”శోధిని”

Monday, 20 July 2015

మాటల్లో తేడా ?

అక్కడి విషయాలు ఇక్కడికి, ఇక్కడి విషయాలు అక్కడికి చేరవేయడంలో కొందరికి వెన్నతో పెట్టిన విద్య.  ఇలాంటి వాళ్ళు తాను విన్నదానికి మరికొంత  అదనంగా జోడించి చెప్పడం వీరికి అలవాటు.  ఒక్క మాట వీరి పెదవి దాటి మన చెవిలో పడేసరికి ఎన్నో కొత్త విషయాలు తోడవుతాయి.  అభూత కల్పనలు జోడించి ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెబుతుంటారు.  ఇలాంటి  వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే,  ఏ అసూయ లేకుండా మనసు విప్పి హాయిగా మాట్లాడలేరు.  పైకి మంచిగా మాట్లాడుతునట్టు అనిపించినా, వీరి మాటల్లో తేడా స్పష్టంగా కనబడుతుంది. ఎంత తీయగా మాట్లాడినా, వారి మనసులో మాత్రం విషం నింపుకొని ఉంటారు. ఎదుటివారిని ఏదోవిధంగా అవమానించడానికో, బాధించడానికో ప్రయత్నిస్తూ ఉంటారు. 

Saturday, 18 July 2015

అవినీతిపరులు అంటే ..!



అవినీతిపరులు అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ప్రభుత్వ అధికారులు, రాజకీయనాయకులే!  ఎందుకంటే   వాళ్ళే  పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతూ ఉంటారుకాబట్టి.  కాని, మన మధ్యలోనే ఉంటూ “సేవ” అనే ముసుగులో అవినీతికి పాల్పడే వాళ్ళు   చాలామంది ఉన్నారు.    ఇలాంటి వాళ్ళు  అన్ని రంగాలలో వాడ వాడలో   దర్శనమిస్తుంటారు.   వాళ్ళు చేసే సేవ గోరంత... ప్రచారం చేసుకొనేది  కొండంత.  అవినీతికి పాల్పడుతున్నామని వాళ్ల మనసాక్షికి తెలుసు.  కాని బయట  ప్రపంచానికి మాత్రం తాము గొప్ప నీతిమంతులమి నమ్మిస్తుంటారు.  ఇలాంటి వాళ్ళు వేలకు, వందలకు కక్కుర్తి పడుతుంటారు కాబట్టి, వీళ్ళ గురించి  ప్రజలు పెద్దగా పట్టించుకోరు. సమాజానికి, ప్రజలకు    సేవ చేయాలనుకొనేవాడు  సేవకుడిలా ఉంటూ,  నిస్వార్థంతో ఎక్కువ సహనం కలిగి ఉండాలి.  అప్పుడే మంచి సేవకుడనిపించు కుంటాడు... నీతిమంతుడపించుకుంటాడు. 

Monday, 13 July 2015

నీ కోపమే ..నీకు శత్రువు !

 

కోపం నిప్పులాంటిది.  దాన్ని అదుపులో ఉంచుకోకపోతే విచక్షనాజ్ఞానం కోల్పోయి, మానవత్వాన్ని మరచిపోతారు.  అందుకే మనిషికి అహంకారం, కోపం పనికిరాదు.  నేను చెప్పేదే వేదమని, నా మాటే వినాలనే అహంతో మూర్ఖుడిగా విర్రవీగితే,  చివరికి సమాజంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

Saturday, 11 July 2015

దేవాలయం ...శోభాయమానం !

దేవాలయం అతి పవిత్రమైనది.  ఆ పవిత్ర స్థలంలో చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, గాలి  అన్నీ అత్యంత పవిత్రమైనవే!  అక్కడ ఉన్నంత సేపు మనసు ప్రశాంతతను పొందుతుంది.  బాహ్యప్రపంచాన్ని వీడి, ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించి మధురమైన అనుభూతిని పొందుతాం.  అక్కడ పవిత్రమైన ఆలోచనలతో ఉంటే,  మనలో ఉండే అన్ని రుగ్మతలు తొలగిపోతాయి.