒక్క పైసా కుడా  ఖర్చు చేయరు.  పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా,ఆయా సంబంధిత శాఖల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వాలను నమ్ముకుంటే రాబోయే తరాల వారికి మంచి నీరు అంటే ఏమిటో తెలియని  పరిస్థితి వస్తుంది.  అందుకే ప్రతి ఒక్కరు తమవంతు భాద్యతగా భూగర్భ జలాలను పెంచడానికి తమ తమ ఇంటి ముందు ఇంకుడు గుంటలు తయారు చేయండి.  వీలయినన్ని చెట్లను పెంచండి.  చెరువులోని వ్యర్ధాలను తొలగించి నీటిని కలుషితం కాకుండా చూడండి.  చెరువులలో కట్టడాలను వ్యతిరేకించండి.  జలసంపద అమూల్యం- కాపాడుకోవడం అనివార్యం.              

Monday, 9 April 2012

మెగా హిట్....!

పెద్ద స్టార్స్కి   కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చి, వారి డేట్స్ కోసం  నెలల తరబడి హీరోల  చుట్టూ తిరిగే దర్శక నిర్మాతలకు "ఈ రోజుల్లో " అనే చిన్న సినిమా ఓ చక్కటి గుణపాఠం నేర్పింది.  ఎలాంటి తారాబలం లేకుండా   అంతా కొత్త వారితో  నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు.  కేవలం    యాబై లక్షలతో ఈ చిత్రాన్ని నిర్మించి, దాదాపు పది కోట్లు వసూలు చేసి, పెద్ద సినిమాలకు పోటీ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. కథ విషయంలో దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటే  విజయం తధ్యమని 'ఈ రోజుల్లో'సినిమా దర్శకుడు నిరూపించారు.  మండు వేసవిలో  చల్లని హిమపాతంలా తెలుగు  ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ప్రతి ప్రేమ్ లోను కనిపిస్తాయి.    నటీనటులంతా  కొత్త వారయినా  తమ తమ శక్తి మేరకు నటించారు.  లక్షల రూపాయల పెట్టుబడితో  కోట్ల రూపాయలు వసూలు చేసే సినిమానే పెద్ద సినిమా. అదే మెగా హిట్.






Sunday, 19 February 2012

అంతా శివమయం---అంతటా శివారాధన!


అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
                         
      ప్రతి సంవత్సరం మాఘమాసంలో చతుర్ధశి నాడు వచ్చే పర్వదినం మహాశివరాత్రి. నెలకొక శివరాత్రి వస్తుంది.  కానీ, ఉత్తరాయణం, మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అని పిలువబడుతోంది. మిగతా పదకొండు శివరాత్రులను మాస శివరాత్రులంటారు. మహాశివరాత్రి అనగా మంగళకరమైన రాత్రి. తేజోలింగ రూపంలో శివుడు అర్థరాత్రి ఆవిర్భవించిన రోజు.  అందుకే ఆ రాత్రి జాగారానికి విశేషమైన ప్రాముఖ్యత వుంది.  శివుడు లింగ రూపం నుండి నిజరుపానికి వచ్చే శుభప్రదమైన రోజు. ఈ సంవత్సరం సోమవారం మహాశివరాత్రి రావడం విశేష  ఫలప్రదం. అంతేకాకుండా చతుర్దశి తిధి శివునికి అత్యంత ప్రీతికరమైనది. మహా శివరాత్రి నాడు శివునికి అభిషేకం, పగలు ఉపవాసం, రాత్రి జాగారణ చేసి భక్తితో కొలిచిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు, సకల శుభాలు కలుగుతాయని చెబుతారు.  పూజా సమయంలో లింగాష్టకాన్ని పఠిస్తే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి .  శివరాత్రి రోజంతా శివాలయాలలో శంభో శంకర, హరహర మహాదేవ, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో మారుమోగుతాయి. ఆరోజు భక్తుల హృదయాలు శివతత్వంతో నిండిపోతాయి.  శివ అనే పదాన్ని స్మరించగానే పాపాలన్నీ నశించి మోక్షం సిద్దిస్తుంది.
 
 లింగాష్టకం
'బ్రాహ్మమురారిసురార్చితలింగం-నిర్మలభాసితశోభితలింగం I
జన్మజదుఃఖవినాశకలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 1

దేవమునిప్రవరార్చితలింగం - కామదహనకరుణాకరలింగం |
రావణదర్పవినాశకలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 2

సర్వసుగంధిసులేపితలింగం - బుద్ధివివర్ధనకారణలింగం |
సిద్ధసురాసురవందితలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 3

కనకమహామణిభూషితలింగం - ఫణిపతివేష్టితశోభితలింగం |
దక్షసుయజ్ఞవినాశనలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 4

కుంకుమచందనలేపితలింగం - పంకజహారసుశోభితలింగం |
సంచితపాపవినాశనలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 5

దేవగణార్చితసేవితలింగం - భావైర్భక్తిభి రేవ చ లింగం |
దినకరకోటిప్రభాకరలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 6

అష్టదళోపరివేష్టితలింగం - సర్వసముద్భవకారణలింగం |
అష్టదరిద్రవినాశనలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 7

సురగురుసురవరపూజితలింగం - సురవరపుష్పసదార్చితలింగం |
పరమపరం పరమాత్మకలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 8

లింగాష్టక మిదం పుణ్యం - యః పఠే చ్ఛివసన్నిధౌ |
శివలోక మవాప్నోతి - శివేన సహ మోదతే|

ఇతి లింగాష్టకం సంపూర్ణమ్‌'